breaking news
mallayya
-
బీఆర్ఎస్ నేత దారుణహత్య
నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో ఈ ఘర్షణ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. బీఆర్ఎస్ మద్దతుదారుగా మాదాసు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా దేశపంగు మురళి సర్పంచ్ బరిలో నిలిచారు. గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నేత ఉప్పుల మల్లయ్య కోడలు ఉప్పుల శైలజ 4వ వార్డు నుంచి బీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇరు పార్టీల వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగించుకొని గ్రామంలోని పార్టీల జెండా దిమ్మెల సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో బీఆర్ఎస్ వారు ఓటర్లను కలిసివస్తున్న సమయంలో.. శైలజకు ప్రత్యర్థిగా ఉన్న ఆకుల రజిత వర్గానికి చెందిన ఉప్పుల సతీశ్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీశ్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యలు గొడవ పడడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది. ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్యపై దాడి చేయగా, అడ్డుకోవడానికి వెళ్లిన ఉప్పుల మల్లయ్యపై కూడా కర్రలతో దాడి చేశారు. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలై కిందపడిపోయాడు. ఇదే సమయంలో తలపై బండరాయితో మోపడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు. వైద్యులు పరిశీలించి ఉప్పుల మల్లయ్య మృతి చెందినట్టు చెప్పారు. ఈ దాడిలో మున్నా మల్లయ్యతోపాటు అతని సోదరుడు లింగయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మల్లయ్య మృతదేహానికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, రాజకీయ కక్షలతోపాటు దాయాదుల గొడవలు కూడా ఈ దాడికి కారణమైనట్టు తెలిసింది. ఎనిమిది మంది నిందితుల అరెస్ట్ఉప్పుల మల్లయ్య హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడి, మృతికి కారకులైన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు. -
మరుగుదొడ్డే ఇల్లుగా..
ఎడపల్లి(బోధన్): అందరూ ఉన్నా అనాథల్లా మారిన వృద్ధ దంపతులు, నివసించేందుకు నీడ లేక మరుగుదొడ్డినే ఇల్లుగా మార్చుకుని జీవనం సాగిస్తున్నారు. ఎడపల్లి మండలం పోచారం గ్రామానికి చెందిన బెజ్జంకి మల్లయ్య(82), మైసమ్మ(70) దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. వృత్తిరీత్యా ఒకరు జిల్లా కేంద్రంలో పెయింటింగ్ పని చేస్తుంటాడు. మరొక కొడుకు దుబాయ్‌లో ఉంటున్నాడు. ఆయన భార్య, పిల్లలు పోచారంలో నివసిస్తున్నారు. వృద్ధాప్యంలో అయినవారు ఎవరూ చూడకపోవడంతో కొన్నేళ్లుగా పోచారంలో కొడుకు ఇంటి ఆవరణలో ఉన్న మరుగుదొడ్డిలో నివాసం ఉంటూ, కూలీనాలీ చేసి పొట్టపోసుకుంటున్నారు. గురువారం ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు గ్రామా నికి వెళ్లగా వారి పరిస్థితి వెలుగులోకి వచ్చింది. తమను ఆదుకోవాలని ఆ వృద్ధ దంపతులు కాంగ్రెస్ నాయకులను వేడుకున్నారు. దీంతో వారు స్పందించి తాము అధికారంలోకి రాగానే అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. -
చెరువులో పడి పశువుల కాపరి మృతి
మంగపేట : మండల కేంద్రంలోని గంపోనిగూడేనికి చెందిన మేకల మల్లయ్య(80) అనే పశువుల కాపరి ఉమ్మన్నకుంట చెరువులో పడి సోమవారం సాయంత్రం మృతి చెందినట్లు ఎస్సై ననిగంటి శ్రీకాం త్‌రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. రోజువారీగా మల్లయ్య పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈక్రమంలో కొన్ని గేదెలు కనిపించకపోవడంతో వాటిని వెతుకుతూ ఉమ్మన్నకుంట చెరువు సమీపంలోకి వెళ్లాడు. చెరువులో ఉన్న గేదెలను బయటికి వెళ్లగొట్టే క్రమంలో నీటిలో మునిగి మృతిచెందాడు. మంగళవారం ఉదయం గ్రామస్తులు చెరువులో మల్లయ్య మృతదేహాన్ని గుర్తిం చారు. మృతుడి కుమారుడు నర్సయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు. -
రుణం చె ల్లించకుంటే ఫ్లాట్ల స్వాధీనం
ఆలంపల్లి, న్యూస్‌లైన్: రాజీవ్ గృహకల్ప కింద మంజూరైన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలు చెల్లించకుంటే ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామని తాండూరు, వికారాబాద్ రాజీవ్ గృహకల్ప సముదాయాల లైజన్ అధికారి మల్లయ్య పేర్కొన్నారు. శుక్రవారం వికారాబాద్ ఆంధ్రాబ్యాంక్‌లో నిర్వహించిన బ్యాంకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం 2007లో రాజీవ్ గృహకల్ప సముదాయాన్ని నిర్మించి, పేద ప్రజలకు 1458 ఫ్లాట్లను కేటాయించిందని అన్నారు. వీటిని లబ్ధిదారులు సొంతం చేసుకునేందుకు వీలుగా వికారాబాద్‌లోని ఐదు బ్యాంకుల నుంచి రుణాలు మంజూరు చేసిందన్నారు. దక్కన్ గ్రామీణ బ్యాంకు 190 ఫ్లాట్లకు, జిల్లా కోఆపరేటివ్ సెంట్రల్‌బ్యాంక్ 387, ఆంధ్రా బ్యాంకు 389, కెనరా బ్యాంకు 216, ఎస్బీహెచ్ 276 ఫ్లాట్ల లబ్ధిదారులకు రుణాలు ఇచ్చాయని వివరించారు. అయితే లబ్ధిదారులు అప్పటినుంచి బ్యాంకు రుణాలు చెల్లించడం లేదని పేర్కొన్నారు. అన్ని బ్యాంకులకు సంబంధించి దాదాపు రూ.15కోట్ల వరకు రుణాలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఈ నేపథ్యంలో రుణ బకాయిలు కట్టకుంటే ఇళ్లు రద్దు చేస్తామని పలుమార్లు లబ్ధిదారులకు నోటీసులు జారీ చేసినా స్పందన లేకపోయిందన్నారు. ఈ పరిస్థితుల్లో 185 జీఓ ప్రకారం రుణాలు చెల్లించని వారితో పాటు స్థానికంగా నివాసం ఉండని, వేరొకరికి అద్దెకు ఇచ్చిన వారి ఫ్లాట్లను స్వాధీనం చేసుకుంటామని స్పష్టం చేశారు. ఇందుకోసం హౌసింగ్ జిల్లా పీడీ, సబ్ కలెక్టర్, మున్సిపల్ కమిషనర్, సంబంధిత బ్యాంకు మేనేజర్‌తో కమిటీ వేశామన్నారు. క్షేత్రస్థాయిలో ఈ కమిటీ పరిశీలించి రుణాలు చెల్లించని వారితో పాటు స్థానికంగా ఉండని, ఇళ్లకు తాళాలు వేసిన వారిని గుర్తించి నోటీసులు జారీ చేస్తుందని వివరించారు. నోటీసులు ఇచ్చిన 15 రోజుల్లో రుణాలను చెల్లించకపోతే గృహాలను స్వాధీనం చేసుకుంటారని తెలిపారు. రాజీవ్ గృహకల్పలో లబ్ధిదారుల నుంచి ఇతరులు ఫ్లాట్లు కొంటే చెల్లదని, పూర్తిహక్కు గృహనిర్మాణ శాఖదేనని స్పష్టం చేశారు. సమావేశంలో ఆంధ్రా బ్యాంకు రీజినల్ మేనేజర్ కృష్ణారావు, కెనరా బ్యాంకు మేనేజర్ సుబ్బారావు, దక్కన్ గ్రామీణ బ్యాంకు మేనేజర్లు రాజారావు, రవీందర్, నరోత్తంరెడ్డి, జిల్లా కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజర్ ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వన్‌టైమ్ సెటిల్మెంట్... రాజీవ్‌గృహకల్పలో గృహాలకు సంబంధించి రుణాలను పొంది వాయిదాలు చెల్లించని వారికి వన్‌టైమ్ సెటిల్మెంట్కు అవకాశం ఇస్తున్నట్టు బ్యాంకు అధికారులు తెలిపారు. ఇచ్చిన రుణంలో 60శాతం చెల్లిస్తే సరిపోతుందని అన్నారు. ఆరు సంవత్సరాలకు సంబంధించి 84 వాయిదాలు నిర్ణయించామని, ఇప్పటివరకు 34 నెలలు గడిచాయని అన్నారు. వాయిదాలు చెల్లించని వారు రూ.34 వేలు చెల్లిస్తే వడ్డీ ఉండదని, ఈ అవకాశాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


