‘మైనింగ్‌’పై మహోగ్రం! | Devotees Flock to Mallayya Hills | Sakshi
Sakshi News home page

‘మైనింగ్‌’పై మహోగ్రం!

Jun 30 2026 5:11 AM | Updated on Jun 30 2026 5:11 AM

Devotees Flock to Mallayya Hills

భక్తులతో కలిసి పాదయాత్ర చేస్తున్న పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, సుధాహరరెడ్డి

భక్తుల ‘మహా గిరి ప్రదక్షిణ’తో హోరెత్తిన మల్లయ్య కొండలు

70 కి.మీ మేర ఏడున్నర గంటల పాటు కొండలు చుట్టూ ప్రదక్షిణ

ముందుండి నడిపించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ సుధాహరరెడ్డి

సాక్షి, మదనపల్లె: నిత్యం శివ నామస్మరణతో మార్మోగే మల్లయ్య కొండలు.. మైనింగ్‌ విధ్వంసం వద్దంటూ ‘మహా గిరి ప్రదక్షిణ’తో హోరెత్తాయి. పవిత్ర పుణ్యక్షేత్రంలో మైనింగ్‌ కార్యకలాపాలకు అనుమతిస్తూ చంద్రబాబు సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ మల్లయ్య కొండలు చుట్టూ 70 కి.మీ మేర ఏడున్నర గంటల పాటు భక్తులు, స్థానికులు భారీ ‘మహా గిరి ప్రదక్షిణ’ నిర్వహించారు. సోమవారం తెల్లవారుజామున ఐదు గంటలకే మల్లయ్య కొండపైకి పెద్ద ఎత్తున చేరుకుని ముక్కంటికి పూజలు, అభిషేకాలు చేశారు. కొండ కింద అన్నదాన సత్రం వద్ద శివ భజనలు, కీర్తనలు ఆలపించారు.

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్‌రెడ్డి, కలిచర్ల సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ సుధాహరరెడ్డి భక్తులతో కలసి మహాగిరి ప్రదక్షిణను ప్రారంభించారు. శివపార్వతులు కొలువుదీరిన రథాన్ని జెండా ఊపి ప్రారంభించారు. తంబళ్లపల్లె, రావిమాను మీదుగా కాలి నడకన వైఎస్సార్‌ సర్కిల్‌ మీదుగా పెద్దమండ్యం రోడ్డుకు చేరుకున్నారు. అక్కడినుంచి భారీ సంఖ్యలో తరలివచ్చిన వాహనాల్లో భక్తులు మహాగిరి ప్రదక్షిణగా సాగారు. గోపిదిన్నె, కొటాల, బండ్రేవు, ముసలికుంట, పెద్దమండ్యం, కలిచర్ల, శివపురం, తురకపల్లె, వెలిగల్లు, కోటకొండ, మఠం మీదుగా తంబళ్లపల్లె చేరుకున్నారు. రథం కొండపైకి వెళ్లి ఆలయంలో పూజలు నిర్వహించాక గిరి ప్రదక్షిణ ముగించారు. 

దారి పొడవునా రథానికి పూజలు..
మహాగిరి ప్రదక్షిణ ప్రారంభం నుంచి ముగింపు వరకు రహదారి పొడవున ప్రజలు బారులు తీరి రథానికి పూజలు నిర్వహించారు. తంబళ్లపల్లె, పెద్ద­మండ్యం నుంచే కాకుండా నియోజకవర్గంలోని ఇతర మండలాలకు చెందిన భక్తులు, సత్యసాయి, వైఎస్సార్‌ కడప జిల్లా నుంచి వచ్చిన భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని మల్లయ్య కొండల్లో మైనింగ్‌ వద్దని నినదించారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి మైనింగ్‌ను తొలి నుంచి గట్టిగా వ్యతిరేకి­స్తున్నారు. భక్తుల అభిప్రాయాలు తెలుసుకోకుండా ఉత్తర్వులు జారీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 

70 కి.మీ. దూరం.. ఏడున్నర గంటలు 
తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల మధ్యలో ఉన్న మల్లయ్య కొండల చుట్టూ నిర్వహించిన మహా గిరి ప్రదక్షిణ 70 కిలోమీటర్ల దూరం సాగింది. ఉదయం 9 గంటలకు కొండ కింద నుంచి ప్రదక్షిణ మొదలై 10 గంటలకు తంబళ్లపల్లి చేరు­కుంది. అక్కడినుంచి తిరిగి తంబళ్లపల్లికి చేరేందు­కు ఏడున్నర గంటల సమయం పట్టింది. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో ప్రదక్షిణ మెల­్లగా సాగింది. ప్రదక్షిణ విజయవంతమైందని, మైనింగ్‌పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిసింది.

శాశ్వతంగా నిషేధించాలి..
భవిష్యత్తులో మల్లయ్య కొండల్లో మైనింగ్‌ అనే మాటే వినపడకుండా శాశ్వతంగా నిషేధిస్తూ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్‌ చేశారు. మైనింగ్‌ వల్ల ఖనిజ సంపద దోపిడీకి గురి కావడమే కాకుండా జనజీవనం అస్తవ్యస్తమవుతుందని, తీవ్ర అనారోగ్య సమస్యలు, వలసలతో కుటుంబాలు నాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో తమ జన్మ స్థలాన్ని చెప్పుకునే పరి­స్థితి లేకుండా పోతుందని, మైనింగ్‌ విషయంలో ప్రభుత్వం ఇంత నిర్లక్ష్యంగా ఉత్తర్వులు ఎలా ఇస్తుందని కన్నెమడుగుకు చెందిన దేవరింటి రామకృష్ణారెడ్డి, దేవరింటి రవిశేఖర్‌రెడ్డి ప్రశ్నించారు. మైనింగ్‌పై శాశ్వత నిషేధం విధించాలని, మల్లయ్య కొండల భవిష్యత్తుకు అదే శాశ్వత పరిష్కారం అని పేర్కొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement