గోపాలపట్నం: రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు చూసీచూడనట్లు వెళ్లిపోకుండా, బాధితులను సకాలంలో ఆసుపత్రికి తరలించి ప్రాణాలు నిలపాలని, తద్వారా ప్రతి ఒక్కరూ ‘రహదారి వీరులు’గా మారాలని రవాణా శాఖ ఉప కమిషనర్ ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ప్రమాదం జరిగిన మొదటి గంటను గోల్డెన్ అవర్ అంటారని, ఆ సమయంలో వైద్యం అందిస్తే బాధితుల ప్రాణాలు దక్కే అవకాశాలు మెండుగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.
ఆందోళన కలిగిస్తున్న గణాంకాలు
జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది కేవలం మన జిల్లాలోనే 1,110 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, అందులో 340 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే బాధితులను ఆసుపత్రికి తరలిస్తే ఇందులో చాలా మంది ప్రాణాలను కాపాడే అవకాశం ఉండేది. అయితే, పోలీసు కేసుల్లో ఇరుక్కుంటామేమో అన్న భయం, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుందన్న అనుమానాలతో చాలా మంది ప్రమాదాలను చూసినా పట్టించుకోకుండా వెళ్లిపోతున్నారు.
భయం వద్దు.. ప్రభుత్వానిదే బాధ్యత
ప్రజల్లో ఉన్న ఈ అపోహలను తొలగించి, వారిని ప్రోత్సహించేందుకు ప్రభుత్వాలు కీలక చర్యలు చేపట్టాయి. రోడ్డు ప్రమాద బాధితులను కాపాడి ఆసుపత్రికి చేర్చే వారిని ‘గుడ్ సమరిటన్స్’(రహదారి వీరులు)గా గుర్తించి ప్రభుత్వం ప్రత్యేక పురస్కారాలు అందిస్తోంది. గతంలో ఈ ప్రోత్సాహకం రూ.5 వేలు ఉండగా, ఇప్పుడు దానిని ఏకంగా రూ.25 వేలకు పెంచారు. అంతేకాకుండా, సాయం చేసిన వారి వివరాలను పోలీసులు గానీ, ఆసుపత్రి సిబ్బంది గానీ బలవంతంగా అడగకూడదని చట్టం చెబుతోంది. బాధితుడిని మీరే కాపాడారని వైద్యులు లేదా పోలీసులు ధ్రువీకరిస్తే చాలు, ఈ పురస్కారానికి మీరు అర్హులవుతారు.
రూ.1.50 లక్షల వరకు ఉచిత వైద్యం
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారు ఏ ఆసుపత్రికి వెళ్లినా, తక్షణమే వైద్యం అందించాలని కేంద్ర ప్రభుత్వం కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఎలాంటి షరతులు, ముందస్తు చెల్లింపులు లేకుండా బాధితులకు రూ.1.50 లక్షల విలువైన వైద్యాన్ని ఆసుపత్రులు వెంటనే అందించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వమే నేరుగా ఆసుపత్రులకు చెల్లిస్తుంది. ఈ విధానం వల్ల ఆర్థిక స్థోమతతో సంబంధం లేకుండా నిరుపేదలకు సైతం తక్షణ ప్రాణరక్షణ కలుగుతుంది.
విస్తృత అవగాహన
కార్యక్రమాలు
క్షతగాత్రులను రక్షించడం, గోల్డెన్ అవర్ ప్రాముఖ్యంపై రవాణా శాఖ ఆధ్వర్యంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నాం. పోలీసులు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యంతో ‘రహదారి వీరుల’ పురస్కారాలపై ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం. రోడ్డు భద్రతా నిబంధనలు పాటించడంతో పాటు, ఆపదలో ఉన్నవారిని ఆదుకునే బాధ్యతాయుతమైన పౌరులుగా ప్రతి ఒక్కరూ మారాలి.
– ఆర్‌సీహెచ్ శ్రీనివాసరావు, డీటీసీ
రోడ్డు ప్రమాద బాధితులను కాపాడుకుందాం క్షతగాత్రులను కాపాడే వారికి అండగా ప్రభుత్వం ప్రాణదాతలకు రూ.25 వేల నజరానా


