ఆగిన సబ్సిడీ.. తగ్గిన మత్స్య సంపద
● రెండు నెలల ముందే
నిలిచిన వేట!
● హార్బర్‌కు పరిమితమైన
85 శాతం బోట్లు
● పని చేయని ఆయిల్ కార్డులు,
పెరుగుతున్న అప్పులు
మత్స్యకారుల
బతుకుల్లో
మహారాణిపేట: సముద్రాన్నే నమ్ముకున్న మత్స్యకారుల బతుకులు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. ఒకవైపు చంద్రబాబు ప్రభుత్వం నుంచి అందని ప్రోత్సాహం.. ఆకాశాన్నంటుతున్న డీజిల్ ధరలు, మరోవైపు ఆశించిన మేర చిక్కని మత్స్య సంపద గంగపుత్రులను నష్టాల కడలిలోకి నెడుతున్నాయి. వీటికి తోడు ప్రభుత్వ ఆయిల్ సబ్సిడీ కార్డులు కూడా పనిచేయకపోవడంతో వేట గిట్టుబాటు కాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా ఏటా ఏప్రిల్ 15 నుంచి వేట నిషేధం అమల్లోకి వస్తుంది. అయితే పెరుగుతున్న ఆర్థిక భారంతో మత్స్యకారులు రెండు నెలల ముందే తమ మరబోట్లను తీరానికే పరిమితం చేస్తున్నారు.
గంగపుత్రుల ఆశలు ఆడియాసలు
మత్స్య సంపద పునరుత్పత్తి కోసం ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ప్రభుత్వం వేటను నిషేధిస్తుంది. ఆ తర్వాత వేట లాభసాటిగా ఉంటుందని మత్స్యకారులు ఆశిస్తారు. కానీ ఈ ఏడాది పరిస్థితులు అనుకూలించకపోవడంతో మత్స్యకారుల ఆశలు అడియాసలయ్యాయి. అనుకున్న స్థాయిలో వేట సాగకపోవడంతో ఫిషింగ్ హార్బర్‌లో దాదాపు 85 శాతం బోట్లు నిలిచిపోయాయి. కాగా.. 15 రోజుల పాటు సముద్రంలో వేట కోసం వెళ్లే ఒక మరబోటుకు దాదాపు రూ. 3.50 లక్షల వరకు ఖర్చవుతోంది. వారం రోజుల వేటకై తే రూ. 2 లక్షల వరకు వ్యయం అవుతోంది. ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడి పెట్టి వెళ్తున్నా, వలలకు తగిన స్థాయిలో చేపలు, రొయ్యలు చిక్కడం లేదు. మత్స్య సంపద తగ్గడానికి వాతావరణ మార్పులు, తరచుగా వస్తున్న తుపానులు, వాయుగుండాలు, పరిశ్రమల వ్యర్థాల వల్ల సముద్రం కాలుష్యమవుతుండటం ప్రధాన కారణాలని మత్స్యకారులు వాపోతున్నారు. అలాగే రింగు వలల వాడకం వల్ల కూడా మత్స్య సంపద క్షీణిస్తోందని చెబుతున్నారు. దీంతో తెచ్చిన అప్పులు తీరక బోటు యజమానులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు.
పనిచేయని ఆయిల్ సబ్సిడీ కార్డులు
మత్స్యకారులను ప్రోత్సహించేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఏటీఎం తరహాలో ఆయిల్ సబ్సిడీ కార్డులను పంపిణీ చేసింది. దీని ద్వారా మరబోటుకు నెలకు 3,000 లీటర్లు, మోటారు బోటుకు 300 లీటర్ల డీజిల్‌ను సబ్సిడీపై అందించేవారు. లీటరుకు రూ.9 చొప్పున రాయితీ లభించడంతో ఒక్కో బోటు యజమానికి నెలకు రూ. 27,000 వరకు ఆదా అయ్యేది. అయితే, చంద్రబాబు ప్రభుత్వ హయాంలో ఈ కార్డులు పనిచేయడం లేదని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెరిగిన డీజిల్ భారం నేరుగా వారిపై పడుతోంది.
ప్రభుత్వం ఆదుకోవాలి
చేపలు, రొయ్యల లభ్యత పడిపోయింది. పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి రావడం లేదు. అందుకే సీజన్ ముగియక ముందే బోట్లను నిలిపివేశాం. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి, నిలిచిపోయిన ఆయిల్ సబ్సిడీ కార్డులను పునరుద్ధరించి మత్స్యకారులను ఆదుకోవాలి.
– వాసుపల్లి జానకీరామ్,
మాజీ అధ్యక్షుడు, రాష్ట్ర మరపడవల సంఘం
2,491
మత్స్యకార గ్రామాలు
ఫిష్ ల్యాండింగ్ కేంద్రాలు
ఆధారపడిన జనాభా
సుమారు
80 వేల మంది
15
30


