కాలు విరిగిన బాలుడిని
కేజీహెచ్‌లో చేర్పించిన తల్లిదండ్రులు
శస్త్రచికిత్స అనంతరం ఫిట్స్..
వెంటిలేటర్‌పై చిన్నారి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ
బంధువుల ఆందోళన,
పోలీసులకు ఫిర్యాదు
మహారాణిపేట: కాలు విరిగిందని ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆరేళ్ల బాలుడు ఇప్పుడు ప్రాణాపాయస్థితిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఘటన కలకలం రేపుతోంది. కేజీహెచ్‌లో జరిగిన ఈ ఘటనపై బాలుడి కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యాన్ని ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. ద్వారకానగర్ ప్రాంతంలోని ఓ అపార్ట్‌మెంట్ వద్ద వాచ్‌మన్‌గా పనిచేస్తున్న వానపల్లి విజయకుమార్ కుటుంబంతో అక్కడే నివసిస్తున్నాడు. ఈ నెల 3వ తేదీన హోలీ సందర్భంగా ఇంటి సమీపంలో ఆడుకుంటున్న అతని కుమారుడు వానపల్లి అక్షయ్‌కుమార్ (6) ఖాళీ ప్రదేశంలో ఉన్న గోతిలో పడిపోవడంతో కుడికాలు విరిగింది. వెంటనే కుటుంబ సభ్యులు బాలుడిని కేజీహెచ్‌కు తరలించి ఆర్థోపెడిక్ విభాగంలోని ఎస్–5 వార్డులో చేర్పించారు. వైద్యులు ఈ నెల 5న ఉదయం బాలుడికి శస్త్రచికిత్స నిర్వహించారు. మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఆపరేషన్ పూర్తయింది. కొద్దిసేపటికే బాలుడు మెలకువ రావడంతో పాటు ఫిట్స్ రావడం కుటుంబ సభ్యులను ఆందోళనకు గురిచేసింది. తర్వాత తలనొప్పి ఉందని బాలుడు చెప్పినట్లు వారు తెలిపారు. కొద్దిసేపటికే బాలుడు స్పృహ కోల్పోవడంతో వైద్యులు వెంటనే సీఎస్‌ఆర్ బ్లాక్‌కు తరలించి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆవేదన : తమ కుమారుడి పరిస్థితి విషమంగా ఉండటంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శస్త్రచికిత్స సమయంలో ఇచ్చిన మత్తుమందు ప్రభావం ఎక్కువ కావడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘‘కాలు విరిగిందని ఆస్పత్రికి తీసుకొచ్చాంం ఇప్పుడు మా బిడ్డ ప్రాణాలతో పోరాడుతున్నాడు. మా కుమారుడిని ప్రాణాలతో మాకు అప్పగించాలి’’ అంటూ అక్షయ్‌కుమార్ తండ్రి విజయకుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
పోలీసులకు ఫిర్యాదు : వైద్య సేవల్లో నిర్లక్ష్యం జరిగిందని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు వన్‌టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే శుక్రవారం సీఎస్‌ఆర్ బ్లాక్ ఎదుట బాలుడి తల్లిదండ్రులు, బంధువులు ఆందోళన చేపట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు, ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అక్కడికి చేరుకుని కుటుంబ సభ్యులను సముదాయించడంతో ఆందోళన విరమించారు. ప్రస్తుతం బాలుడు వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.


