మెదక్: పోలంపల్లి గ్రామ సర్పంచ్ రాజ్యలక్ష్మిని సస్పెండ్ చేస్తూ శుక్రవారం జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల సర్పంచ్‌గా గెలుపొందిన రాజ్యలక్ష్మి భర్త స్వామి హరితహారం మొక్కలు నరికివేయడం, పంచాయతీ కార్యాలయంలోని ఫర్నిచర్ ధ్వంసం చేయడం, మరుగుదొడ్లను కూల్చి వేయడంతోపాటు గ్రామ పంచాయతీ కార్యాలయానికి తాళం వేయడం వంటి పనులకు పాల్పడటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
పంచాయతీ రాజ్ చట్టానికి వ్యతిరేకంగా రాజ్యలక్ష్మి భర్త స్వామి సర్పంచ్‌గా వ్యవహరించినట్లు స్పష్టంగా గుర్తించిన డివిజనల్ పంచాయతీ అధికారులు కలెక్టర్‌కు నివేదికను అందించారు. వారి నివేదికల ప్రకారం కలెక్టర్ పొలంపల్లి సర్పంచ్ రాజ్యలక్ష్మిని ఆరు నెలల పాటు తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేశారు. సస్పెండ్ అయిన సర్పంచ్ ఆరు నెలల పాటు అ«ధికారాలు వినియోగించడం, కర్తవ్యం నిర్వహించడం, పంచాయతీ సమావేశాల్లో పాల్గొనడం చేయకూడదని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. కేవలం అవిశ్వాస తీర్మానంలో మాత్రమే పాల్గొనేందుకు అవకాశం ఉందని పేర్కొన్నారు.


