ప్రవాస భారతీయులకు ఆర్బీఐ వరం | Sakshi Guest Column On RBI boon to NRIs | Sakshi
Sakshi News home page

ప్రవాస భారతీయులకు ఆర్బీఐ వరం

Jul 12 2026 5:50 AM | Updated on Jul 12 2026 5:50 AM

Sakshi Guest Column On RBI boon to NRIs

సందర్భం

2026 జూన్‌  8న భారతీయ రిజర్వు బ్యాంకు... వాణిజ్య బ్యాంకులు సమీకరించే మూడు నుంచి ఐదేళ్ల కాల పరిమితి గల ఎఫ్‌సీఎన్‌ ఆర్‌(బి) డిపాజిట్లపై, ప్రత్యేక డాలర్‌–రూపాయి స్వాప్‌ సదుపాయాన్ని ప్రకటించింది. 2026 సెప్టెంబరు 30 వరకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది. సాధారణంగా అమెరికన్‌ డాలర్, యూరో, బ్రిటిష్‌ పౌండ్, జపాన్‌ యెన్, ఆస్ట్రేలియన్‌ డాలర్, కెనడియన్‌ డాలర్‌ వంటి ప్రధాన విదేశీ ద్రవ్యాల్లో ఎఫ్‌సీఎన్‌ ఆర్‌(బి) డిపా జిట్లు స్వీకరిస్తారు. ఈ నిర్ణయంతో ప్రవాస భారతీయులకు తమ విదేశీ ద్రవ్యాన్ని రూపాయిల్లోకి మార్చకుండానే, గతంతో పోలిస్తే అధిక వడ్డీ పొందే అవకాశం లభించింది.

ఎఫ్‌సీఎన్‌ ఆర్‌(బి) (ఫారిన్‌ కరెన్సీ నాన్‌– రెసిడెంట్‌ బ్యాంక్‌) డిపాజిట్‌ అంటే – ప్రవాస భారతీయులు విదేశాల్లో ఆర్జించిన సొమ్మును, అనుమతించబడిన విదేశీ ద్రవ్యంలోనే భారతీయ బ్యాంకుల్లో కాలపరిమితి డిపాజిట్‌గా ఉంచడం. గడువు పూర్తయ్యాక అసలు, వడ్డీ రెండూ అదే ద్రవ్యంలో తిరిగి చెల్లించబడుతాయి. ఎన్‌ఆర్‌ఈ డిపాజిట్‌లో మాత్రం ఆ డబ్బు రూపాయిల్లోకి మారుతుంది. భారత్‌లో వచ్చే వడ్డీపై పన్ను మినహాయింపు, విదేశాలకు తిరిగి తీసుకెళ్లే సౌలభ్యం రెండింటికీ వర్తిస్తాయి.

సాధారణంగా, ఎన్‌ ఆర్‌ఈ డిపాజిట్లతో పోలిస్తే ఎఫ్‌సీఎన్‌ ఆర్‌(బి) డిపాజిట్లపై కొంత తక్కువ వడ్డీ లభిస్తుంది. ఎందుకంటే,  బ్యాంకులు ఈ విదేశీ ద్రవ్య నిధులను రూపాయిల్లోకి మార్చుకొని, దేశీయ అవసరాల కోసం వినియోగి స్తాయి. అయితే గడువు పూర్త య్యాక డిపాజిటర్లకు విదేశీ ద్రవ్యంలోనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈలోగా రూపాయి–డాలర్‌ మారకం ప్రతికూలంగా మారినా నష్టం వాటిల్లకుండా, బ్యాంకులు కొంత అదనపు వ్యయంతో కూడిన ముందస్తు రక్షణ ఏర్పాట్లు – అంటే హెడ్జింగ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తాజా ఆర్‌బీఐ విధాన నిర్ణయంతో,  ఈ డిపాజిట్లపై బ్యాంకులు భరించాల్సిన హెడ్జింగ్‌ వ్యయాన్ని ఆర్‌బీఐ స్వయంగా భరిస్తుంది. దీంతో బ్యాంకులకు అలాంటి డిపాజిట్లపై అధిక వడ్డీ చెల్లించే వెసులుబాటు కలిగింది.

స్థిర విదేశీ ద్రవ్యవనరుల సమీకరణ
ఈ విధానం ప్రకటించిన సమయంలో అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొని ఉంది. ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. డాలర్‌తో పోల్చితే రూపాయి విలువ జీవితకాల కనిష్ఠాన్ని తాకింది. ఆ నేపథ్యంలో, రూపాయిపై ఒత్తిడిని తగ్గించడంతో పాటు, దేశానికి మరింత స్థిరమైన విదేశీ ద్రవ్య వనరులను సమకూర్చడం కూడా ఈ చర్య వెనుక ఉన్న ముఖ్యోద్దేశాల్లో ఒకటి. విదేశీ సంస్థాగత, స్టాక్‌ మార్కెట్‌ పెట్టుబడులు వంటి స్వల్పకాలిక మూలధన ప్రవాహాలతో పోలిస్తే, ఎఫ్‌సీఎన్‌ ఆర్‌(బి) డిపాజిట్లు మరింత స్థిరమైన, దీర్ఘకాల విదేశీ ద్రవ్య వనరులుగా అక్కరకు వస్తాయి. అందువల్ల అత్యవసర సందర్భాల్లో,  ఇటు వంటి ప్రత్యేక వెసులుబాట్ల ద్వారా విదేశీ ద్రవ్య నిధులను సమీకరించేందుకు ఆర్‌బీఐ ప్రయత్నిస్తోంది. ప్రపంచంలో రెండో అతిపెద్ద ప్రవాస భారతీయ సమూహం, ఇటువంటి విధానాలు సఫలీకృతం కావడంలో విశేషంగా తోడ్పడుతోంది.

2013లో రూపాయిపై తీవ్ర ఒత్తిడి నెలకొన్న సమయంలో అప్పటి ఆర్‌బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ స్వల్ప మార్పులతో ఇదే తరహా ప్రత్యేక స్వాప్‌ సదుపాయాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకానికి అనూహ్య స్పందన లభించింది. కొద్ది నెలల్లోనే సుమారు 34 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల డిపాజిట్లు వచ్చాయి. రూపాయిపై ఒత్తిడి తగ్గించడంలో, విదేశీ పెట్టుబడిదారుల్లో విశ్వాసం పెంపొందించడంలో ఆ పథకం కీలక పాత్ర పోషించినట్లు భావిస్తారు. అయితే ఈ పథకంపై భిన్నాభిప్రాయాలు కూడా లేక పోలేదు. గడువు పూర్తయ్యాక ఒకేసారి భారీ మొత్తంలో విదేశీ ద్రవ్య చెల్లింపులు చేయాల్సి వస్తుంది. ఆ సమయంలో  విదేశీ ద్రవ్య ప్రవాహాలు ఆశించిన స్థాయిలో లేకపోతే, రూపాయిపై మరింత ఒత్తిడి ఏర్పడే అవకాశం ఉందని కొందరు ఆర్థికవేత్తల అభి ప్రాయం. అయితే 2013లో ప్రవేశపెట్టిన ఇదే తరహా పథకం గడువు ముగిసి నప్పుడు ఏర్పడిన పరిస్థితిని ఆర్‌బీఐ సమర్థవంతంగా ఎదుర్కొందన్న విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి.

అలాగే, ఇలాంటి తాత్కాలిక విధాన సడలింపులు తక్షణావసరాలను తీర్చడంలో ఉపయోగపడినా; ఎగుమతుల వృద్ధి, స్థిరమైన విదేశీ పెట్టుబడులు, బలమైన స్థూల ఆర్థిక వ్యవస్థ వంటి దీర్ఘకాలిక చర్యలే దేశానికి స్థిరమైన విదేశీ ద్రవ్య వనరులను సమకూర్చగలవు. మార్చి 2026 నాటికి భారతీయ బ్యాంకుల్లో ఉన్న ఎఫ్‌సీఎన్‌ ఆర్‌(బి) డిపాజిట్ల మొత్తం సుమారు 34 బిలియన్‌ అమెరికన్‌ డాలర్లు. అంతర్జాతీయ అనిశ్చితుల వలన గణనీయంగా తగ్గిన నిల్వలను తిరిగి సమకూర్చుకోవడం తక్షణావసరం. ప్రస్తుత  చర్యల ద్వారా, అనుకూల పరిస్థితుల్లో 50 నుంచి 60 బిలియన్‌ అమెరికన్‌ డాలర్ల వరకు అదనపు విదేశీ ద్రవ్య నిధులు సమీకరించే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ రంగ ప్రముఖులు, మార్కెట్‌ విశ్లేషకుల అంచనా. ఆ అంచనాలు ఎంతవరకు వాస్తవరూపం దాల్చుతాయో రాబోయే నెలల్లో స్పష్టమవుతుంది. అయితే, గతానుభవాలను దృష్టిలో ఉంచుకుంటే, అవసరమైన సమయంలో ప్రవాస భారతీయుల వ్యక్తిగత పొదుపులు కూడా దేశ ఆర్థిక స్థిరత్వానికి తోడ్పడగలవని ఆర్‌బీఐ విశ్వసించడం సహేతుకంగానే తోస్తోంది.

పల్లపోతు కృష్ణబాలాజి
వ్యాసకర్త ఎస్బీఐ విశ్రాంత ఉన్నతాధికారి 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement