ఐఐటీ వంటి ఉన్నత చదువులు ఉంటేనే అధిక జీతాలతో కూడిన ఉద్యోగాలు వస్తాయని అనుకుంటాం. కానీ సాధారణ నేపథ్యం, సాదాసీదా డిగ్రీతో అందివచ్చిన అవకాశాలను ఉపయోగించుకుంటూ కూడా ఉన్నత శిఖరాలను చేరొచ్చు. పట్టుదల, కఠోర శ్రమ, అకుంఠిత దీక్ష ఉంటే ఇదేమంత కష్టం కాదని నిరూపించాడు కర్ణాటకు చెందిన ఓ సాధారణ ఇంజనీర్. ఓ మారుమూల గ్రామం నుంచి ఏకంగా అమెరికాలో ప్రతిష్టాత్మక కంపెనీలో ఉద్యోగం సంపాదించి..స్ఫూర్తిగా నిలిచాడు.
అతడే కర్ణాటకలోని చిత్రదుర్గ సమీపంలోని గ్రామానికి చెందిన పృథ్వీరాజ్. తన స్ఫూర్తిదాయక ప్రయాణాన్ని వివరిస్తూ షేర్ చేసిన లింక్డ్‌ఇన్ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం..అతను బెంగళూరులోని పీఈఎస్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఎలాంటి ఐఐటీ డిగ్రీ, ఉన్నత నేపథ్యం లేవు. కానీ నిరంతర కృషి, ఇంటర్న్‌షిఫ్‌లు, వ్యక్తిగత ప్రాజెక్టులు, తరగతి గదికి మించిన నిరంతర అభ్యాసం ద్వారా తన నైపుణ్యాను పెంపొందించుకోవడంపై దృష్టి సారించాడు.
అతని అంకితభావం చివరికి ఎన్విడియాలో ఉద్యోగం సంపాదించడానికి సహాయపడిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం తాను ఇప్పుడు ఏడాదికి సుమారు రూ.2.6 కోట్ల జీతం సంపాదిస్తున్నట్లు పోస్ట్ పేర్కొన్నాడు. ప్రపంచవ్యాప్తంగా ఉపయోగించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలకు శక్తినిచ్చే అధునాతన చిప్‌లను అభివృద్ధి చేసే పనిలో తను భాగమైనట్లు తెలిపాడు.
ఈ పోస్ట్ నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంది. ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమలో కేవలం ప్రముఖ విద్యాసంస్థలు నుంచి పట్టభద్రులైన వారు మాత్రమే విజయవంతమైన కెరీర్‌లను నిర్మించుకోగలరనే భావనను అతడి కథ తిరగరాసింది. పైగా తమ లక్ష్యాలను చేరుకోవడానికి తపిస్తున్న యువ నిపుణులకు ఈ కథ ఓ ప్రేరణ అంటూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ధగ ధగ మెరిసే ఆభరణాలు లేకుండానే..పెళ్లికూతురు రూపం!)


