మదనపల్లెటౌన్ : అదనపు కట్నం కోసం భార్యను వేధిస్తున్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగిపై మదనపల్లె తాలూక పోలీసులు శుక్రవారం వరకట్న వేధింపుల కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి ఎస్‌ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. శ్రీకాళహస్తికి చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి షాజీద్(28) మదనపల్లె మండలం కొత్తపల్లె గ్రామం కొత్త ఇండ్లకు చెందిన షమీంభానును పెళ్లి చేసుకున్నాడు. కొంత కాలం వీరి కాపురం సజావుగా సాగింది. ఇటీవల షాజీద్ తన భార్యను అదనపు కట్నం తీసుకు రావాలని వేధించడంతో ఆమె తాలూకా పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిందని ఎస్‌ఐ తెలిపారు. విచారణ అనంతరం షాజీద్‌పై వరకట్న వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
కారు ఢీకొని
యువకుడికి గాయాలు
మదనపల్లెటౌన్ : కారు ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. తిరుపతికి చెందిన బీటెక్ విద్యార్థి ధనుష్ (22) స్థానిక బెంగుళూరు రోడ్డులోని జరుగుతున్న వివాహ ముహూర్తానికి చేరుకునేందుకు స్నేహితుని బైక్‌లో బయల్దేరాడు. మడికయల శివాలయం ఆర్చి వద్ద ఎదురుగా వచ్చిన కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితున్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ప్రథమ చికిత్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. వన్‌టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
దాడి కేసులో దంపతుల అరెస్ట్
కేవీపల్లె : ఓ వ్యక్తిపై కొడవలితో దాడి చేసి గాయపరచిన కేసులో దంపతులను అరెస్ట్ చేసినట్లు ఎస్‌ఐ వెంకటశివకుమార్ తెలిపారు. వివరాలిలా వున్నాయి. ఈ నెల 4వ తేదీన మండలంలోని శిబ్బాలవాండ్లపల్లెకు చెందిన పూజారి నాగులయ్య(76) బుధవారం వ్యవసాయ పనుల నిమిత్తం తన పొలంలోకి వెళ్లాడు. అదే గ్రామానికి చెందిన మల్లెల జయన్న(63) ఆయన భార్య సుబ్బులమ్మ (55) ఇద్దరూ కలసి పాత కక్షలతో నాగులయ్యపై కొడవలితో దాడికి పాల్పడ్డారు. బాధితుడు నాగులయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు శుక్రవారం నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులను జడ్జి ముందు హాజరుపరచగా వారికి 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ తెలిపారు.


