మాధవ్ శింగరాజు
‘‘భద్రం పవార్ జీ...’’ అంటూ ఒక్క గెంతున వచ్చి, నా చేతికి తన భుజాన్ని అందించారు ఏక్‌నాథ్ షిందే! ‘‘పడిపోనులే ఏక్‌నాథ్. కాసేపు మీ ఛాంబర్‌లో కూర్చుందామని వచ్చాను. కూర్చోవచ్చు కదా?’’ అన్నాను నవ్వుతూ. ‘‘పవార్ జీ, ఇంతటి గౌరవాన్ని మరెవరికైనా నేనెందుకు దక్కనిస్తాను! దయచేసి రండి. మీ పార్టీ ఛాంబర్‌ను కూడా కాదని, నా ఛాంబర్‌కి వచ్చారంటే నాకు మీ ఆశీస్సులు ఉన్నట్లుగానే కదా నేను భావిస్తాను. రండి, మెల్లిగా నడవండి’’ అన్నారు ఏక్‌నాథ్. నవ్వాన్నేను. ఏక్‌నాథ్ నన్ను తన ఛాంబర్‌లో కూర్చోబెట్టి, శాలువా కప్పి; పూలు, టెంకాయ చేతికి అందించారు. ‘‘ఏమిటి ఇదంతా ఏక్‌నాథ్?’’ అన్నాను. ‘‘పవార్ జీ, నేనొక ముఖ్యమైన మీటింగులో ఉండగా, మీరు నా ఛాంబర్ అడుగుతున్నారని తెలిసి, వెంటనే మీటింగ్‌ని ఆపి మీకోసం పరుగున వచ్చాను’’ అన్నారు ఏక్‌నాథ్. ‘‘చాలా సంతోషం ఏక్‌నాథ్. అసెంబ్లీ భవన్‌లో ‘బోర్డర్ ఇష్యూ మీటింగ్’ ఉంటే వచ్చాను. తిరిగి వెళ్లేటప్పుడు... మా ఎమ్మెల్యే లతో కాసేపు కలిసి కూర్చోటానికి... మీ ఛాంబర్, ఎంట్రెన్స్‌కి దగ్గరగా ఉందని ఇటొచ్చాను’’ అన్నాను.
‘‘వచ్చినందుకు ధన్యవాదాలు పవార్ జీ...’’ అన్నారు ఏక్‌నాథ్. నాకోసం ప్రత్యేకంగా ‘టీ’ తెప్పించి, నాతో పాటు తనూ టీ సేవించి, నాతో కొద్దిసేపు మాట్లాడి, ‘ఉంటాను పవార్ జీ’ అంటూ సెలవు తీసుకున్నారు ఏక్‌నాథ్. ఏక్‌నాథ్ ఇంకో ఇరవై, ఇరవై అయిదేళ్ల తర్వాత తన ఎనభై ఐదేళ్ల వయసులో కూడా... ఇప్పుడు నాలాగే, లేదా నాకన్నా ఎక్కువగానే ఉత్సాహంగా ఉంటాడనుకుంటా! ఉన్నచోటే ఉండిపోయేవాళ్లకు పాలిటిక్స్‌లో భవిష్యత్తు ఉండదు. పేరుకు ఉంటారంతే. ఇక్కడ ఎదగాలంటే సిద్ధాంత పరమైన విభేదాలు ఉండాలి. వ్యక్తిగత ఘర్షణలు ఉండాలి. అధికార సమీకరణాలపై ఒక కన్ను, ఒక చెవి వేసి ఉంచాలి. ఒక కాలును లోపల, ఒక కాలును బయటా ఉంచాలి. రాజీవ్ హత్య తర్వాత నేను ప్రధాని అవ్వాల్సింది. ‘అతడికి స్వతంత్ర భావాలు ఎక్కువ’ అని నా మీద సోనియాజీకి చెప్పి,నేను ప్రధాని కాకుండా అడ్డుపడి నన్ను బయటికి పంపించారు.
ఏక్‌నాథ్‌వి నాకు మించిన స్వతంత్ర భావాలు! శివసేన తన ‘హిందుత్వ’ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి ఎన్సీపీ, కాంగ్రెస్‌లతో కలిసి కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటం ఏంటని అతడు బయటికి వచ్చేశాడు. నాలా ఒక్కడే రాలేదు. శివసేనను సగం తెంపుకుని వచ్చేశాడు. నేను పీఎంని కాలేకపోయాను. ఏక్‌నాథ్ సీఎం అయ్యాడు. ఇప్పుడు డిప్యూటీ సీఎం. మళ్లీ సీఎం అయినా అవుతాడు. ఏక్‌నాథ్ ఛాంబర్‌లో నేను కాసేపు కూర్చొని వచ్చినందుకు... ‘‘ఏక్‌నాథ్ అనే ద్రోహి ఛాంబర్‌లోకి శరద్ జీ వెళ్లి కూర్చోవటం ఏంటి?!’’ అని ఉద్ధవ్ శివసేన విమర్శిస్తోంది. కూటమిలోని తక్కిన పార్టీలు కూడా... ‘‘వాళ్లేమిటి? వాళ్ల వంశం ఏమిటి? వాళ్ల ఛాంబర్‌కి శరద్ జీ వెళ్లటం ఏమిటి?’’ అని భృకుటి ముడేస్తున్నాయి! ‘‘శరద్ జీ కూర్చోదలచుకుంటే ఏక్‌నాథ్ ఛాంబరే దొరికిందా! అసెంబ్లీ ప్రాంగణంలో మన ఛాంబర్లు లేవా? పోనీ, అవి వద్దనుకుంటే వై.బి. చవాన్ ప్రతిష్ఠాన్ లేదా? ఎన్సీపీ ఆఫీస్ ‘రాష్ట్రవాది భవన్’ లేదా?’’ అంటున్నారు ఉద్ధవ్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్!
చవాన్ ప్రతిష్ఠాన్, రాష్ట్రవాది భవన్ అసెంబ్లీ ప్రాంగణంలో లేవు. చవాన్ ప్రతిష్ఠాన్ నారిమన్ పాయింట్‌లో ఉంది. ఏక్‌నాథ్ ఛాంబర్ నాకు నాలుగడుగుల దూరంలో ఉంది; రాష్ట్రవాది భవన్ దక్షిణ ముంబైలోని బల్లార్డ్ ఎస్టేట్‌లో ఉంది. ఏక్‌నాథ్ ఛాంబర్ నా భుజానికి దగ్గరగా ఉంది. రౌత్‌కు ఇది ఎందుకు తెలియకుండా ఉంది?! దూరాలు గ్రహించలేనివారు, ఎప్పటికీ దగ్గరగా ఆలోచించలేరు.


