కర్ణాటక: ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్తనే హత్య చేయించిందో భార్య. ఈ కేసులో ఆమెతో పాటు నలుగురిని హోసూరు పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల మేరకు హోసూరు కార్పొరేషన్ పరిధిలోని పార్వతీనగర్‌కు చెందిన శరవణన్ (25). భార్య ముత్తులక్ష్మి(21). గత నాలుగేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకొన్నారు. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
మరొకరితో ప్రేమాయణం
ఇంతలో ముత్తులక్ష్మి అదే ప్రాంతానికి చెందిన సూర్య (23)తో పరిచయం పెరిగి అక్రమ సంబంధం ఏర్పడింది. ఇది తెలిసి శరవణన్ భార్యను నిలదీయడంతో వారి మధ్య తరచూ గొడవలేర్పడుతుండేది. గత కొద్ది రోజుల క్రితం ముత్తులక్ష్మి ఇద్దరు పిల్లలను భర్త ఇంట్లో వదిలి సూర్యతో వెళ్లిపోయింది. బంధువులు ఆమెకు నచ్చజెప్పి భర్త వద్దకు చేర్చారు. కానీ ఇద్దరూ తరచూ గొడవపడేవారు. ఈ సమయంలో ఆమె తన ప్రియునితో కలిసి భర్తను హత్య చేసేందుకు పథకం వేసింది.
రెండు రోజుల క్రితం అర్ధరాత్రి సమయంలో సూర్య, మరో ఇద్దరిని తీసుకుని వచ్చాడు. నిద్రిస్తున్న శరవణన్‌ను ముత్తులక్ష్మి సహకారంతో కత్తులతో పొడిచి హత్య చేసి పరారయ్యారు. ఈ ఘటనపై శరవణన్ తల్లి మంగమ్మ పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు విచారణ చేపట్టారు. భార్య ముత్తులక్ష్మి, ప్రియుడు సూర్య, సంతోష్ శక్తిలను అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసి తీవ్ర విచారణ జరుపుతున్నారు.


