హైదరాబాద్: గూగుల్, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా హైదరాబాద్‌లోని టి-హబ్‌లో ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ను ప్రారంభించాయి. తెలంగాణలో వేగంగా పెరుగుతున్న స్టార్టప్, ఇన్నోవేషన్ వ్యవస్థకు మరింత బలం చేకూర్చే ఈ కేంద్రం.. భారతదేశంలోనే ఈ తరహాలో తొలి హబ్‌గా నిలిచింది. ప్రాంతీయ ఆవిష్కర్తలకు ప్రపంచ స్థాయి వనరులు, నైపుణ్యం, నెట్‌వర్క్ అందించాలనే లక్ష్యంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు.
ఏం చేస్తుందీ కేంద్రం?
తెలంగాణలోని ఏఐ-ఫస్ట్ స్టార్టప్‌లను ఎంపిక చేసి, వారికి ఏడాది పొడవునా ఉచిత కో-వర్కింగ్ సౌకర్యాలు, గూగుల్ నిపుణుల మెంటర్‌షిప్, వెంచర్ ఇన్వెస్టర్లతో కనెక్షన్ వంటి అవకాశాలను హబ్ అందిస్తుంది. సాంకేతిక ప్రతిభను పెంపొందించడం, గ్లోబల్ మార్కెట్లకు యాక్సెస్ కల్పించడం, బాధ్యతాయుతమైన ఏఐ ఆధారిత వ్యాపారాల్ని నిర్మించడంలో స్టార్టప్‌లకు దోహదపడడం ఈ కేంద్రం ప్రధాన లక్ష్యం.
గూగుల్ ఫర్ స్టార్టప్స్ గ్లోబల్ నెట్‌వర్క్‌లో భాగంగా ఈ హబ్, ఆలోచనల దశ నుండి స్కేలింగ్ దశ వరకు స్టార్టప్‌ల ప్రయాణానికి తోడ్పాటు అందిస్తుంది. వర్ధమాన వ్యవస్థాపకులకు ప్రత్యేక మౌలిక సదుపాయాలు, ఏఐ నైపుణ్యం, మెంటర్‌షిప్, ప్రోడక్ట్, యూఎక్స్ గైడెన్స్‌తో పాటు కమ్యూనిటీ ఈవెంట్స్, మార్కెట్ యాక్సెస్ ప్రోగ్రామ్‌లు కూడా అందుబాటులో ఉంటాయి. మహిళా ఎంట్రాప్రెన్యూర్లు, టైర్-2 ఆవిష్కర్తలు, విశ్వవిద్యాలయ ప్రతిభకు ప్రత్యేక ప్రోత్సాహం ఇవ్వడం కూడా ఈ హబ్ ప్రత్యేకత.
తెలంగాణకు పెద్ద అడుగు
గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, గౌరవ అతిథిగా ఐటీ, పరిశ్రమల మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, “తెలంగాణను ప్రపంచ పోటీతత్వ ఆవిష్కరణ కేంద్రంగా మార్చడానికి ఇది మౌలిక సదుపాయాలకన్నా పెద్ద అడుగు. హైదరాబాద్‌లో రూపొందుతున్న ఆలోచనలకు ప్రపంచ వ్యాప్తి కల్పించే మార్గదర్శకత్వం, సాంకేతికత, మార్కెట్ యాక్సెస్‌ను గూగుల్ హబ్ అందిస్తుంది” అన్నారు.
గూగుల్ ఇండియా కంట్రీ మేనేజర్ ప్రీతి లోబానా మాట్లాడుతూ.. “గూగుల్ క్లౌడ్ ఏఐ సామర్థ్యాల నుండి ఆండ్రాయిడ్, ప్లే, ప్రకటనలు, డెవలపర్ ప్రోగ్రామ్‌ల వరకు గూగుల్ పూర్తి మద్దతును తెలంగాణ స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు అందిస్తున్నాము. ఈ హబ్ భారత్‌తో సహా ప్రపంచమంతటికీ బాధ్యతాయుత ఏఐ ఆధారిత డీప్-టెక్ పరిష్కారాలను రూపొందించడంలో స్టార్టప్‌లకు సహాయపడుతుంది” అన్నారు.


