రష్యాను షేక్ చేస్తున్న ‘బోరిస్ నదెజ్దిన్’ ఎవరు? | Who is Boris Nadezhdin Putin critic arrested before Russias parliamentary vote | Sakshi
Sakshi News home page

రష్యాను షేక్ చేస్తున్న ‘బోరిస్ నదెజ్దిన్’ ఎవరు?

Jul 14 2026 9:39 AM | Updated on Jul 14 2026 9:39 AM

Who is Boris Nadezhdin Putin critic arrested before Russias parliamentary vote

మాస్కో: రష్యాలో పార్లమెంటరీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అక్కడి ప్రభుత్వ విధానాలను తీవ్రంగా విమర్శిస్తున్న ప్రముఖ యుద్ధ వ్యతిరేక రాజకీయ నేత బోరిస్ నదెజ్దిన్‌ను రష్యా పోలీసులు అరెస్ట్ చేశారు. 2023లో ఆయన విడుదల చేసిన ఒక వీడియోలో ‘తీవ్రవాద చిహ్నాలను’ ప్రదర్శించారనే ఆరోపణలపై అధికారులు ఈ చర్యలు చేపట్టారు. ఆ వీడియోలో దివంగత ప్రతిపక్ష నాయకుడు అలెక్సీ నవల్నీ ఫోటో ఉండటమే ఇందుకు కారణం.

రాబోయే ఎన్నికల్లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌కు వ్యతిరేకంగా పోటీ చేసేందుకు మద్దతు కూడగడుతున్న తరుణంలో నదెజ్దిన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని, పుతిన్ పరిపాలనను బహిరంగంగా విమర్శించడంతో 2024లో నదెజ్దిన్ దేశవ్యాప్తంగా వెలుగులోకి వచ్చారు. సోమవారం ఆయన తన టెలిగ్రామ్ ఖాతాలో ‘పోలీసులు వచ్చారు’ అని పోస్ట్ చేశారు. ఆ తర్వాత, 2023 వీడియో ఆధారంగా తనపై తీవ్రవాద చిహ్నాల ప్రదర్శన కేసు నమోదు చేసినట్లు ధృవీకరించే పత్రాన్ని ఆయన షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆయనను జైలుకు పంపుతారా లేదా దేశం నుండి బహిష్కరిస్తారా అనేది ఇంకా స్పష్టత లేదు. కాగా ఈ అరెస్ట్‌కు మూడు రోజుల ముందు రష్యా అధికారులు ఆయనను విదేశీ ఏజెంట్‌గా ప్రకటించారు.

ఎవరీ బోరిస్ నదెజ్దిన్?
నదెజ్దిన్ దాదాపు 30 ఏళ్ల పాటు మాస్కో ప్రాంతంలో స్థానిక మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేశారు. 1999 నుండి 2003 వరకు ‘యూనియన్ ఆఫ్ రైట్ ఫోర్సెస్’ (ఎస్‌పీఎస్‌)పార్టీ తరఫున రష్యా పార్లమెంట్ (స్టేట్ డుమా) సభ్యుడిగా సేవలందించారు. వరుస ఎన్నికల ఓటముల తర్వాత ఈ పార్టీ 2008లో రద్దయింది. 1990ల చివరలో ఆయన దివంగత ప్రతిపక్ష నాయకుడు బోరిస్ నెమ్త్సోవ్‌కు సలహాదారుగా, సెర్గీ కిరియెంకోకు సహాయకుడిగా పనిచేశారు. వ్యవస్థలో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన రష్యా ప్రభుత్వ టెలివిజన్ టాక్ షోలలో తరచూ కనిపించారు. క్రెమ్లిన్ తనపై వచ్చే స్వల్ప ఉదారవాద విమర్శలను నియంత్రిత పద్ధతిలో వినిపించడానికి ఆయనను ఒక నిపుణుడిగా ఉపయోగించుకునేదని నివేదికలు చెబుతున్నాయి.

పూర్తిగా మారిన వైఖరి
అయితే, 2023లో నదెజ్దిన్ వైఖరి పూర్తిగా మారింది. ఆయన అనూహ్యంగా పుతిన్‌కు వ్యతిరేకంగా అధ్యక్ష ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు ప్రకటించారు. ఉక్రెయిన్‌పై పుతిన్ చేపట్టిన ప్రత్యేక సైనిక చర్య ఒక ఘోరమైన పొరపాటు అని పేర్కొంటూ యుద్ధ వ్యతిరేక నినాదంతో ప్రచారాన్ని ప్రారంభించారు. ఆయన ప్రచారానికి సాధారణ రష్యన్ల నుండి ఊహించని మద్దతు లభించింది. ఆయనకు మద్దతుగా సంతకాలు చేయడానికి వేలాది మంది ప్రజలు భారీ క్యూలలో నిలుచున్నారు. ఎన్నికల్లో పోటీ చేయడానికి అవసరమైన దానికంటే రెట్టింపు సంతకాలను ఆయన సేకరించారు. అయితే ఒక నెల తర్వాత రష్యా సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన సమర్పించిన సంతకాలలో 15 శాతానికి పైగా సాంకేతిక లోపాలు ఉన్నాయని పేర్కొంటూ ఆయన పోటీ చేయకుండా నిషేధించింది. తాజాగా జూలై 2026లో ఆయనను విదేశీ ఏజెంట్‌గా ముద్ర వేశారు.

యూట్యూబ్‌లో విడుదల చేసిన ఒక వీడియోలో ఆయన మాట్లాడుతూ... ‘రష్యాలో పోటీ చేయడానికి సంతకాలు సేకరిస్తున్న ఏకైక స్వతంత్ర ప్రతిపక్ష అభ్యర్థిని నేనే. యుద్ధం వల్ల వస్తున్న పరిణామాలు అందరికీ స్పష్టంగా కనిపిస్తున్నాయి. గత 25 ఏళ్లుగా పుతిన్ దేశాన్ని నడిపిస్తున్న తీరు మిలిటరైజేషన్  వైపు సాగుతోంది. ఈ మార్గం దేశాన్ని తీవ్ర గందరగోళంలోకి నెట్టేస్తుంది. ఇది 1917 రష్యా విప్లవం లాంటి పరిస్థితులకు దారితీస్తుంది’ అని వ్యాఖ్యానించారు. రష్యాలో పార్లమెంటు ఎన్నికలు ఈ ఏడాది సెప్టెంబర్ 20న జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: 11 ఫ్లాప్‌లతో కెరీర్ క్లోజ్ అనుకున్న వేళ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement