breaking news
prakash mehra
-
11 ఫ్లాప్‌లతో కెరీర్ క్లోజ్ అనుకున్న వేళ..
భారతీయ చలనచిత్ర పరిశ్రమలో అమితాబ్ బచ్చన్ పేరు ఒక ప్రభంజనం. అయితే ఒకానొక సమయంలో ఆయన కెరీర్ పతనావస్థకు చేరింది. వరుసగా 11 సినిమాలు ఫ్లాప్ కావడంతో ‘బిగ్ బీ’ నటనకే గుడ్ బై చెప్పాలనుకున్నారు. సరిగ్గా అదే సమయంలో బాలీవుడ్ చిత్రాల గమనాన్ని, అమితాబ్ బచ్చన్ తలరాతను పూర్తిగా మార్చేస్తూ 1973లో ఒక సంచలన చిత్రం విడుదలైంది. అదే ‘జంజీర్’. ఈ సినిమా వెనుక ఉన్నది మరెవరో కాదు, హిందీ చిత్రసీమలో ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ యుగానికి నాంది పలికిన దిగ్గజ దర్శకుడు, నిర్మాత ప్రకాష్ మెహ్రా. రైల్వే స్టేషన్లో ఆకలితో పడుకున్న ఒక సామాన్యుడు, భారతీయ సినిమా చరిత్రలోనే అత్యంత ప్రభావవంతమైన దర్శకుడిగా ఎలా ఎదిగారు అనేది నిజంగా ఒక సినిమా స్క్రిప్ట్‌ను తలపిస్తుంది.వీధుల నుండి ముంబై కలల ప్రపంచానికి..ప్రకాష్ మెహ్రా 1939 జూలై 13న ఉత్తరప్రదేశ్ లోని బిజ్నోర్‌లో జన్మించారు. చిన్నతనంలోనే తల్లి చనిపోవడం, తండ్రి సన్యాసం స్వీకరించి ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో ఆయన ఒంటరివారయ్యారు. మేనమామల దగ్గర పెరిగిన మెహ్రా, తన 13-14 ఏళ్ళ ప్రాయంలోనే కలల నగరం ముంబైకి పారిపోయి వచ్చారు. ముంబైలో బతకడానికి ఆయన పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తలదాచుకోవడానికి చోటు లేక రైల్వే స్టేషన్లో ఆకలితో నిద్రపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయి. పొట్టకూటి కోసం ఒక కటింగ్ షాప్‌లో పనిచేశారు. థియేటర్లలో ఫ్లోర్ క్లీన్ చేయడం, స్టేజ్ పై తెరలు లాగడం వంటి చిన్న చిన్న పనులు చేస్తూ జీవనం సాగించారు.టీ బాయ్ నుండి స్టార్ డైరెక్టర్‌గా..సినిమా రంగంపై ఉన్న ఆసక్తితో ఎలాగోలా స్టూడియోలలో అడుగుపెట్టిన ప్రకాష్ మెహ్రా, మొదట్లో నటీనటులకు, సాంకేతిక నిపుణులకు టీ అందించే చిన్న ఉద్యోగిగా చేరారు. అలా అందరికీ చాయ్ పోస్తూనే సినిమా మేకింగ్‌లోని మెళకువలను గమనించేవారు. క్రమంగా ప్రొడక్షన్ కంట్రోలర్‌గా మారి, ఆ తర్వాత దర్శకులకు అసిస్టెంట్‌గా చేరి మెగాఫోన్ పట్టే స్థాయికి ఎదిగారు. 1968లో శశి కపూర్ ద్విపాత్రాభినయంలో వచ్చిన ‘హసీనా మాన్ జాయేగీ’ సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. మొదటి ప్రయత్నమే మంచి విజయాన్ని సాధించడంతో పరిశ్రమలో ఆయన పేరు మారుమోగింది. ఆ తర్వాత ‘మేళా’ (1971), ధర్మేంద్రతో ‘సమాధి’, రాజేంద్ర కుమార్‌తో 'ఆన్ బాన్' వంటి విజయవంతమైన చిత్రాలను అందించారు.భార్య నగలు కుదువబెట్టి తీసిన ‘జంజీర్’1973లో ప్రకాష్ మెహ్రా కెరీర్‌ను మాత్రమే కాకుండా, భారతీయ సినిమా రికార్డులను తిరగరాసిన ‘జంజీర్’ ప్రాజెక్ట్ మొదలైంది. ఈ సినిమా స్క్రిప్ట్ సిద్ధమయ్యాక దేవ్ ఆనంద్, ధర్మేంద్ర, రాజ్‌కుమార్ వంటి ఆనాటి టాప్ హీరోలందరికీ కథ వినిపించారు. కానీ రకరకాల కారణాల వల్ల వారంతా ఈ సినిమాను తిరస్కరించారు. దాంతో అప్పటికే వరుసగా 11 ఫ్లాపులతో సతమతమవుతున్న అమితాబ్ బచ్చన్‌ను హీరోగా పెట్టాలని మెహ్రా నిర్ణయించుకున్నారు. ఫ్లాప్ హీరోతో సినిమా చేయడానికి ఏ నిర్మాత ముందుకు రాకపోవడంతో, ప్రకాష్ మెహ్రా స్వయంగా తన భార్య నగలను తాకట్టు పెట్టి డబ్బు సమకూర్చుకుని సినిమాను నిర్మించారు.‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ ఉదయించాడిలా..‘జంజీర్’ థియేటర్లలోకి వచ్చి ఒక ప్రభంజనాన్ని సృష్టించింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. అంతవరకు చాక్లెట్ బాయ్, రొమాంటిక్ పాత్రలకే పరిమితమైన హిందీ సినిమాలో, వ్యవస్థపై తిరగబడే ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా అమితాబ్‌ను ప్రకాష్ మెహ్రా ఆవిష్కరించారు. ఈ సినిమాతోనే అమితాబ్ బచ్చన్‌కు ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’ అనే బిరుదు వచ్చింది. అమితాబ్ కెరీర్ ఒక్కసారిగా తిరుగులేని టాప్ గేర్‌లోకి దూసుకెళ్లింది.‘విజయ్’ అనే ఐకానిక్ పేరుతో..అమితాబ్ బచ్చన్‌కు స్క్రీన్ మీద ‘విజయ్’ అనే పేరును మొదటిసారిగా పెట్టింది ప్రకాష్ మెహ్రానే. ‘జంజీర్’ లోని విజయ్ పాత్ర ఎంతగా పాపులర్ అయిందంటే, ఆ తర్వాత అమితాబ్ నటించిన దాదాపు 19 పైగా చిత్రాలలో ఇతర దర్శకులు కూడా ఆయన క్యారెక్టర్ పేరును ‘విజయ్’ గానే కొనసాగించారు. జంజీర్ విజయం తర్వాత ప్రకాష్ మెహ్రా-అమితాబ్ కాంబినేషన్ బాలీవుడ్‌కు ఒక సక్సెస్ ఫార్ములాగా మారింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన హేరా ఫేరి (1976), ముకద్దర్ కా సికందర్ (1978), లావారిస్ (1981), నమక్ హలాల్ (1982), షరాబీ (1984) వంటి చిత్రాలు నేటికీ కల్ట్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి.అంతర్జాతీయ కల.. ముగిసిన ప్రస్థానంబాలీవుడ్ను శాసించిన ప్రకాష్ మెహ్రా హాలీవుడ్ ప్రముఖ నటుడు చార్లెస్ బ్రాన్సన్తో కలిసి ‘ది గాడ్ కనెక్షన్’ అనే అంతర్జాతీయ సినిమాను నిర్మించాలని ప్లాన్ చేశారు. దీని కోసం భారీగా నిధులు కూడా సమకూరాయి. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. కటింగ్ షాప్ వర్కర్ నుండి కోట్లాది మందిని అలరించిన దిగ్గజ దర్శకుడిగా ఎదిగిన ప్రకాష్ మెహ్రా 2009లో కన్నుమూశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, ఆయన సృష్టించిన సినిమాలు, అమితాబ్ బచ్చన్ రూపంలో అందించిన స్టార్డమ్ భారతీయ సినిమా ఉన్నంతవరకు సజీవంగానే ఉంటాయి.ఇది కూడా చదవండి: సరస్సులు మాయం, రిజర్వాయర్లు ఖాళీ -
అలీతో సినిమా చేయాలనుకున్నాం: అమితాబ్
ప్రపంచ ప్రఖ్యాత బాక్సర్ మొహ్మద్ అలీ మరణం పై బాలీవుడ్ ఇండస్ట్రీ స్పందించింది. పలువురు బాలీవుడ్ ప్రముఖులు ఈ లెజెండరీ అథెలెట్ పై ప్రంశంసలు కురిపించగా మరికొంత మంది ఆయనతో ఉన్న అనుబందాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా నేషనల్ మీడియాతో మాట్లాడిన బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. 1979లో బిగ్ బీ మొహ్మద్ అలీని స్వయంగా కలిసినట్టుగా తెలిపారు. 'ప్రముఖ దర్శకుడు ప్రకాష్ మెహ్రాతో కలిసి లాస్ ఏంజిల్స్ లోని ఆయన ఇంటికి వెళ్లాం. అలీ చాలా సింపుల్ గా ఉన్నారు. నవ్వుతూ పలకరించారు' అని తెలిపారు. అంతేకాదు అప్పట్లో ప్రకాష్ మెహ్రా అమితాబ్, మొహ్మద్ అలీల కాంబినేషన్ లోసినిమా తెరకెక్కించాలని భావించారట. ఆ విషయం పై చర్చలు జరిపేందుకే అలీ ఇంటికి వెళ్లినట్టు తెలిపారు అమితాబ్. -
‘జంజీర్’ రీమేక్‌పై స్టేకు బాంబే హైకోర్టు నిరాకరణ
ముంబై: గతంలో బాలీవుడ్లో ఘన విజయం సాధించిన ‘జంజీర్’ సినిమా రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు బాంబే హైకోర్టు నిరాకరించింది. దీనిపై కథా రచయితలు సలీమ్‌ఖాన్, జావెద్ అక్తర్‌లు దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. సోమవారం ఈ కేసును విచారించిన బాంబే కోర్టు ఆ చిత్ర రీమేక్ విడుదలపై స్టే విధించేందుకు నిరాకరించింది. పాత జంజీర్ చిత్ర కథ, స్క్రిప్ట్, డైలాగులకు సంబంధించిన కాపీరైట్లు తమ వద్ద ఉన్నాయని...అందువల్ల అదే పేరుతో దాన్ని రీమేక్ చేసిన నాటి నిర్మాత ప్రకాశ్ మెహ్రా కుమారుల నుంచి రూ. 6 కోట్ల పరిహారం ఇప్పించాలని సలీమ్, జావెద్‌లు కోర్టును కోరారు. తమ స్క్రిప్టు ఆధారంగా ఒకసారి చిత్రాన్ని తెరకెక్కించేందుకే గతంలో ప్రకాశ్ మెహ్రాకు అనుమతి ఇచ్చామన్నారు. అందువల్ల రెండోసారి తమ అనుమతి లేకుండా ఈ చిత్రాన్ని రీమేక్ చేయడం కుదరదన్నారు. అయితే పిటిషనర్లు ఆలస్యంగా ప్రతివాదులపై కేసు వేయడంతోపాటు స్వయంగా నగదు రూపంలో పరిహారం కోరుతున్నందున ఈ చిత్రంపై స్టే విధించాల్సిన అవసరం లేదని హైకోర్టు అభిప్రాయపడింది. కేసు తదుపరి విచారణను మంగళవారానికి వాయిదా వేసింది. టాలీవుడ్ హీరో రామ్‌చరణ్‌తేజ జంజీర్ రీమేక్ ద్వారా తొలిసారి బాలీవుడ్‌కు పరిచయం అవుతున్నాడు. ఈ సినిమా శుక్రవారం విడుదల కానుంది.


