విశ్లేషణ
2021 వసంతకాలంలో భారతదేశంలో రెండో కోవిడ్ అల ఆసుపత్రులను ముంచెత్తుతున్న సమయంలోనూ ఒక ప్రమాదకరమైన అపోహ విస్తృత ప్రచారంలో ఉంది: ‘దక్షిణాసియా ప్రజలకు కరోనా వైరస్‌పై సహజమైన రోగనిరోధక శక్తి ఉంది.’ ఇది ఎలా పుట్టింది? దాని వల్ల ఎంత నష్టం జరిగింది? రాబోయే మహమ్మారులకు సిద్ధంగా ఉండాలంటే ఈ ప్రశ్నలకు జవాబులు తెలుసుకోవలసిందే.
గణాంకాల తప్పు
మొదటి తప్పు గణాంకాల్లో జరిగింది. భారత్, బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో అధికారికంగా నమోదైన కోవిడ్ మరణాల సంఖ్య అసలు మరణాల కంటే చాలా తక్కువగా ఉంది. పరీక్షలు పరిమితంగా ఉండటం, మరణాల నమోదు వ్యవస్థలు బలహీనంగా ఉండటం వల్ల అనేక మరణాలు నమోదు కాలేదు. మరికొన్నింటిని ఇతర కారణాల వల్ల జరిగిన మరణాలుగా నమోదు చేశారు.
2021 చివరి వరకు భారత ప్రభుత్వం ప్రకటించిన కోవిడ్ మరణాల సంఖ్య లక్షల్లోనే ఉంది. అయితే ‘ద లాన్సెట్’, ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ’ చేసిన స్వతంత్ర అధ్యయనాలు... ఏడాది కాలంలో సాధారణంగా నమోదయ్యే మరణాల కంటే అదనంగా సంభవించిన మరణాలు 40 నుంచి 50 లక్షలు ఉండొచ్చని అంచనా వేశాయి. ప్రభుత్వ ప్రకటనల్లో తక్కువ మరణాల సంఖ్య ప్రజలకు ఊరట నివ్వొచ్చు. కానీ అవే నిజమని నమ్మితే నిర్లక్ష్యానికి దారితీస్తాయి.
‘అదనపు మరణాలు’ అనే ప్రమాణం మరింత విశ్వసనీయ మైనది. ఎందుకంటే ఒక మరణాన్ని కోవిడ్‌గా నమోదు చేశారా, న్యుమోనియాగా నమోదు చేశారా, లేక కారణం తెలియదని పేర్కొ న్నారా అనే విషయాన్ని అది పట్టించుకోదు. సాధారణంగా ఏడాదిలో ఎంతమంది మరణిస్తారు, వాస్తవంగా ఎంతమంది మర ణించారు అనే తేడాను మాత్రమే అది పరిశీలిస్తుంది. ఈ ప్రమాణంతో చూస్తే దక్షిణాసియా దేశాల ప్రజలకు అసాధారణ రక్షణ ఉందనేది సరికాదు. అది కేవలం తక్కువ లెక్కింపు వల్ల కనిపించే దృశ్యం అని అర్థమవుతుంది.
జీవన విధానాల ప్రభావం
ప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో కోవిడ్ ప్రభావం తక్కువగా కనిపించడానికి మరో కారణం జీవశాస్త్రం కాదు. పర్యావరణం, ప్రజల జీవన విధానం. గాలి సరిగా వీచే ప్రదేశాలు, జనసాంద్రత, ప్రయాణ అలవాట్లు, ఇంటి లోపల గడిపే సమయం వంటి అంశాలు వైరస్ వ్యాప్తిపై పెద్ద ప్రభావం చూపుతాయి. దక్షిణా సియాలో చాలా ప్రాంతాల్లో వీధి వ్యాపారం, కూలి పని, సామాజిక కలయిక వంటి రోజువారీ కార్యకలాపాలు బహిరంగ ప్రదేశాల్లోనే జరుగుతాయి. అక్కడ గాలి స్వేచ్ఛగా వీస్తుంది. కాబట్టి వైరస్ అంత వేగంగా వ్యాపించదు. అందువల్ల ప్రారంభ దశలో కొన్ని ప్రాంతాల్లో వైరస్ నెమ్మదిగా వ్యాపించి ఉండొచ్చు. అంతేకాని అది ప్రజల్లో సహజ రోగనిరోధక శక్తి ఉన్నందు వల్ల కాదనేది గమనించాలి.
ఇది జీవశాస్త్రానికి సంబంధించిన కథ కాదు. నగరాల నిర్మాణం, జీవనశైలి వంటి అంశాలకు సంబంధించిన విషయం. మూసివేసిన, ఎయిర్‌కండిషన్ భవనంలో వైరస్ ఒక విధంగా, బహిరంగ మార్కెట్‌లో మరో విధంగా వ్యాపిస్తుంది. గాలిలో వైరస్ ఎక్కువసేపు నిలిచే పరిస్థితులు ఉన్నచోట తీవ్రంగా వ్యాపించింది. అలాంటి పరిస్థితులు లేని చోట వ్యాప్తి ఆలస్యమైంది. ఈ అనుభవం మనకు నగర ప్రణాళిక, మౌలిక సదుపాయాలు, ప్రజారోగ్య పెట్టు బడుల ప్రాముఖ్యాన్ని నేర్పాలి. కానీ దానిని ప్రజల సహజ రోగనిరోధక శక్తికి నిదర్శనంగా తప్పుగా అర్థం చేసుకున్నారు.
1918లో వచ్చిన ఇన్‌ఫ్లుయెంజా మహమ్మారి భారత ఉపఖండంలో సుమారు 1.2 కోట్ల నుంచి 1.7 కోట్ల మంది ప్రాణాలు తీసింది. ప్రపంచంలోని ఏ ఒక్క దేశంలోనైనా నమోదైన అతిపెద్ద మరణాల సంఖ్యల్లో ఇది ఒకటి. 19వ శతాబ్దంలో కలరా మహ మ్మారులు గంగానది పరివాహక ప్రాంతం నుంచి పదే పదే వ్యాపించాయి. ఈ చరిత్ర చెబుతున్న విషయం ఒక్కటే. ఈ ప్రాంత ప్రజలకు ప్రత్యేక రక్షణ లేదు. బలహీనమైన ఆరోగ్య వ్యవస్థలు, సరిపోని మౌలిక సదుపాయాల వల్ల ప్రమాదం మరింత పెరుగుతుంది.
కోవిడ్ సమయంలో టెలివిజన్ కార్యక్రమాల్లో కొందరు మూలికల మందులు రోగనిరోధక శక్తిని పెంచుతాయని ప్రచారం చేశారు. భారతదేశంలో బీసీజీ టీకా ఎక్కువ మందికి వేయడం వల్ల రక్షణ లభించిందని కొందరు అధికారులు సూచించారు. సోషల్ మీడియాలో ఇలాంటి వాదనలు వేగంగా వ్యాపించాయి. వాటిని ప్రశ్నించే శాస్త్రీయ స్వరాలు అంతగా వినిపించలేదు. ఇలాంటి ప్రచారం వల్ల అసలు ప్రమాదం ప్రజల ప్రవర్తనలో కనిపిస్తుంది. ‘మనం ఇప్పటికే రక్షితులం’ అని నమ్మినవారు పరీక్షలు చేయించు కోవడానికి, ఇతరుల నుంచి దూరంగా ఉండడానికి, టీకాలు వేయించుకోవడానికి, లక్షణాలు కనిపించిన వెంటనే ఆసుపత్రికి వెళ్లడానికి తక్కువ ఆసక్తి చూపుతారు.
ఎలా ఎదుర్కోవాలి?
సంప్రదాయ ఆహారం, ఇంటి చిట్కాలు ఆరోగ్యానికి కొంత మేలు చేయవచ్చు. కానీ ఊపిరితిత్తులపై దాడి చేస్తున్న వైరస్‌ను అవి ఆపలేవు. ఆ సమయంలో అవసరమయ్యేది ఆక్సిజన్ చికిత్స, వైద్య సేవలు. ఈ రెండింటి మధ్య తేడాను చెరిపేసిన తప్పుడు ప్రచారం సాంస్కృతిక అతిశయం మాత్రమే. ఇది నివారించగలిగిన మరణాలకు కూడా కారణమైంది. మహమ్మారి ముగిసిన తర్వాత కూడా తప్పుడు సమాచారం ఎందుకు నిలిచిపోతుంది? ఎందుకంటే అది ప్రజలకు మానసిక ధైర్యాన్ని ఇస్తుంది. ‘మన ప్రజలు బలమైనవారు’, ‘మన సంప్ర దాయాలు మనల్ని కాపాడతాయి’ అనే మాటలు భయంతో ఉన్న సమయంలో ఆకర్షణీయంగా అనిపిస్తాయి. దానికి విరుద్ధంగా ‘వైరస్‌కు మీ సంస్కృతి తెలియదు. మీ చరిత్రతో దానికి సంబంధం లేదు’ అనే సందేశం అంతగా నచ్చదు.
భవిష్యత్తులో సంభవించబోయే విపత్తులను ఎదుర్కోవడానికి తప్పుడు కథనాలను అధిగమించి నిజాలపై ఆధారపడగలిగిన వ్యవ స్థలను నిర్మించాలి. అందుకోసం మరణాల నమోదును బలోపేతం చేయాలి. గ్రామీణ ప్రాంతాలు, పట్టణాల శివార్లలో ప్రాథమిక ఆరోగ్య సేవలను మరింత బలపరచాలి. తప్పుడు సమాచారం ఎలా వ్యాపిస్తుందో అర్థం చేసుకునే ప్రజారోగ్య సమాచార వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆధారాలు లేని వాదనలను ప్రచారం చేసే అధికారులు, మీడియా వ్యక్తులను జవాబుదారులుగా నిలబెట్టాలి. దక్షిణాసియా వాసులకు సహజ రోగనిరోధక శక్తి ఉందనే అపోహ మనకు నేర్పిన ప్రధాన పాఠం ఒక్కటే: ‘శ్వాసకోశ వైరస్‌ల నుంచి ఏ జాతికీ, ఏ దేశానికీ సహజ రక్షణ ఉండదు’. ప్రజలను రక్షించేది అపోహలు కాదు. ముందస్తు సన్నద్ధత, వ్యాధులపై నిఘా, ప్రజల విశ్వాసం, సరైన సమయంలో తీసుకునే చర్యలే.
మహమ్మారి ఉద్ధృతమయ్యేలోపే ఈ పాఠం నేర్చుకుంటే ప్రాణాలు నిలుస్తాయి. అదే ఆలస్యంగా నేర్చుకుంటే, ఆసుపత్రి కారి డార్లలో, ఆక్సిజన్ సిలిండర్ల కోసం క్యూల్లో నిలబడి ఆ నిజాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అప్పుడు చెల్లించాల్సిన మూల్యం గణాంకాల్లో కాదు. అంత్యక్రియల్లో కనిపిస్తుంది.
మేడా పరమేశ్వర రెడ్డి
వ్యాసకర్త ఇండో–అమెరికన్ రిటైర్డ్ సైంటిస్ట్, ‘రెడ్డి సెంటర్ ఫర్ క్రిటికల్ అండ్ ఇంటిగ్రేటెడ్ థింకింగ్’ డైరెక్టర్


