మీటర్ రీడర్‌పై పాశవిక దాడి
మండ్య: మండ్య నగరంలోని గాంధీనగర్‌లోని ఏడవ క్రాస్‌లో సెస్కాం విద్యుత్ సంస్థ మీటర్ రీడర్ మీద ఓ కుటుంబం హత్యాయత్నానికి పాల్పడింది. మీటర్ పాతబడింది, కొత్త మీటర్‌ను అమర్చుకోవాలని చెప్పడమే అతను చేసిన పాపం. వివరాలు.. మండ్య సబ్–డివిజన్ సెస్కాంలో మీటర్ రీడర్ పి.సి.చన్నకేశవ (45) బాధితుడు. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం, ప్రకాష్, అతని కుమారుడు అర్జున, భార్య, తల్లి, మనవరాళ్ళు అతనిపై దాడి చేశారు. డిసెంబర్ 8న, చన్నకేశవ గాంధీనగర్‌లోని ఏడవ క్రాస్‌లోని ప్రకాష్ ఇంటికి మీటర్ రీడింగ్ కోసం వెళ్ళినప్పుడు, మీటర్ పాడైపోయిందని గమనించాడు. కొత్త మీటర్‌ను అమర్చుకోవాలని చెప్పడంతో మాకే చెప్పేంతవాడినా అని కోపం పట్టలేక దూషించి రంపం, కట్టెలు, రాళ్లు, ఇటుకలతో చావబాదారు. చన్నకేశవ వదిలేయాలని వారిని వేడుకున్నా వినకుండా కండలు ఊడి రక్తం పారేలా కొట్టసాగారు. బాధితుడు ఎలాగో తప్పించుకుని ఆస్పత్రిలో చేరాడు. దాడికి పాల్పడిన నిందితులపై వెస్ట్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు.
హోటల్‌లో నగల మాయం
మైసూరు: హోటల్ గదిలో ఓ మహిళ ఆభరణాల బ్యాగ్ మాయమైన ఘటన మైసూరు నగరంలో జరిగింది. వివరాలు.. బెంగళూరులోని టీ.దాసరహళ్లి నివాసి పల్లవి.. సోదరి వివాహ వేడుక కోసం కుటుంబ సభ్యులతో కలిసి మైసూరుకు వచ్చి ఓ హోటల్‌లో బస చేశారు. హెబ్బాళలోని లక్ష్మీకాంత దేవస్థానంలో జరిగిన వివాహంలో పాల్గొని హోటల్‌కు తిరిగి వచ్చారు. వేరొక హోటల్‌లో జరిగే రిసెప్షన్‌కు వెళ్లే ముందు రెండు గదులను ఖాళీ చేసి లగేజీని చూసుకోగా రూ.2 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలు ఉన్న బ్యాగ్ కనిపించలేదు. నజరాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
గీజర్ లీకై తల్లీ బిడ్డ మృతి
దొడ్డబళ్లాపురం: వేడినీళ్ల గ్యాస్ గీజర్ లీక్ కావడంతో అస్వస్థతకు గురైన తల్లీ బిడ్డ చనిపోయిన సంఘటన బెంగళూరు గోవిందరాజనగరలోని పంచశీల నగరలో జరిగింది. తల్లి చాందిని (26), కుమార్తె యువి (4) మృతులు. చాందిని సోమవారం సాయంత్రం కుమార్తెకు స్నానం చేయించడానికి బాత్రూంలోకి వెళ్లగా అప్పటికే గ్యాస్ గీజర్‌లో నుంచి గ్యాస్ లీకై ఉంది. ఆ వాయువుని పీల్చిన ఇద్దరూ స్పృహ తప్పిపడిపోయారు. కొంతసేపటికి ఇరుగుపొరుగు ఇద్దరినీ విక్టోరియా ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ చనిపోయారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
అన్నదాతల
ఇబ్బందులు పట్టవా?
● ఎప్పుడూ కుర్చీ గొడవలేనా?
● బెళగావిలో రైతులు, బీజేపీ నేతలచే అసెంబ్లీ ముట్టడి
బనశంకరి: రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ధోరణిని అవలంబిస్తోందంటూ రైతు సంఘాలతో కలిసి బీజేపీ నాయకులు బెళగావిలో అసెంబ్లీ ముట్టడిని నిర్వహించారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బీవై.విజయేంద్ర, ఆర్.అశోక్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, రైతులు పాల్గొన్నారు. బెళగావి మాలిని మైదానంలో రైతులతో కలిసి ధర్నా చేపట్టారు. తరువాత హైవే–4 గుండా అసెంబ్లీకి ర్యాలీగా బయల్దేరారు. మధ్యలోనే పోలీసులు అడ్డుకున్నారు. రైతులు మొక్కజొన్న , కందిని ప్రదర్శిస్తూ తక్షణమే కొనుగోళ్లు చేపట్టాలని, మద్దతు ధరలను ప్రకటించాలని పలు నినాదాలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జవాబుదారీ లేకుండా కేంద్ర ప్రభుత్వం పై అనవసర ఆరోపణలు చేస్తోందని దుయ్యబట్టారు. బీవై.విజయేంద్ర మాట్లాడుతూ దేశంలో అత్యధికమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నది కర్ణాటకలోనే అన్నారు. రైతులు, ప్రజల సమస్యల పరిష్కారానికి బదులుగా సీఎం, డిప్యూటీ సీఎం కుర్చీ కోసం పోరాటంలో నిమగ్నమయ్యారనిమారోపించారు. వెంటనే మొక్కజొన్న, కందిపంటల కొనుగోలు కేంద్రాలను తెరవాలని సర్కారును డిమాండ్ చేశారు. తుంగభద్ర ఆనకట్ట గేట్లు పాడై ఏడాదిన్నర గడించింది, ఇప్పటికీ బాగు చేయలేదని అన్నారు.
మీటర్ రీడర్‌పై పాశవిక దాడి
మీటర్ రీడర్‌పై పాశవిక దాడి


