ఓయూ అభివృద్ధికి ప్రకటించిన రూ.1,000 కోట్ల నిధుల మంజూరు పత్రాన్ని వీసీ కుమార్‌కు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో అడ్లూరి, పొన్నం, కేశవరావు, వీహెచ్ తదితరులు
పేదలకు అధునాతన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలన్నదే లక్ష్యం
ఉస్మానియా వర్సిటీ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
రాజకీయాలకు అతీతంగా వర్సిటీల్లో నియామకాలు
పైరవీలు సహించం.. ప్రభుత్వ జోక్యం ఉండదు!
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఈ వర్సిటీది
రాష్ట్రానికి పట్టిన చీడను ఎలా వదిలించాలో తెలుసు..
తనకు విదేశీ భాష రాదు కానీ పేదల మనస్సు చదవడం వచ్చన్న సీఎం
సాక్షి, హైదరాబాద్: విశ్వవిద్యాలయాల్లో బోధన, బోధనేతర సిబ్బంది నియామకాలు రాజకీయాలకు అతీతంగా చేపడతామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. ఎవరు పైరవీలు చేసినా సహించబోమని, ఇందులో ప్రభుత్వ జోక్యం కూడా ఉండదని అన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని అందించిన ఘనత ఉస్మానియా యూనివర్సిటీదేనన్నారు. ఎంతోమంది ఉద్యమకారులను, మేధావులను అందించిన చరిత్ర ఓయూకు ఉందని చెప్పారు.
అయితే గడచిన పదేళ్ళుగా వర్సిటీ అభివృద్ధికి దూరంగా ఉందని విమర్శించారు. ఓయూ అభివృద్ధికి బాటలు వేసేందుకే తాను వచ్చానని అన్నారు. యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలన్నదే తమ సంకల్పమని, అందుకే రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేశామని తెలిపారు. తెలంగాణకు పట్టిన చీడను ఎలా వదిలించాలో తనకు తెలుసునని వ్యాఖ్యానించారు. బుధవారం ఓయూను సందర్శించిన ముఖ్యమంత్రి.. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మాట్లాడారు.
ఇంగ్లీష్ కమ్యూనికేషన్ మాత్రమే..నాలెడ్జ్ కాదు
‘ఏ వ్యక్తికైనా భూమి లేకపోవడాన్ని పేదరికంగా గుర్తిస్తారు. కానీ చదువు లేకపోవడం వెనుకబాటుతనమనే అనాలి. విద్య ఒక్కటే వెనుకబాటుతనాన్ని దూరం చేస్తుంది. అయితే డబ్బులు ఉన్నవాళ్లు అంతర్జాతీయ యూనివర్సిటీల్లో చదువుకుంటారు. ఆ అవకాశం లేని పేదల కోసం ఓయూలో అధునాతన, నైపుణ్యాలతో కూడిన విద్యను అందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యం. ఆంగ్ల భాష కమ్యూనికేషన్ మాత్రమే.. నాలెడ్జ్ కాదు. అభివృద్ధి చెందిన దేశాల్లోని వారు ఇంగ్లీష్ పెద్దగా మాట్లాడరు. చైనీయులకు ఇంగ్లీష్ భాష రాదు.
ఆ దేశం ఉత్పత్తులు నిలిపివేస్తే అమెరికా విలవిల్లాడుతుంది. నేను ప్రభుత్వ స్కూల్‌లో చదువుకున్నా. గుంటూరులో చదువుకోలేదు. గూడు పుఠాణీలు తెలియవు. నాకు విదేశీ భాష రాకపోవచ్చు కానీ పేదవాడి మనసు చదవడం వచ్చు. పేదలు, నిస్సహాయులకు సాయం చేయాలనే తపన నాకు ఉంది. అలాగని ఇంగ్లీష్ నేర్చుకోవడం పెద్ద సమస్య కూడా కాదు. నాలెడ్జ్, దృఢ సంకల్పం ఉంటే ఏదైనా సాధించవచ్చు. చరిత్ర గుర్తుంచుకునేలా పాలన అందించాలన్నదే నా లక్ష్యం..’అని సీఎం వెల్లడించారు.
యువత చదువుకుని పైకి రావాలి
‘విద్యార్థులు రాజకీయాల ఉచ్చులో పడకుండా, నిబద్ధతతో చదువుకుని పైకి రావాలి. డాక్టర్లు, లాయర్లు, రాజకీయ ప్రముఖులు కావాలి. యువత డిగ్రీలు సాధిస్తున్నారు కానీ, నైపుణ్యం ఉండటం లేదు. ఈ లోటును భర్తీ చేసేందుకే యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేశాం. 2036 ఒలింపిక్స్ లక్ష్యంగా యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి, మట్టిలో మాణిక్యాలను వెలికి తీసే ప్రయత్నం జరుగుతోంది.
నాకు ఫాం హౌస్‌ల్లేవ్
చేతనైతే ఓయూ ఆర్ట్స్ కాలేజీకి రమ్మని గతంలో కొంతమంది సవాల్ విసిరారు. కానీ నేను అభిమానంతో ఇక్కడికి వచ్చా. నాకు ఎక్కడా ఫాం హౌస్‌లు లేవు. నేను ప్రజల సొమ్ము దోచుకోలేదు. ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. రెండేళ్ళల్లో ఏం చేశావని నన్ను ప్రశ్నించే నేతలు పదేళ్ళ పాలనలో ఏం చేశారో చెప్పాలి. కుటుంబం మొత్తం వందల ఎకరాల్లో ఫామ్‌హౌస్‌లు కట్టుకున్న వాళ్ళు దళితులకు మూడెకరాలు భూమి ఇస్తామన్న హామీని అమలు చేశారా? మేము రెండేళ్ళ పాలనలో ‘జయ జయహే తెలంగాణ’గీతాన్ని రాష్ట్ర గీతంగా గుర్తించాం.
బహుజనుల తెలంగాణ తల్లిని ఆవిష్కరించుకుని జాతికి అంకితం చేశాం. ఎస్సీ వర్గీకరణ అమలుతో సామాజిక న్యాయం చేశాం. బీసీల లెక్క తేల్చేందుకు కులగణన చేపట్టాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. కార్యక్రమంలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ ఎం.కోదండరాం, ఏవీఎన్ రెడ్డి, అద్దంకి దయాకర్, హైదరాబాద్ మేయర్ జి. విజయలక్ష్మి, ప్రభుత్వ సలహాదారు కె.కేశవరావు, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వి.బాలకిష్టారెడ్డి, కళాశాల విద్య కమిషనర్ ఎ.శ్రీదేవసేన, ఓయూ వీసీ కుమార్ మొలుగరం తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి నమూనాల ఆవిష్కరణ
సభా వేదికపై ఓయూ అభివృద్ధికి సంబంధించిన పలు నమూనాలను సీఎం ఆవిష్కరించారు. ప్రతిపాదిత మాస్టర్ ప్లాన్‌లో కొత్త అకడమిక్ బ్లాక్, పరిశోధన, అభివృద్ధి బ్లాక్, కొత్త బాలుర, బాలికల హాస్టళ్లు, బహుళార్ధసాధక క్రీడా కేంద్రం, సమీకృత గ్రంథాలయం, కొత్త ఆరోగ్య కేంద్రం, జీవ వైవిధ్య ఉద్యానవనం, కన్వెన్షన్ సెంటర్, సైకిల్ ట్రాక్‌లు, పాదచారుల నడక మార్గాలతో కూడిన విస్తృత రహదారి నెట్‌వర్క్ ఉన్నాయి. కాగా ఓయూ అభివృద్ధి పనులకు రూ.1,000 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు విడుదల చేసింది.


