మదనపల్లె సిటీ : డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణంలో విద్యార్థులు భాగస్వాములు కావాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి కోరారు. స్థానిక పుంగనూరు రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం పాఠశాలల్లో ఈగల్ టీమ్స్ ఏర్పాటుపై జిల్లాలోని వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి నుంచి సమాజాన్ని రక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డ్రగ్స్ వల్ల జీవితాలు నాశనమతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమ పాఠశాలలు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడైనా డ్రగ్స్, గంజాయి, మాదకద్రవ్యాలు ఎవరైనా సేవిస్తే సమాచారాన్ని ఈగల్ క్లబ్ ద్వారా పోలీసులకు తెలియజేయాలన్నారు. ఇటీవల పాఠశాలలు, కాలేజీల వద్ద కూల్‌లిప్స్ పేరుతో డ్రగ్స్‌ను విద్యార్థులే టార్గెట్‌గా విక్రయిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు వీరి పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డీఈఓ డాక్టర్ సుబ్రమణ్యం మాట్లాడుతూ సమాజంలో డ్రగ్స్‌ను నిర్మూలించడంలో ప్రతి విద్యార్థి తమ వంతు కృషి చేయాలన్నారు. విద్యార్థులు చిన్నప్పటి నుంచే దుర అలవాట్లకు దూరంగా ఉండాలని కోరారు. ఈ సందర్భంగా విద్యార్థులచే డ్రగ్స్ అనర్థాల గురించి పాటలు, నాటికలు ప్రదర్శించారు. కార్యక్రమంలో మదనపల్లె డీవైఈఓ లోకేశ్వరరెడ్డి, ఎంఈఓలు రెడ్డిశేఖర్, ప్రభాకర్‌రెడ్డి, రాజగోపాల్, సీఐలు కళావెంకటరమణ, రవినాయక్, మోటివేషనల్ స్పీకర్ రామమూర్తి, జిల్లా లోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


