మల్లయ్య కొండలపై మైనింగ్‌ బాబుల కన్ను    | Chandrababu government focus on mining in Mallayya hills | Sakshi
Sakshi News home page

మల్లయ్య కొండలపై మైనింగ్‌ బాబుల కన్ను   

Jan 21 2026 5:57 AM | Updated on Jan 21 2026 5:57 AM

Chandrababu government focus on mining in Mallayya hills

మల్లయ్యకొండ సముదాయంలోని సాధుకొండలు

అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె మల్లయ్య కొండ తవ్వేందుకు సిద్ధం.. 

సాధుకొండపై 3,815 ఎకరాల్లో ఐరన్‌ ఓర్‌ దండుకునే వ్యూహం

కాంపోజిట్‌ లైసెన్స్‌ మంజూరుకు కంపెనీలను ఆహ్వనిస్తూ రహస్యంగా టెండర్లు  

16న గుట్టుగా ముగిసిన టెండర్ల ప్రక్రియ 

భక్తుల మనోభావాలతో చంద్రబాబు సర్కారు చెలగాటం  

2006 నుంచి వ్యతిరేకిస్తున్న శివ భక్తులు  

ఇక్కడ మైనింగ్‌ జరగనివ్వబోనని 2009లో చంద్రబాబు ప్రకటన 

ఇప్పుడు వేల కోట్ల విలువైన ఖనిజంపై కన్ను

మదనపల్లె: అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని ప్రఖ్యాత మల్లయ్య కొండలను ఐరన్‌ ఓర్‌ పేరుతో కొల్లగొట్టేందుకు చంద్రబాబు ప్రభుత్వం పక్కా పథకం వేసింది. వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజాన్ని  దోచుకునేందుకు రహస్యంగా పావులు కదిపింది. ముందుగా కాంపోజిట్‌ లైసెన్స్‌కు అత్యంత రహస్యంగా టెండర్లు పిలిచింది. ఆ తర్వాత మైనింగ్‌కు అనుమతించాలనేది ప్రభుత్వ వ్యూహమని సమాచారం. ఈ విషయం సోమవారం వెలుగులోకి వచి్చంది. ప్రభుత్వ చర్యపై శివ భక్తుల్లో తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తమవుతున్నాయి. మల్లయ్య కొండల్లో మైనింగ్‌ జరగనివ్వబోమని గతంలో చెప్పిన చంద్రబాబే ఇప్పుడు మాట తప్పి, ఆ కొండలపై ఉన్న మల్లికార్జున స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీస్తూ సాధుకొండను తొలిచి అమ్ముకొనేందుకు తన అనుంగులకు కట్టబెట్టే ప్రయత్నాలు సాగిస్తుండటంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. 

ఐరన్‌ ఓర్‌ దోపిడీకి వ్యూహం  
తంబళ్లపల్లె సమీపంలో మల్లయ్య కొండల సమూహంలో సాధుకొండ, ఇనుము కొండ, మల్లయ్య కొండ ఉన్నాయి. ఇవి 6,079 హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. మల్లయ్య కొండపై పురాతన మల్లికార్జున స్వామి ఆలయం ఉంది. నిత్యం అనేక మంది భక్తులు కొలిచే ఈ ఆలయం ఉండటం వల్ల ఈ కొండలపై మైనింగ్‌ చేయడంలేదు. 1893లోనే బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ కొండల ప్రాంతాన్ని రిజర్వ్‌ ఫారెస్ట్‌గా ప్రకటించింది. ఈ కొండల్లో 100 మిలియన్‌ టన్నుల ఇనుప ఖనిజం ఉందని 2006 నుంచి కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తోంది. మల్లయ్య కొండల్లో మైనింగ్‌ చేపట్టరాదని ఈ ప్రాంత ప్రజలు గతంలో తీవ్రస్థాయిలో ఉద్యమించారు. గత ప్రభుత్వాలు కూడా భక్తుల మనోభావాలను గౌరవించి ఈ కొండల జోలికి వెళ్లలేదు. దీన్ని లీజు పేరుతో దక్కించుకునేందుకు కిరణ్‌ కుమార్‌ రెడ్డి ప్రభుత్వంలో జియో మైసూర్‌ సంస్థ పావులు కదిపింది.

అప్పట్లో 89 సంస్థలు పోటీ పడినప్పటికీ, జియో మైసూర్‌ సంస్థకు ఎక్స్‌ప్లరేషన్‌ లైసెన్స్‌ మంజూరయింది. దీనిపై భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచి్చంది. ఆ సంస్థ మొక్కుబడిగా పరిశీలన జరిపి, ఆ తర్వాతి చర్యలు నిలిపివేసింది. 2009 ఎన్నికల్లో తంబళ్లపల్లి నియోజకవర్గం ప్రచారానికి వచి్చన చంద్రబాబు మల్లయ్య కొండల్లో మైనింగ్‌ జరగనివ్వబోమని, భక్తుల మనోభావాలను గౌరవిస్తామని ప్రకటించారు. ఇప్పుడు దీన్ని విస్మరించి కొండలను కొల్లగొట్టేందుకు సిద్ధమయ్యారు. భక్తుల మనోభావాలను పక్కన పెట్టి వేల కోట్ల రూపాలయ విలువైన ఇనుప ఖనిజాన్ని అనుకూల కంపెనీలకు దోచి పెట్టేందుకు చంద్రబాబు సర్కారు సిద్ధమైంది.

అనుకూల సంస్థలకు ముందుగా కంపోజిట్‌ లైసెన్స్‌ మంజూరు చేసి..ఆ తర్వాత మైనింగ్‌ లైసెన్స్‌ జారీ చేసేలా వ్యూహం పన్నినట్టు అర్థమవుతోంది. దీనికోసం గత ఏడాది నవంబర్‌ 27న మల్లయ్య కొండల సమూహంలోని సాధుకొండలో 900 హెక్టార్లు, శివపురం పరిధిలోని ఇదే కొండకు చెందిన 626 హెక్టార్లలో (మొత్తం 3,815 ఎకరాలు) ఐరన్‌ ఓర్‌ కోసం పరిశోధనలు జరపడం, అంచనాలు వేసుకునేందుకు తొలి విడతలో కాంపోజిట్‌ లైసెన్స్‌ పొందేందుకు సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించింది. ఈ బిడ్ల స్వీకరణ జనవరి 16న ముగిసింది. టెండర్ల ఆహా్వనం, బిడ్ల స్వీకరణ మొత్తం అత్యంత గుట్టుగా సాగిపోయింది. బిడ్ల దాఖలు చేసిన సంస్థలు ఏవి అన్న విషయం కూడా రహస్యంగానే ఉంచారు.

భక్తుల మనోభావాలు గౌరవించి సౌకర్యాలు కల్పించిన వైఎస్‌ జగన్‌
మల్లయ్య కొండల్లో వేల కోట్ల విలువైన ఇనుప ఖనిజం ఉన్నప్పటికీ, వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా భక్తుల మనోభావాలకే గౌరవమిచ్చారు. మైనింగ్‌ కంపెనీలు వీటిపై దృష్టి పెట్టకుండా చర్యలు చేపట్టారు. అక్కడ ఉన్న మల్లికార్జున స్వామి ఆలయానికి జీరో్ణద్ధరణ పనులు చేశారు. భక్తులకు తాగునీరు, రహదారి సహా అనేక సౌకర్యాలు కల్పించారు. ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం భక్తుల మనోభావాలతో చెలగాటమాడుతూ మైనింగ్‌కు సిద్ధమవుతోంది.          

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement