మదనపల్లె టౌన్ : జీవితంపై విరక్తితో ఓ వృద్ధురాలు పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం ములకలచెరువులో జరిగిన ఈ ఘటనపై బాధితరాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. ములకలచెరువులో ఉంటున్న సుబ్బారెడ్డి భార్య శ్యామలమ్మ(63) భర్త చనిపోయిన కొంత కాలానికి రెండో కుమారుడు అనారోగ్యంతో చనిపోయాడు. అప్పటి నుంచి పెద్ద కుమారుని దగ్గర ఉంటున్న శ్యామలమ్మకు ఏం కష్టం వచ్చింతో ఏమో.. జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని వెంటనే స్థానిక పీహెచ్‌సీకి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించి మదనపల్లెకు వెళ్లాలని రెఫర్ చేశారు. అక్కడి నుంచి వారు ఆమెను మదనపల్లెకు తీసుకు వచ్చి జిల్లా ఆస్పత్రిలో వైద్యం అందించారు. అయినా ఆరోగ్యం కుదుటపడక పోవడంతో ఆమె ఆరోగ్యం మరింత క్షీణించింది. ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ములకలచెరువు పోలీసులు తెలిపారు.
భార్యపై ఇటుక రాళ్లతో దాడి
మదనపల్లెటౌన్ : తాగిన మైకంలో భార్యపై భర్త ఇటుక రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. ఈ సంఘటన శుక్రవారం ఉదయం మదనపల్లెలో వెలుగు చూసింది. బాధితురాలు ఒకటో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. స్థానిక బెంగళూరు రోడ్డు, చిప్పిలిలో కాపురం ఉంటున్న ఉమాదేవి కుమారపురంలో ఉండే పవణ్ కళ్యాణ్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వీరికి ఇద్దరు ఆడ బిడ్డలు జన్మించారు. ఈ క్రమంలో మాదేవి కూలి పనులకు వెళ్లి తెచ్చే డబ్బంతా పవన్ కళ్యాణ్ తాగుడుకు ఖర్చు చేస్తుండడంతో, పిల్లలను పస్తులతో ఉంచలేనని భర్తను భార్య నిలదీసింది. దీంతో మద్యానికి డబ్బు ఇవ్వలేదన్న కోపంతో భార్య ఉమాదేవిని పవన్ కళ్యాణ్ ఇటుక రాళ్లతో కొట్టి తీవ్రంగా గాయపరచాడు. బాధితురాలిని కుటుంబీకులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
రేషన్ బియ్యం స్వాధీనం
పీలేరు రూరల్ : సుమారు 150 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం చేసుకున్నట్లు కడప విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఈ ఈశ్వరయ్య తెలిపారు. పీలేరు పట్టణంలో నిల్వ ఉంచిన రేషన్ బి య్యంపై విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని కామాటంపల్లెలో దేవేంద్ర గోడౌన్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వం పంపిణీ చేయాల్సిన రేషన్ బియాన్ని అక్రమంగా నిల్వ ఉంచారన్న సమాచారంతో దాడులు చేసినట్లు తెలిపారు. సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పారు. స్వాధీనం చేసుకున్న బియ్యం 9,905 బరువు ఉన్నట్లు తెలిపారు. ఈ దాడిలో విజిలెన్స్ సిబ్బంది సురేంద్ర, ఎం.వి. ప్రతాప్, వీఆర్‌వో సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.


