నిష్కళంక నాయకుడు.. | Guest Column Special Story On Kommidi Narsimha Reddy | Sakshi
Sakshi News home page

నిష్కళంక నాయకుడు..

Jul 11 2026 12:27 PM | Updated on Jul 11 2026 12:37 PM

Guest Column Special Story On Kommidi Narsimha Reddy

కొమ్మిడి నర్సింహారెడ్డి

నివాళి

న సొంత గ్రామం బ్రాహ్మణపల్లి సర్పంచిగా, భువనగిరి పంచాయతి సమితి అధ్యక్షునిగా, ఎమ్మెల్యేగా అట్టడుగునుంచి ఎదిగిన కొమ్మిడి నర్సింహారెడ్డి ఇవ్వాళ లేడు. కొంత కాలంగా అనారోగ్యంతో సతమతమవుతూ తన 83వ ఏట జూలై 7న ‘నిమ్స్‌’ ఆసుపత్రిలో కన్నుమూశారు. సొంత ఇల్లు కూడా లేని నర్సింహారెడ్డి దంపతులకు నిమ్సే ఒక ఇల్లయింది. స్నానానికని బాత్‌రూమ్‌లోకెళ్లి చన్నీళ్ల నల్లా ఇప్పు తున్నాననుకొని వేడినీళ్ల నల్లా ఇప్పితే... కాళ్ళు బొబ్బలెక్కి చివరి రోజుల్లో అవస్థపడ్డారు. ఊళ్ళో ఉన్న ఇల్లు (పెద్దల ద్వారా సంక్రమించింది) శిథిలం కాగా, హైదరాబాదు పెద్దకూతురు ఇంట్లో ఉండేవారు.

ఒక చారిత్రక కుటుంబం నుంచి వచ్చినవారు నర్సింహా రెడ్డి. వారి అన్న కోదండ రాంరెడ్డి, తెలంగాణ సాయుధ పోరాటంలో భాగస్వామి. పోలీస్‌ స్టేషన్‌లో చంపబడ్డారు. కాంగ్రెస్‌ రాజకీయాలకు కొంతకాలంగా నర్సింహారెడ్డి దూరంగా ఉన్నా విద్యుచ్ఛక్తి సమస్యలపై భువనగిరిలో నిరాహారదీక్ష చేశారు. గోదావరి నీళ్ళు రప్పించడం గురించి, మూసీ నది కాలుష్యం గురించి, పోచంపల్లిలోని రామానంద తీర్థ ఇనిస్టిట్యూట్‌ గురించి తపన పడేవారు. నిఖిలేశ్వర్‌ రాసినట్టు ‘వ్యక్తిగతంగా జీవితంలో – సామాజికంగా ప్రజాస్వామిక విలువలను కాపాడాలని ఆలోచించేవారు’. ఎప్పుడూ ఏదో ఒకటి చేస్తూనే ఉండేవారు. ‘ప్రజా చైతన్య వేదిక’ స్థాపించి సదస్సులు నిర్వహించేవారు. ఉపన్యాసాలు ఇప్పించేవారు. నిజాం కాలం నాటి చరిత్రను అధ్యయనం చేసి, చిన్న చిన్న పుస్తకాలు ప్రచురించి పంచారు.

మా ఇద్దరిది 56 ఏళ్ల అనుబంధం. 1969లో మా మొదటి పరిచయం, తెలంగాణ ఉద్యమ సందర్భంగా. హెచ్‌ఎస్‌సీ పాస్‌ కాగానే సర్పంచిగా పోటీ చేసి గెలిచారు. భువనగిరిలో తెలంగాణ ఉద్యమం జోరందుకున్న రోజులవి. ‘తెలంగాణ ప్రజాసమితి’ అధ్యక్షుడిగా పులుమామిడి బాలక్రిష్ణారెడ్డి, నేను ‘విద్యార్థి కార్యాచరణ సమితి’ కన్వీనర్‌గా, ఇంకా అనేక మంది ఉద్యమం నడుపుతున్న రోజులు. కాంగ్రెస్‌లో గ్రూపులు ఉండేవి. ఒక గ్రూపు ప్రత్యేక తెలంగాణకు అనుకూలం. ఆ గ్రూపులో కొమ్మిడి ఉండేవారు. ఒకరోజు బాలక్రిష్ణారెడ్డి ఇంటికి వచ్చి, ‘తెలంగాణ గురించి ఏం జేయమంటవన్నా’ అని అడిగారు. అప్పుడు బాలక్రిష్ణారెడ్డి ‘మీ సర్పంచులను కొందరిని కలుపుకొని సమితి ఆఫీసు ముందు డేరా వేసి రిలే నిరాహారదీక్షలు చేపట్టండి’ అని సలహా ఇస్తే పాటించారు.

ఒక విషయంలో నాకు నర్సింహారెడ్డి స్ఫూర్తి. ‘అరవై తొమ్మిది’ ఉద్యమం ముగిసింది. ఒకరోజు భువనగిరి తహసిల్‌ ఆఫీసులో తారసపడ్డాం. ‘ఓరేయ్‌ ముత్యం, మీ మామలెక్క నువు కూడా పైరవికారువైతవురా’ అన్నాడు. అప్పుడనిపించింది పైరవికారు అవడం మంచిది కాదూ అని! అది మనసులో ఉండిపోయింది. ఏ నాయకుడి దగ్గరికీ వెళ్లేవాడిని కాదు. తను నన్ను ముత్యం అని పిలిస్తే, నేను అన్నా అని పలికేవాణ్ణి. అన్నా! నర్సన్నా! మసి అంటని నాయకుడా... నీకివే జోహార్లు!
– ఆచార్య కట్టా ముత్యంరెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement