అమర్‌నాథ్: రెండున్నర లక్షల మార్క్‌కు చేరువలో భక్తుల తాకిడి | Baba Amarnath Yatra Pilgrim turnout nearing the 25 lakh mark | Sakshi
Sakshi News home page

అమర్‌నాథ్: రెండున్నర లక్షల మార్క్‌కు చేరువలో భక్తుల తాకిడి

Jul 12 2026 10:56 AM | Updated on Jul 12 2026 10:57 AM

Baba Amarnath Yatra Pilgrim turnout nearing the 25 lakh mark

జమ్మూ: పవిత్ర బాబా అమర్‌నాథ్ యాత్రకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో యాత్ర ఎలాంటి ఆటంకాలు లేకుండా సాఫీగా కొనసాగుతోంది. ఇప్పటివరకు దాదాపు రెండున్నర లక్షల మంది భక్తులు దర్శనం పూర్తి చేసుకున్నారు. తొలి ఎనిమిది రోజుల్లోనే రెండు లక్షల మంది దర్శించుకోగా, రాబోయే రెండు రోజుల్లో ఈ సంఖ్య రెండున్నర లక్షలు దాటనుంది. భక్తుల ఉత్సాహాన్నిచూస్తే, 57 రోజుల ఈ యాత్రలో ఈసారి కొత్త రికార్డు నమోదయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి బృందాలుగా బయలుదేరడంతో పాటు, చాలామంది భక్తులు నేరుగా పహల్గామ్, బాల్టాల్ మార్గాల ద్వారా యాత్రకు వెళ్తున్నారు.

మెరుగైన సహాయక చర్యలు
యాత్ర మార్గంలో అనారోగ్యానికి గురైన, సహాయం అవసరమైన భక్తులకు జమ్ము కశ్మీర్ పోలీసుల మౌంటెన్ రెస్క్యూ టీమ్ (ఎంఆర్‌టీ) ఎస్ఎస్‌బీ, ఎస్‌డీఆర్ఎఫ్, ఐటీబీపీ తదితర రెస్క్యూ ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటూ తక్షణ వైద్య, రెస్క్యూ సాయం అందిస్తోంది. శనివారం యాత్ర మార్గంలోని పిస్సూ టాప్, చందన్‌వాడీ, బ్రారీమార్గ్, రైల్‌పథ్రి, శేషనాగ్, లోయర్ హోలీ కేవ్, పంచతరణి తదితర ప్రాంతాల్లో శ్వాస సమస్యలు, జ్వరం, వాంతులు, తీవ్ర అలసట వంటి ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న పలువురు భక్తులకు ఎంఆర్‌టీ బృందాలు వెంటనే ఆక్సిజన్ సపోర్ట్, ప్రాథమిక చికిత్స అందించాయి. పరిస్థితి తీవ్రంగా ఉన్నవారిని సమీపంలోని వైద్య శిబిరాలు, ఆసుపత్రులకు తరలించారు.

ఇదే సమయంలో రైల్‌పథ్రి ఎంఆర్‌టీ, ఎస్ఎస్‌బీ, ఎస్‌డీఆర్ఎఫ్ సంయుక్త బృందం జెడ్-మోడ్ వద్ద ఇద్దరు మహిళా భక్తులను రక్షించి రైల్‌పథ్రి వైద్య శిబిరానికి తరలించింది. మిడ్ పిస్సూ టాప్ వద్ద స్పృహ కోల్పోయిన మరో మహిళా భక్తురాలిని జేకే పోలీస్ ఎంఆర్‌టీ, చందన్‌వాడీ బృందాలు కలిసి రక్షించి సమీప వైద్య కేంద్రానికి తరలించాయి. వృద్ధులు, తీవ్రంగా అలసిపోయిన పలువురు యాత్రికులకు కూడా మార్గం మధ్యలో సహాయం అందించి, వారిని సురక్షితంగా ముందుకు పంపారు. ఎంఆర్‌టీ, ఇతర భాగస్వామ్య ఏజెన్సీల వేగవంతమైన స్పందన, మెరుగైన సమన్వయం, అంకితభావంతో కూడిన సేవల వల్లే భక్తుల భద్రత సాధ్యమైందని, యాత్ర నిరాటంకంగా కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

బయల్దేరిన 10వ బృందం 
శనివారం ఉదయం జమ్ములోని భగవతి నగర్ బేస్ క్యాంప్ నుంచి 9,182 మంది భక్తులతో కూడిన 10వ బృందం పహల్గామ్, బాల్టాల్ దిశగా బయలుదేరింది. వీరిలో 5,877 మంది భక్తులు 206 వాహనాల కాన్వాయ్‌లో అనంతనాగ్ జిల్లాలోని పహల్గామ్ బేస్ క్యాంప్‌కు వెళ్లగా, మిగిలిన 3,305 మంది భక్తులు బాల్టాల్ మార్గాన్ని ఎంచుకుని 127 వాహనాల కాన్వాయ్‌లో బాల్టాల్ బేస్ క్యాంప్‌కు చేరుకున్నారు. సాయంత్రానికి రెండు బృందాలు నిర్దేశిత ప్రాంతాలకు క్షేమంగా చేరుకున్నాయి. మంచు కొండల మధ్య సాగే ఈ పవిత్ర యాత్రలో భద్రతా బలగాలు, వైద్య బృందాలు అప్రమత్తంగా వ్యవహరిస్తూ భక్తుల సురక్షిత ప్రయాణానికి పూర్తి సహకారం అందిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement