సమాజ ప్రగతికి మహిళలే చోదక శక్తి | - | Sakshi
Sakshi News home page

సమాజ ప్రగతికి మహిళలే చోదక శక్తి

Mar 7 2026 7:16 AM | Updated on Mar 7 2026 7:16 AM

● కలెక్టర్‌ ఎం.ఎన్‌. హరేందిర ప్రసాద్‌ ● ఉత్సాహంగా మహిళలకు క్రీడాపోటీలు

మహారాణిపేట: మహిళా సాధికారత కేవలం మాటలకే పరిమితం కాకుండా కార్యరూపం దాల్చినప్పుడే దానికి నిజమైన సార్థకత చేకూరుతుందని కలెక్టర్‌ ఎం.ఎన్‌.హరేందిర ప్రసాద్‌ అన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ప్రతిభను చాటుతూ సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని కొనియాడారు. ఈ నెల 8న జరగనున్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్‌లోని మహిళా అధికారులు, సిబ్బందికి క్రీడా పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి కలెక్టర్‌ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పరిపాలనా వ్యవహారాల్లో మహిళా అధికారులు, సిబ్బంది చురుకై న పాత్ర పోషిస్తూ.. ప్రభుత్వ కార్యక్రమాల అమలులో కీలకంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. సునీతా విలియమ్స్‌, కల్పనా చావ్లా, పీవీ సింధు వంటి ప్రముఖులు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని, వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతి మహిళా తన లక్ష్యాలను సాధించి ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు. క్రీడలు ఆరోగ్యాన్ని కాపాడటమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి, క్రమశిక్షణకు, జట్టు భావనను పెంపొందించడానికి దోహదపడతాయని తెలిపారు. ఈ పోటీల్లో ప్రదర్శించిన ఉత్సాహాన్ని వృత్తి జీవితంలోనూ కొనసాగించాలని సూచించారు. ఈ పోటీల్లో జేసీతో పాటు డిప్యూటీ కలెక్టర్లు శేషశైలజ, అనిత, రామలక్ష్మి, మాధవి, కలెక్టరేట్‌ ఏవో బీవీ రాణి, ఇతర విభాగాల మహిళా సూపరింటెండెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా, ఆనందోత్సవాల మధ్య సాగింది. పోటీల్లో విజేతలకు ఈ నెల 8న బహుమతులు ప్రదానం చేయనున్నారు.

నారీ.. భేరీ! : విధుల్లోని ఒత్తిడిని పక్కనపెట్టి, ఉత్సాహంతో పోటీ పడుతున్న

కలెక్టరేట్‌ ఉద్యోగినులు. గెలుపు ఎవరిదైనా, ఈ ఐక్యతదే అసలైన విజయం.!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement