పరిష్కారమే సమస్యగా నిలిచేనా? | Significant progress towards achieving the target of 20 percent ethanol blend in petrol | Sakshi
Sakshi News home page

పరిష్కారమే సమస్యగా నిలిచేనా?

Jul 11 2026 12:40 AM | Updated on Jul 11 2026 12:40 AM

Significant progress towards achieving the target of 20 percent ethanol blend in petrol

భారత్‌ ప్రభుత్వం 2025–26 నాటికి పెట్రోల్లో 20 శాతం ఇథనాల్‌ మిశ్రమం (ఇ20) లక్ష్యాన్ని సాధించే దిశగా గణనీయ మైన పురోగతి సాధించింది. ఇందుకోసం ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడంతో పాటు చమురు మార్కెటింగ్‌ సంస్థల ద్వారా ఇథనాల్‌ కొనుగోలును కూడా విస్తరించింది. అయితే ఈ కార్యక్రమానికి అనేక సవాళ్లు ఉన్నాయి: అధిక నీటి అవసరం; 2023కు ముందు కొన్న లక్షల వాహనాలు ఇ20కి పూర్తిగా అనుకూలంగాలేకపోవడం; ఆహారానికీ, ఇంధనానికీ మధ్య సమతుల్యతను కాపాడటం.

‘నీళ్లు’ కలుపుతున్నారా?
అనేక ప్రాంతాలలో ఇ20తో కూడిన పెట్రోల్‌ వేసుకున్నాక వాహనాలు ఆగిపోవడం, ఇంజిన్‌ చెడిపోవడం వంటి అనుభవాలు పెరిగినాయి. అనేక పెట్రోల్‌ బంక్‌లలో పెట్రోల్‌తో పాటు నీళ్ళు పోస్తున్నారని వాహనదారులు ఆందోళనకు దిగుతున్నారు. ఆమధ్య మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి మొత్తం వాహనశ్రేణికి ఇదే సమస్య ఉత్పన్నమయ్యింది. మధ్యప్రదేశ్‌ పెట్రోల్‌ బంక్‌ల సంఘం కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినా ప్రతిస్పందన లేదు. నిత్యావసర వస్తువు లలో ఒకటైన పెట్రోల్, డిజిల్‌ గురించిన నియంత్రణ జిల్లా కలెక్టర్లు చేస్తారు. వారి అభిప్రాయానికి కూడా ప్రభుత్వం విలువ ఇవ్వడం లేదు. 

పెట్రోల్‌లో ఇథనాల్‌ కలిపితే నీళ్ళు రావడం సాధారణం అని ఒప్పుకొన్నా చమురు కంపెనీలు సాంకేతిక అవసరాలకు అనుగుణంగా కలపడం లేదని పెట్రోల్‌ బంక్‌ల ఆరోపణ. దాదాపు 30 కోట్ల వాహనాలు ఇ20 వల్ల పాడయితే దేశ ఆర్థిక స్థితి, వ్యక్తిగత వాహనదారుల మీద పడే ఆర్థిక భారం గురించి ఆలో చన చేయవలసి ఉన్నది. సరుకు రవాణా వాహనాలు మొరాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఆటోలు, టాక్సీ తదితర రవాణా సదుపాయాలు కుంటుపడితే ఆ యా కుటుంబాల మీద భారంతో పాటు నిత్య రవాణా మీద దుష్ప్రభావం ఉంటుంది.

పర్యావరణ హితమేగానీ...
భారత్‌లో ఇథనాల్‌ కార్యక్రమం (ఇథనాల్‌ బ్లెండెడ్‌ పెట్రోల్‌ ప్రోగ్రామ్‌–ఈబీపీ) దేశ ఇంధన భద్రతను బలోపేతం చేయడం, పెట్రోలియం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణను ప్రోత్సహించడం అనే ముఖ్య ఉద్దేశాలతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇది 2003లో ప్రారంభమైంది. ప్రపంచ వాతావరణ సదస్సులలో కర్బన ఉద్గారాలు తగ్గిస్తామని భారత్‌ చేసిన లిఖితపూర్వక వాగ్దానంలో ఇది ఒక భాగమైంది. 

చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం వంటి వ్యవ సాయ పంటలు, వాటి ఉప ఉత్పత్తుల నుంచి తయారయ్యే జీవఇంధనం (బయో ఫ్యూయల్‌) ఇథనాల్‌. ఇది పునరుత్పాదకఇంధనం కావడంతో పెట్రోల్‌ తరహ వాయు కాలుష్యం ఉండదు గానీ పూర్తిగా సున్నా కాదు. ఇంకొక కొత్త రకం కాలుష్యం ఏర్పడు తున్నది. కొన్ని పరిస్థితుల్లో నైట్రోజన్‌ ఆక్సైడ్లు లేదా ఆల్డిహైడ్లు పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల అన్ని రకాల ఉద్గారాలు సమానంగా తగ్గుతాయని చెప్పలేము. టెయిల్‌పైప్‌ ఉద్గారాలు సాధారణంగా తగ్గుతాయి. అయితే ఏ ఉద్గారాలు ఎంత తగ్గుతాయనేది ఇంజిన్‌ రకం, ఇథనాల్‌ మిశ్రమ శాతంపై ఆధారపడి ఉంటుంది. 

కార్బన్‌ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్లు, పార్టిక్యులేట్‌ మ్యాటర్‌ తగ్గు తాయి. వివిధ ఇంధనాల ఉత్పత్తి నుంచి వినియోగం పోల్చితే కార్బన్‌ డయాక్సైడ్‌ నికర ప్రభావం కూడా తగ్గుతుంది. అయితే, కార్బన్‌ డయాక్సైడ్‌ తగ్గుదల కూడా ఇథనాల్‌ తయారు చేసే విధా నాన్ని బట్టి ఉంటుంది. చెరుకు, మక్కలు, వడ్ల నుంచి తయారు చేసే క్రమంలో వివిధ రకాల ప్రభావం ఉంటుంది. ఇథనాల్‌ను పెట్రో ల్లోనే కలుపుతున్నారు; డీజిల్‌ వాడకం వల్ల వచ్చే వాయు కాలుష్యం గురించి ఎటువంటి అడుగులు వేయడం లేదు. 

రైతులకు ఎంత మేలు?
భారత్‌లో ఇథనాల్‌ను చెరకు రసం, మొలాసెస్, మొక్కజొన్న, బియ్యం, గోధుమలు, జొన్నలు, సజ్జల నుంచి తయారు చేస్తారు. ఆయా పంటలకు డిమాండ్‌ పెరిగి తద్వారా రైతులకు అదనపు ఆదాయం సమకూరుతుందనేది ఆలోచన. ఇది ఒక నినాదంగా, ఆకర్షణీయ ప్రకటన లాగానే ఉన్నది. ఆహార పంటలకు డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. రైతుకు గిట్టుబాటు ధర రాకపోవడానికి కారణం ఆ యా పంటలకు డిమాండ్‌ లేక కాదు – మార్కెట్లో వ్యవస్థీ కృతమైన దోపిడీ వల్ల. మార్కెట్ల దోపిడీ ఈ పంటలను ఇథనాల్‌ ఉత్పత్తికి మళ్ళించడం వల్ల తగ్గదు. 

ప్రస్తుతం దేశంలో ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగింది. 2014లో సుమారు 421 కోట్ల లీటర్ల సామర్థ్యం ఉండగా, 2026 నాటికి అది సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక సామర్థ్యానికి పెరిగింది. ప్రభుత్వం కొత్తగా అనేక ధాన్యాధారిత, చెరకు ఆధారిత డిస్టిలరీలకు అనుమతులు ఇచ్చింది. పెట్రోల్లో 20% ఇథనాల్‌ కలప డానికి సంవత్సరానికి సుమారు 1,016 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవస రమని ప్రభుత్వం, నీతి ఆయోగ్‌ అంచనా.

ఇంధనం కాకుండా పరి శ్రమలు, రసాయనాలు, మద్యం తదితర ఇతర అవసరాలను కలి పితే మొత్తం సుమారు 1,350 కోట్ల లీటర్ల ఇథనాల్‌ అవసరం. సుమారు 2,000 కోట్ల లీటర్ల వార్షిక ఇథనాల్‌ ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తిగా ధాన్యాలపై ఆధారపడి నడపాలంటే దాదాపు 5 కోట్ల టన్నుల ధాన్యం అవసరం అవుతుంది. మొత్తం ధాన్య ఉత్పత్తి దాదాపు 37.66 కోట్ల టన్నులు. అంటే, అది దేశ మొత్తం ఆహార ధాన్య ఉత్పత్తిలో సుమారు 13% అవుతుంది. 

అమెరికా నుంచి డీడీజీఎస్‌ (డిస్టిల్లర్స్‌ డ్రైడ్‌ గ్రెయిన్స్‌ విత్‌ సొల్యూబుల్స్‌) దిగుమతులు, భారత ఇథనాల్‌ కార్యక్రమంతో ముడిపడి ఉన్న నేపథ్యంలో అది ఇంకొన్ని సమస్యలను సృష్టిస్తుంది. ఇథనాల్‌ తయారీ తర్వాత మిగిలే అధిక ప్రోటీన్‌ కలిగిన ఉప ఉత్పత్తిని డీడీజీఎస్‌ అంటారు. దీనిని పశువులు, కోళ్లు, చేపలకు దాణాగా ఉపయోగిస్తారు. అమెరికా నుంచి చౌకగా డీడీజీఎస్‌వస్తే దేశీయ డీడీజీఎస్‌ ధరలు పడిపోవచ్చు. దీంతో భారతఇథనాల్‌ డిస్టిలరీల ఆదాయం తగ్గుతుంది. 

మొక్కజొన్న రైతులపై కూడా ప్రభావం ఉంటుంది. అమెరికా దిగుమతులతో జీఎం (జన్యు మార్పిడి) వివాదం కూడా ఉన్నది. జీఎం మొక్కజొన్ననుంచి అమెరికా డీడీజీఎస్‌ వస్తుంది కాబట్టి, జన్యుమార్పిడిదాణా వల్ల ఏర్పడే అనారోగ్య సమస్యలు అదనం. అందుకే ఈఅన్ని సమస్యలపై కేంద్ర ప్రభుత్వం వివరంగా స్పందించాల్సిన అవసరం ఉంది.

-వ్యాసకర్త వ్యవసాయ రంగ నిపుణులు
-దొంతినరసింహారెడ్డి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement