మురళీనగర్: భారత వాయుసేనలో చేరాలనుకునే నిరుద్యోగ యువతకు ఒక అద్భుతమైన అవకాశం. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ వాయు ఓపెన్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ–2026కు సంబంధించిన ప్రకటన వెలువడిందని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి టి.చాముండేశ్వరరావు తెలిపారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ https://agnipathvayu.cdac.inను సందర్శించవచ్చు.
ముఖ్యమైన తేదీలివే.. : గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రాంగణంలో జరిగే ఈ ర్యాలీకి అభ్యర్థులు నేరుగా హాజరు కావాల్సి ఉంటుంది. దీని కోసం ముందస్తు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదు. ఈ నెల 9వ తేదీన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన మహిళా అభ్యర్థులకు, 12న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పురుష అభ్యర్థులకు, 15న తెలంగాణకు చెందిన పురుష అభ్యర్థులకు ర్యాలీ నిర్వహిస్తారు. నిర్దేశించిన తేదీల్లో ఉదయం 6 గంటల నుంచి 10 గంటల లోపు రిపోర్ట్ చేయాలి. మొదట 1.6 కిలోమీటర్ల పరుగు పోటీ ఉంటుంది. పరుగు పందెం, ఇతర భౌతిక, శారీరక పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారికి మాత్రమే తదుపరి దశలో రాత పరీక్ష నిర్వహిస్తారు.
అర్హతలివే.. : అవివాహిత పురుష, మహిళా అభ్యర్థులు మాత్రమే అగ్నివీర్ వాయుసేనకు అర్హులు. 2005 జూలై 2 నుంచి 2009 జనవరి 2వ తేదీ మధ్య జన్మించి ఉండాలి. కనీసం 152 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉండాలి. ఏదైనా స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్(10+2) లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించాలి. లేదా మూడేళ్ల డిప్లమో ఇంజినీరింగ్/2 ఏళ్ల ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. మొత్తం మార్కుల్లో 50 శాతం, ఇంగ్లిలో 50 శాతం మార్కులు తప్పనిసరి.(49.99 శాతం వచ్చినా పరిగణించరు).
కావాల్సిన పత్రాలివే.. : ఒరిజినల్ లేదా డిజీలాకర్ ద్వారా ధ్రువీకరించిన 10వ తరగతి, ఇంటర్/డిప్లమో సర్టిఫికెట్లు, నివాస ధ్రువీకరణ పత్రం, ఎన్‌సీసీ ఉన్నవారు సంబంధిత సర్టిఫికెట్, ఆధార్ కార్డు, యాక్టివ్ ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబరు, 10 పాస్‌పోర్టు సైజు కలర్ ఫొటోలు, ప్రతి సర్టిఫికెట్‌కు 6 సెట్ల జిరాక్స్ కాపీలు.


