సాక్షి,హైదరాబాద్: ప్రేమ పేరుతో మరో దారుణం చోటుచేసుకుంది. పెళ్లి చేస్తామంటూ ఇంటికి పిలిచి ఓ యువకుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన పటాన్ చెరులో వెలుగులోకి వచ్చింది. ప్రేమ వ్యవహారమే ఈ దారుణానికి కారణమని పోలీసులు ప్రాథమిక విచారణలో నిర్ధారించారు.
పటాన్ చెరుకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి శివ అదే ప్రాంతానికి చెందిన ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. ఇద్దరి మధ్య నెలలుగా ప్రేమాయణం కొనసాగుతున్నట్లు సమాచారం. అయితే ఈ సంబంధం యువతి కుటుంబ సభ్యులకు నచ్చలేదు. వారి మధ్య ప్రేమ వ్యవహారం బయటపడడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహానికి గురైనట్లు తెలుస్తోంది.
పెళ్లి చేస్తామని నమ్మించి
పోలీసుల ప్రకారం..యువతి కుటుంబ సభ్యులు ముందుగా పక్కా ప్లాన్ వేసుకున్నారు. ‘ఇద్దరికీ పెళ్లి చేస్తాం, ఇంటికి రా’ అంటూ శివని తమ ఇంటికి పిలిపించారు. పెళ్లి మాట నమ్మిన శివ యువతి ఇంటికి వెళ్లాడు. ఇంటికి చేరుకున్న వెంటనే యువతి కుటుంబ సభ్యులు శివసాయిపై దాడి ప్రారంభించారు. క్రికెట్ బ్యాట్లతో విచక్షణారహితంగా కొట్టడంతో శివ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. తీవ్ర గాయాలతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది.
పోలీసుల దర్యాప్తు ప్రారంభం
సమాచారం అందుకున్న పటాన్ చెరు పోలీసులు వెంటనే ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. శివ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు. యువతి కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరువు హత్య కోణంలో విచారణ కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు.
స్థానికులు ఆగ్రహం
ఈ ఘటనతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రేమ పేరుతో యువకుడి ప్రాణం తీసిన కుటుంబ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.


