మూగ బంధం.. అంతులేని మమకారం | visakhapatnam dog graves on beach pet lovers emotional story | Sakshi
Sakshi News home page

మూగ బంధం.. అంతులేని మమకారం

Mar 7 2026 9:17 AM | Updated on Mar 7 2026 11:55 AM

visakhapatnam dog graves on beach pet lovers emotional story

విశాఖపట్నం: కుటుంబ సభ్యులను కోల్పోతే ఆ బాధ వర్ణనాతీతం. అయితే, ఎలాంటి రక్తసంబంధం లేకపోయినా మనకంటే ఎక్కువగా మనల్ని ప్రేమించే మూగజీవాలు దూరమైనా ఆ వ్యధ అంతకంటే ఎక్కువే ఉంటుంది. విశ్వాసానికి మారుపేరైన శునకాలను కేవలం పెంపుడు జంతువుల్లా కాకుండా, ఇంట్లో బిడ్డల్లా సాకుతున్న ఎందరో విశాఖవాసులు.. ఆ మూగజీవాలపై తమకున్న అంతులేని ప్రేమను కొత్తగా చాటుకుంటున్నారు. 

సాధారణంగా మనుషులకు సమాధులు కట్టి వారి జ్ఞాపకాలను పదిలపరుచుకోవడం మనం చూస్తుంటాం. కానీ, అప్పుఘర్‌ పార్క్‌ సమీపంలో ఉన్న సాగరతీరానికి వెళితే.. హృదయాన్ని హత్తుకునే అరుదైన దృశ్యాలు కనిపిస్తాయి. అక్కడ ఇసుక తిన్నెల్లో పదుల సంఖ్యలో శునకాలకు నిర్మించిన సమాధులు దర్శనమిస్తాయి. ఇంటికి కాపలాగా ఉంటూ, యజమాని చుట్టూ తిరుగుతూ, ఎలాంటి స్వార్థం లేకుండా ఎనలేని ప్రేమను పంచేవి శునకాలు. కొన్ని నెలలో, సంవత్సరాలో తమతో గడిపి, సంతోషాన్ని పంచిన ఆ మూగజీవాలు మరణిస్తే యజమానులు తట్టుకోలేకపోతున్నారు.

 అవి తమనుంచి దూరమైన తరువాత, వాటికి గౌరవప్రదమైన రీతిలో ఆఖరి మజిలీ నిర్వహిస్తున్నారు. సముద్ర తీరంలో వాటి కోసం ప్రత్యేకంగా సమాధులను కట్టించి తమ శాశ్వతమైన ప్రేమకు రూపమిస్తున్నారు. ఒక్కో సమాధి నిర్మాణానికి సుమారు రూ. 20వేల నుంచి రూ. 25 వేల వరకు ఖర్చవుతోంది. అయినా సరే, తమ కుటుంబంలో ఒకరిగా మెలిగిన జీవులకు ఘనంగా తుది వీడ్కోలు పలకడానికి వారు ఏమాత్రం వెనకాడటం లేదు. సముద్రపు అలల సాక్షిగా వెలసిన ఈ స్మృతి చిహా్నలు.. వ్యక్తులకు, మూగజీవాలకు మధ్య ఉన్న స్వచ్ఛమైన అనుబంధానికి సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. 
– ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్‌ విశాఖపట్నం

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement