బోయకొండలో వేలం ద్వారా రూ.24.21 లక్షల ఆదాయం | - | Sakshi
Sakshi News home page

బోయకొండలో వేలం ద్వారా రూ.24.21 లక్షల ఆదాయం

Mar 7 2026 8:08 AM | Updated on Mar 7 2026 8:08 AM

చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయ అడ్మినిస్ట్రేషన్‌ కార్యాలయంలో శుక్రవారం వివిధ హక్కుల నిర్వహణకు ఏడాది పాటు గడువు ఇస్తూ వేలం పాట నిర్వహించారు. ఈ వేలాల ద్వారా ఆలయానికి రూ.24.21 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. కేవలం 17 మంది స్థానికులు మాత్రమే నిర్ణయించిన మేరకు ధరావత్తు డిపాజిట్టు చెల్లించి వేలం పాటలో పాల్గొన్నారు. గత యేడాది వేలంలో వచ్చిన ఆదాయానికి నామమాత్రంగా పెంపు చేసి వేలంలో టార్గెట్‌ చేరిన వెంటనే వేలం తంతు ముగింపు చేశారని ఆరోపణలు వచ్చాయి. కోళ్లు విక్రయించుకొను హక్కు రూ.7 లక్షలకు లవకుమార్‌, ఆలయం వద్ద ఫొటోలు తీసుకొనే హక్కు 1.91 లక్షల రూపాయలకు కిరణ్‌ సొంతం చేసుకున్నారు. కొబ్బరి చిప్పలు సేకరించుకొనుటకు 7.70 లక్షలకు హెచ్చుపాటతో మల్లికార్జున నాయుడు, పేపర్‌ కవర్లు, బ్యాగులు విక్రయించుకొనుటకు 6.70 లక్షల రూపాయలతో హెచ్చుపాటతో గజేంద్ర దక్కించుకొన్నట్లు ఈఓ తెలిపారు. దేవస్థానం పరిసర ప్రాంతాల్లో స్టీల్‌, రాగి, ఇత్తడి ప్లేట్లు తదితర పరికరాలు విక్రయించుకొను హక్కు ద్వారా రూ.90 వేలు ఆదాయం వచ్చింది. ఈ కార్యక్రమంలో ఇన్‌స్పెక్టర్‌ శశిధర్‌, సూపరింటెండెంట్‌ రామనాథం తదితరులు పాల్గొన్నారు.

కొన్ని వాయిదా

కొన్ని హక్కుల వేలం పాటలో పాటదారులు ఎవరూ ముందుకు రాకపోవడంతో వాయిదా వేసినట్లు ఈఓ ఏకాంబరం వెల్లడించారు. కొండపైన క్యాంటీన్‌, ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్‌ విక్రయించుకొను హక్కు, కొండ కింద క్యాంటీన్‌, ఐస్‌క్రీములు, కూల్‌డ్రింక్స్‌ విక్రయించుకొను హక్కు, కొండపైన 4 దుకాణాల ద్వారా పవిత్ర దారాలు, టాయ్స్‌, ఫొటోలు, కలకండ వగైరా విక్రయించుకొను హక్కు, పాదరక్షలు భద్రపరుచుకొను హక్కు, కొండపైన పెద్దబోగం మొక్కుబడి రుసుం నిర్వహించుకొను హక్కు, కొండ కింద షాపు రూములపైన డార్మీటరీ హాళ్లు నిర్వహించుకొను హక్కు, రణభేరి గంగమ్మ దేవస్థానం వద్ద పవిత్ర దారాలు విక్రయించుకొను హక్కు, రణభేరి గంగమ్మ దేవస్థానం వద్ద వాహనాల పూజలు నిర్వహించుకొను హక్కులను వాయిదా వేసినట్లు ఈఓ ప్రకటించారు. వాయిదా పడిన వేలం పాటలను తిరిగి నిర్వహించేలా చర్యలు తీసుకొంటామని, తేదీలను త్వరలో ప్రకటిస్తామని ఈఓ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement