‘పంచాయతీ’ప్రచారంలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ
రాళ్లతో ఇరువర్గాల పరస్పర దాడిలో ఉప్పుల మల్లయ్య మృతి
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో ఘటన
నూతనకల్: సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లిలో బీఆర్‌ఎస్ నేత ఉప్పుల మల్లయ్య (55) దారుణ హత్యకు గురయ్యాడు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీ నాయకుల మధ్య ఆధిపత్యపోరులో ఈ ఘర్షణ జరిగింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లింగంపల్లి సర్పంచ్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయ్యింది. బీఆర్‌ఎస్ మద్దతుదారుగా మాదాసు వెంకన్న, కాంగ్రెస్ పార్టీ బలపర్చిన అభ్యర్థిగా దేశపంగు మురళి సర్పంచ్ బరిలో నిలిచారు.
గ్రామానికి చెందిన బీఆర్‌ఎస్ నేత ఉప్పుల మల్లయ్య కోడలు ఉప్పుల శైలజ 4వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థిగా పోటీలో ఉంది. మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో ఇరు పార్టీల వారు ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేతలు ప్రచారం ముగించుకొని గ్రామంలోని పార్టీల జెండా దిమ్మెల సమీపంలో కూర్చున్నారు. అదే సమయంలో బీఆర్‌ఎస్ వారు ఓటర్లను కలిసివస్తున్న సమయంలో.. శైలజకు ప్రత్యర్థిగా ఉన్న ఆకుల రజిత వర్గానికి చెందిన ఉప్పుల సతీశ్, కొరివి గంగయ్య, వీరబోయిన సతీశ్, ఉప్పుల గంగయ్య, ఉప్పుల ఎలమంచి, వీరబోయిన లింగయ్య, కారింగుల రవీందర్, దేశపంగు అవిలయ్యలు గొడవ పడడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చేసుకుంది.
ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు.. బీఆర్‌ఎస్ కార్యకర్తలపై కర్రలు, రాళ్లతో దాడికి పాల్పడ్డారు. బీఆర్‌ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మున్నా మల్లయ్యపై దాడి చేయగా, అడ్డుకోవడానికి వెళ్లిన ఉప్పుల మల్లయ్యపై కూడా కర్రలతో దాడి చేశారు. దీంతో మల్లయ్య తలకు తీవ్రగాయాలై కిందపడిపోయాడు. ఇదే సమయంలో తలపై బండరాయితో మోపడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. అతడిని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు చికిత్స నిమిత్తం 108 వాహనంలో సూర్యాపేటకు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తీసుకెళ్లారు.
వైద్యులు పరిశీలించి ఉప్పుల మల్లయ్య మృతి చెందినట్టు చెప్పారు. ఈ దాడిలో మున్నా మల్లయ్యతోపాటు అతని సోదరుడు లింగయ్య, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. మల్లయ్య మృతదేహానికి సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం భారీ పోలీస్ బందోబస్తు మధ్య గ్రామంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. కాగా, రాజకీయ కక్షలతోపాటు దాయాదుల గొడవలు కూడా ఈ దాడికి కారణమైనట్టు తెలిసింది.
ఎనిమిది మంది నిందితుల అరెస్ట్
ఉప్పుల మల్లయ్య హత్య కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్టు సూర్యాపేట జిల్లా అడిషనల్ ఎస్పీ రవీందర్‌రెడ్డి తెలిపారు. మృతుడి భార్య లింగమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. దాడికి పాల్పడి, మృతికి కారకులైన ఎనిమిది మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు వివరించారు.


