అంతా ప్రపంచం మంచికే! | Sakshi Guest Column By Tankasala Ashok | Sakshi
Sakshi News home page

అంతా ప్రపంచం మంచికే!

Jul 14 2026 12:38 AM | Updated on Jul 14 2026 12:38 AM

Sakshi Guest Column By Tankasala Ashok

ఆర్థిక, రక్షణ విషయాలతో ముడిపడిన ఇటువంటి మార్పులు రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలో గానీ, ఏకధ్రువ ప్రపంచావతరణ జరిగిన తర్వాత గానీ, ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయమంటే అతిశయోక్తి కాకపోవచ్చు.

అభిప్రాయం

జూలై నెల ఇంకా సగం కూడా గడవ లేదు. ఇంకా చెప్పాలంటే ఈ నెలలో 31 రోజులు అయినందున మూడవ వంతే అయినట్లు లెక్క. ఈ కొద్ది కాలంలోనే జపాన్‌ ప్రధాని భారత రాజధానికి వచ్చి వెళ్లగా, భారత ప్రధాని మూడు ముఖ్య మైన దేశాలు ఇండోనేషియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో పర్యటించి స్వదేశానికి చేరుకున్నారు. ఏ కొలమానం ప్రకారం చూసినా ఇది అసాధారణమైనది. ఈ నాలుగింటిలో ఏదీ అపుడపుడు జరుగుతుండే సౌహార్ద్రపూరితమైన సందర్శన కాదు. అన్నింటికి అన్నీ వ్యూహాత్మకమైన కోణాలు గలవి. ఎందుకట్లా?

కొత్త అస్థిరతలు
ఆ చర్చలోకి వెళ్లే ముందు కొన్ని విషయాలు అర్థం చేసుకోవటం అవసరం. లేనట్లయితే ఇన్నిన్ని పర్యటనలు, ఒప్పందాలు ఎందుకు, ఇంత వేగంగా ఎందుకు అన్నది తెలుసుకోలేము. ఈ నెల పర్యటనలకు గత ఆరుమాసాల ప్రయాణాలను కూడా జోడించి చూసిన ప్పుడు విషయం ఇంకా బాగా అర్థమవుతుంది. మొదటిది, ఒకటి రెండేళ్ల క్రితంతో పోల్చితే ప్రపంచ పరిస్థితులు వేగంగా మారుతుండటం. రెండవది, మార్పులన్నవి రాజకీయం, ఆర్థికం, సైనికం, వేర్వేరు కూటములు, శాస్త్ర సాంకేతిక రంగాలు, ఉద్యోగ ఉపాధుల కోసం ఇతర దేశాలకు తరలిపోవటం, పెరుగుతున్న జాతివాదాలు, వీటితో పాటు తీవ్ర రూపం తీసుకుంటున్న వాతావరణ పరిస్థితుల న్నిటా కనిపిస్తున్నాయి. పర్యవసానంగా ప్రపంచమంతటా కొత్త అస్థిరతలు ఏర్పడుతున్నాయి. ఇటువంటి స్థితి ఎప్పుడూ లేదు.

ఇటువంటి పరిణామాల మధ్య ఆసియాతోపాటు మధ్య ఆసియా, పశ్చిమాసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూరప్‌లే గాక, ఉత్తర అమెరికాలో భాగమైన కెనడా వరకు కూడా కొత్త ఒత్తిడులు ఏర్పడుతూ, కొత్త ఆలోచనలు కనిపిస్తున్నాయి. సముద్రాలలో ఎక్కడో విసిరివేసినట్లుండే డజన్లకొద్దీ దేశాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. వాటి సమస్యలు మరింత ప్రమాదకర మైనవి. పెద్ద దేశాలు తమ అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని లెక్క చేయనందువల్ల సముద్ర మట్టాలు పెరుగుతూ, ఆ ద్వీప దేశాలు మునిగి పోగల వేగం కూడా పెరుగుతున్నది. అందుకే అటువంటి వారంతా గత నెల మొదటిసారిగా పెద్ద దేశాలు వేటినీ ఆహ్వానించకుండా, ఐక్యరాజ్యసమితితో సైతం నిమిత్తం లేకుండా, కొలంబియాలో సమావేశమయ్యారు. అన్ని ఖండాలలోని అన్ని దేశాలకూ ఆర్థికం, రక్షణలన్నవి అనిశ్చయమవుతున్నాయన్నది గమనార్హం.

బహుళ ధ్రువ ప్రపంచం
భారత దేశానికిగానీ, మరే దేశానికిగానీ ఆర్థికాభివృద్ధి, దేశ రక్షణ, ఇతర ప్రయోజనాల పరిరక్షణ, నిరాటంకమైన రీతిలో పురోగతి అనే నాలుగు ఆలోచనలు ఎప్పుడూ ఉండేవే. లోగడ కూడా ఇవి సజావుగా ఏమీ సాగలేదు. కానీ సమస్యలు ఇటీవల మరింత పెరుగుతున్నాయి. అందరికీ పెరగటమన్నది ఒక సామాన్య లక్షణంగా మారింది. అందువల్లనే ఇండియా వలెనే అన్ని దేశాలూ ఈ స్థితి నుంచి బయటపడేందుకు ముమ్మరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. దక్షిణ అమెరికా మొదలు కెనడా, యూరప్, ఆఫ్రికాలపైగా తూర్పు ఆసియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ల వరకు ఆర్థిక, రక్షణ ఒప్పందాల కోసం భారత ప్రధాని పర్యటనలు చేయటమే కాదు, ఒప్పందాల అవసరాన్ని గుర్తించి వారు కూడా ఇటు వస్తున్నారు.

ఇండియాను అట్లుంచి వారిలో వారు కూడా పరస్పర ప్రయాణాలు, ఒప్పందాలు చేసుకుంటున్నారు. వేర్వేరు దేశాధినేతల ఆకాశయా నాలు ఇంతగా బహుశా లోగడ ఎప్పుడూ జరిగి ఉండవు. ఆర్థిక, రక్షణ విషయాలతో ముడిపడిన ఇటువంటి మార్పులు రెండవ ప్రపంచ యుద్ధానంతర ప్రపంచంలోగానీ, ఏకధ్రువ ప్రపంచావ తరణ జరిగిన తర్వాతగానీ, ప్రపంచ చరిత్రలో ఒక కొత్త అధ్యాయ మంటే అతిశయోక్తి కాకపోవచ్చు.

ఏ దేశమైనా అభివృద్ధి చెందాలనీ, భద్రంగా ఉండాలనీ కోరుకుంటుంది. రెండవ ప్రపంచ యుద్ధం, ఆ తర్వాత ఆర్థిక సంస్క రణల కాలం నుంచి ఒకవైపు వస్తూత్పత్తి, వినియోగాలు చరిత్రలో ఎన్నడూ లేనట్లు పెరుగుతుండగా, మరొకవైపు అన్ని దేశాలలో ప్రజల అవసరాలు, ఆకాంక్షలు అదే స్థాయిలో పెరగసాగాయి. 

ఈ రెండింటికి తగిన విధంగా అభివృద్ధిని సాధించి, దేశ భద్రతా ఏర్పాట్లను కూడా పెంచవలసిన బాధ్యత సహజంగానే ప్రభుత్వాలపై పడింది. ఆ బాధ్యతలను నెరవేర్చలేని ప్రభుత్వాలు ఓటింగ్‌ ద్వారానో, తిరుగుబాట్ల వల్లనో కూలిపోవటాన్ని చూస్తు న్నాము. ఈ విధమైన పరిణామాలు అంతర్గతమైన ఒత్తిడులు కాగా, అదే విధమైన ఒత్తిడులు వేరే రూపాలలో, బయటి పరిణామాల వల్ల ఏర్పడటం ఇటీవలి కాలంలో పెరగటం మొదలైంది. 

అందుకు నాంది ఆర్థిక సంస్కరణలు వర్ధమాన దేశాలకు, మరీ ముఖ్యంగా సాధారణ సామాజిక వర్గాలకు ప్రతికూలమై అసమానతలను పెంచటంతో పడింది. ఇటీవలికి వచ్చేసరికి, పాశ్చాత్య దేశాలు తాము సృష్టించి ఇతరులపై రుద్దిన పలు అంతర్జాతీయ నియమ నిబంధనలు తాము కోరుకున్న ఫలితాలనివ్వటం తగ్గటంతో వాటిని భంగపరచటం మొదలైంది. వారు కొత్త వ్యవస్థలనూ సృష్టించలేక పోతున్నారు. 

ఈ పరిణామాలన్నింటి ఫలితంగా బహుళ ధ్రువ ప్రపంచ భావనలు బలపడటం, ఇండియాతో పాటు కొన్ని ప్రముఖ దేశాలు ‘బ్రిక్స్‌’ వంటి ప్రత్యామ్నాయ సంస్థలను ఏర్పరచటం జరిగింది. బయటకు స్పష్టంగా ప్రకటించకున్నా అమెరికన్‌ డాలర్‌కు సమాంతర కరెన్సీల వినియోగం క్రమంగా విస్తరిస్తున్నది. పులి మీద పుట్ర వలె ట్యారిఫ్‌లు, బలవంతపు వాణిజ్య ఒప్పందాలు, అక్కర లేని యుద్ధాలు, అందరినీ ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

బద్దలవుతున్న చట్రం
వీటన్నింటివల్ల వీరువారని గాక అందరికీ ఎదురవుతున్న సమస్యలు ఏమిటో ఏకరువు పెట్టనక్కరలేదు. ఆ సమస్యలలో ఆర్థిక మైనవి, రక్షణపరమైనవి, ఇతరాలు కూడా ఉన్నాయి. ఈ రెండు రంగాలకు సంబంధించి అమెరికాకు సన్నిహిత దేశాలైన యూరప్, కెనడా, జపాన్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఫిలిప్పీన్స్, మెక్సికో, గల్ఫ్‌ రాజ్యాల వంటివి సైతం తమలో తామే గాక ఇండియా, బ్రెజిల్, దక్షిణ అమెరికా, దక్షిణాఫ్రికా వంటి ఇతర దేశాలతోనూ ఇటీవలి ఆరు మాసాలలో చేసుకుంటూ వస్తున్న ఆర్థిక ఒప్పందాలు ఈ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. 

కెనడా, యూరప్‌ల వంటివి అమెరికా వద్దన్నా... చైనాతో ఒప్పందాలను ఆర్థిక భద్రత కోసం చేసుకుంటున్నాయి. ఈ మార్పులు, మలుపులు ప్రపంచాన్ని అను కోని రీతిలో పాత చట్రం నుంచి బయటకు తెస్తున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత బ్రెట్టన్‌వుడ్స్‌ సంస్థల నుంచి ఆర్థిక సంస్కరణల వరకుండిన ఒక చట్రం, అప్పటి నుంచి ఉండిన రెండవ చట్రం ఇప్పుడు భగ్నమవుతున్న దృశ్యాన్ని మనమిపుడు చూస్తున్నాము. మన జూలై ఒప్పందాలు కూడా విస్తృతార్థంలో అదే పరిధి లోకి వస్తాయి. అంతటా అందరూ క్రమంగా స్వతంత్ర నిర్ణయా లతో, పరస్పర ఒప్పందాలతో, స్వతంత్రంగా ఎదిగేందుకు,భద్రంగా జీవించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

టంకశాల అశోక్‌
వ్యాసకర్త సీనియర్‌ సంపాదకుడు 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement