వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలి | Dharna under the auspices of the ap Village Revenue Assistants Association State Committee | Sakshi
Sakshi News home page

వీఆర్‌ఏల సమస్యలను పరిష్కరించాలి

Mar 7 2026 5:10 AM | Updated on Mar 7 2026 5:10 AM

Dharna under the auspices of the ap Village Revenue Assistants Association State Committee

లేదంటే ఏప్రిల్‌ 20 నుంచి నిరవధిక సమ్మె 

ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం హెచ్చరిక 

మంగళగిరి టౌన్‌ :  గ్రామ రెవెన్యూ సహాయకుల (వీఆర్‌ఏ) సమస్యలను తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో ఏప్రిల్‌ 20 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళతారని ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు హెచ్చరించారు. మంగళగిరి ఆటోనగర్‌లోని సీసీఎల్‌ఏ కార్యాలయం వద్ద శుక్రవారం ఆంధ్రప్రదేశ్‌ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. 

ఈ సందర్భంగా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. తెలంగాణ తరహాలో ఏపీలో కూడా వీఆర్‌ఏలందరికీ పే స్కేలు అమలుచేయాలని డిమాండ్‌ చేశారు. కష్టపడి పనిచేస్తున్నప్పటికీ వేతనాలు సరిపడాలేవన్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లక్షలాది రూపాయల వేతనాలు ఇస్తున్నారుగానీ వీఆర్‌ఏలకు మాత్రం పెంచడంలేదన్నారు. 

ఎన్నికల ముందు టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీ అమలుకు నోచుకోలేదని మండిపడ్డారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 22 నెలలవుతున్నా నేటికీ వీఆర్‌ఏల సమస్యల్లో ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు. నిబంధనలకు విరుద్ధమైన డ్యూటీలు వేస్తున్నారని, రీ సర్వే పేరుతో మైళ్లకొద్దీ ఇతర ప్రాంతాలకు వెళ్లి పనిచేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తంచేశారు.  

ప్లకార్డులతో ప్రదర్శన.. ధర్నా 
అంతకుముందు.. ఎన్‌ఆర్‌ఐ వై–జంక్షన్‌ నుంచి సీసీఎల్‌ఏ కార్యాలయం వరకు వీఆర్‌ఏలు ప్లకార్డులతో ప్రదర్శన నిర్వహించి ధర్నా చేశారు. కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్‌ బందగీ సాహెబ్, సీఐటీయూ జిల్లా అధ్యక్షులు లక్ష్మణరావు, సంఘం కోశాధికారి రవికుమార్, రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ త్రినాథరావు, ఉపా«ధ్యక్షులు నాగేంద్ర, సుబ్బయ్య, రాష్ట్ర నాయకులు కొండబాబు, శేఖర్, గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement