రాష్ట్రానికి శాపంగా చంద్రబాబు భూదాహం
రాజధానికి మొదటిదశలో భూములిచ్చిన రైతులకు అన్యాయం
ల్యాండ్ పూలింగ్ రెండోదశకు వ్యతిరేకంగా రౌండ్‌టేబుల్ సమావేశంలో స్పష్టం చేసిన వక్తలు
సాక్షి ప్రతినిధి, గుంటూరు/గుంటూరు ఎడ్యుకేషన్ : అమరావతి రాజధాని పేరుతో సంవత్సరానికి మూడుపంటలు పండే భూములను తీసుకోవద్దన్న సూచనలు, సలహాలను చంద్రబాబు ఏమాత్రం పట్టించుకోకుండా ఆ భూములను కాంక్రీట్‌తో నింపేశారని రైతునేత వడ్డే శోభనాద్రీశ్వరరావు ధ్వజమెత్తారు. భూసేకరణ సమయంలో ఇచి్చన హామీలకు దిక్కు ఎవరని ప్రశ్నించారు. రాజధాని పేరుతో రైతుల నుంచి అడ్డగోలుగా భూములు లాక్కుని వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. రెండోవిడత భూసేకరణకు రైతులు సిద్ధంగా లేరని స్పష్టం చేశారు.
ల్యాండ్ పూలింగ్ రెండోదశకు వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి వికేంద్రీకరణ చర్చావేదిక శుక్రవారం గుంటూరులో నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ నిర్మాణమే లేని రాజధానిలో ఐదువేల ఎకరాల్లో ఎయిర్‌పోర్టు, 1,500 ఎకరాల్లో రైల్వేస్టేషన్ అంటూ సీఎం చంద్రబాబు, మున్సిపల్‌శాఖ మంత్రి నారాయణ ప్రజల్లో భ్రమలు కల్పిస్తున్నారని విమర్శించారు. సీఆర్‌డీఏతో రైతులు చేసుకున్న ఒప్పందానికి చట్టబద్ధత లేదని, మొదటివిడతలో భూములిచ్చిన రైతులు నెత్తీనోరు బాదుకుంటున్నారని చెప్పారు.
రెండోవిడత భూములు తీసుకునేముందు మొదటివిడతలో భూములిచి్చన రైతులకు ఏం న్యాయం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించిన మెడికల్ కళాశాలల నిర్మాణాలను పూర్తిచేసేందుకు రూ.4,400 కోట్లు లేవని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం రాజధాని అమరావతి చుట్టూ నిర్మించేందుకు ప్రతిపాదించిన ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్)కు రూ.వేలకోట్లు ఏ విధంగా ఖర్చుచేస్తుందని ప్రశ్నించారు.
మొదటివిడతలో భూములిచ్చిన రైతుల పిల్లల కోసం ఉచిత విద్య, వైద్య సదుపాయాలను కల్పించడం ప్రభుత్వ బాధ్యతగా పేర్కొన్న చంద్రబాబు సర్కారు.. రెండోవిడతకు వచ్చేసరికి దాన్ని ఉచిత విద్య, వైద్యానికి అర్హులు అని మార్పులు చేయడంతోనే భూసేకరణ వి«ధానంలోనే లోపముందని అర్థం చేసుకోవచ్చునని చెప్పారు. రైతుల అంగీకారం లేకుండా సెంటు భూమి కూడా సైతం తీసుకోలేరని స్పష్టం చేశారు. భూముల కోసం వచ్చే మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులకు భూములిచ్చేది లేదని తెగేసి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్తలు కుర్రా వసుంధర, మహదేవ్, విశ్రాంత ప్రొఫెసర్ సి.రామచంద్రయ్య, మెడికల్ పేరెంట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, చార్టర్ అకౌంటెంట్ పి.మల్లికార్జునరావు, హైకోర్టు న్యాయవాది కేవీఎం రజని, ప్రొఫెసర్ ఎన్.వేణుగోపాలరావు, జనచైతన్య వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ధనుంజయరెడ్డి, పలువురు రైతులు పాల్గొన్నారు.


