రాహుల్‌, ఖర్గేకు ఓపెన్‌ లెటర్‌.. క్షమాపణ చెప్పాల్సిందే! | Melbourne Modi Event Organisers Seek Rahul Kharge Apology | Sakshi
Sakshi News home page

రాహుల్‌, ఖర్గేకు ఓపెన్‌ లెటర్‌.. క్షమాపణ చెప్పాల్సిందే!

Jul 14 2026 8:46 AM | Updated on Jul 14 2026 8:57 AM

Melbourne Modi Event Organisers Seek Rahul Kharge Apology

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ఆస్ట్రేలియాలో నిర్వహించిన 'మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ' కార్యక్రమం రాజకీయ దుమారం రేపుతోంది. ఆ సభకు వచ్చినవారిని 'పెయిడ్‌ క్రౌడ్‌'(డబ్బులిస్తే వచ్చారు) అంటూ కాంగ్రెస్‌ నేతలు చేసిన వ్యాఖ్యలపై ఆ కార్యక్రమం నిర్వాహకులు తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ, ఆ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు బహిరంగ లేఖ ద్వారా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

జూలై 9న మెల్‌బోర్న్‌లోని మార్వెల్‌ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమానికి సుమారు 30 వేల మంది హాజరయ్యారు. సభకు హాజరైన వారిని డబ్బులు ఇచ్చి తీసుకొచ్చారంటూ కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా ఆరోపించారు. విదేశీ మీడియా కథనాలను ప్రస్తావిస్తూ చార్టర్డ్‌ విమానాల ద్వారా ప్రజలను తరలించారని, ఇందుకోసం నిధులు వినియోగించారని విమర్శించారు. అయితే ఈ ఆరోపణలను నిర్వాహకులు పూర్తిగా ఖండించారు. 

'మోదీ ఎయిర్‌వేస్‌' పేరుతో సిడ్నీ నుంచి మెల్‌బోర్న్‌కు ప్రత్యేక చార్టర్‌ విమానాన్ని సమన్వయం చేసిన కమ్యూనిటీ ప్రతినిధులు.. సభకు వచ్చిన వారంతా స్వచ్ఛందంగానే వచ్చారని స్పష్టం చేశారు. ప్రయాణం, వసతి, ఇతర ఖర్చులను ఎక్కువ మంది స్వయంగా భరించారని, మరికొందరికి స్థానిక భారతీయ సంఘాలు మాత్రమే సహకరించాయని పేర్కొన్నారు.

నిర్వాహకుల్లో ఒకరైన అమిత్‌ కరంత్‌ మాట్లాడుతూ.. "ఆస్ట్రేలియాలోని సిడ్నీ, అడిలైడ్‌, బ్రిస్బేన్‌, పెర్త్‌ తదితర ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ఒక్కరికీ కూడా బీజేపీ, భారత ప్రభుత్వం, ఆస్ట్రేలియా ప్రభుత్వం డబ్బులు ఇవ్వలేదు. వారంతా స్వచ్ఛందంగా వచ్చారు. 'పెయిడ్‌ క్రౌడ్‌' అనడం వేలాది మంది భారతీయ-ఆస్ట్రేలియన్లను అవమానించడమే అని అన్నారు.

బహిరంగ లేఖలో నిర్వాహకులు మూడు ప్రధాన డిమాండ్లు చేశారు. చార్టర్‌ విమానానికి బీజేపీ, భారత ప్రభుత్వం నిధులు సమకూర్చిందనే ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని కాంగ్రెస్‌ అంగీకరించాలి. సభకు వచ్చినవారిని 'పెయిడ్‌ క్రౌడ్‌'గా అభివర్ణించిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలి. నిర్వాహకులు, వాలంటీర్లు, ప్రయాణికులు, భారతీయ-ఆస్ట్రేలియన్‌ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలి అని కోరారు.

అలాగే భారతీయ-ఆస్ట్రేలియన్‌ సమాజం ఏ ఒక్క రాజకీయ పార్టీకి చెందినది కాదని కూడా వారు స్పష్టం చేశారు. కొందరు కాంగ్రెస్‌కు, మరికొందరు బీజేపీకి, ఇంకొందరు ఇతర పార్టీలకు మద్దతు ఇస్తారని, చాలా మందికి ఎలాంటి రాజకీయ అనుబంధం కూడా ఉండదని పేర్కొన్నారు. అందువల్ల దేశీయ రాజకీయాల కోసం ప్రవాస భారతీయులను లక్ష్యంగా చేసుకుని విమర్శించడం తగదని సూచించారు.

కాగా, మెల్‌బోర్న్‌లో జరిగిన 'మెల్‌బోర్న్‌ మీట్స్‌ మోదీ' కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్‌, విక్టోరియా రాష్ట్ర ప్రీమియర్‌ జసింటా అలన్‌ కూడా పాల్గొన్నారు. భారత్‌-ఆస్ట్రేలియా సంబంధాలు, ప్రవాస భారతీయుల సేవలను ఈ కార్యక్రమంలో ప్రస్తావించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement