యూటర్న్‌లో వరుస యాక్సిడెంట్లు
భాగ్యనగర్, (బాగేపల్లి): మలుపులో ఆగి ఉన్న ఆటోను లారీ వెనుక నుంచి ఢీకొట్టగా ఆటోలో నుంచి వృద్ధుడు కిందపడిపోయాడు, అతని మీద నుంచి ఏపీఎస్ ఆర్టీసీ దూసుకెళ్లడంతో దుర్మరణం చెందాడు. ఈ ప్రమాదాల్లో మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాగేపల్లి పట్టణ శివార్లలోని జాతీయ రహదారి–44 లో సాయిబాబా ఆలయం మలుపు వద్ద మంగళవారం ఈ సంఘటన జరిగింది. పొరుగున హిందూపురం తాలూకా లేపాక్షి మండలం చిలువెందుల వాసి ఆదిమూర్తి (80) మృతుడు.
ఎలా జరిగింది
బాగేపల్లి తాలూకాలోని సుంకులమ్మ దేవి ఆలయానికి కొందరు ఆటోలో వచ్చారు. హైవేలో మలుపు వద్ద యూ టర్న్ తీసుకోవడానికి ఆటోని ఆపారు. ఈ సందర్భంలో బైకిస్టును తప్పించే యత్నంలో ఓ లారీ అదుపుతప్పి ఆటోను ఢీకొనింది. ఈ ధాటికి ఆటోలో నుంచి ఆదిమూర్తి పడిపోవడం, అతని మీద నుంచి ఏపీఎస్‌ఆర్టీసీ బస్సు వెళ్లిపోవడం క్షణాల్లో జరిగాయి. ఆటోలో ఉన్న మిగిలిన ప్రయాణికులకు తీవ్ర గాయాలు పాలయ్యారు. వారిని బాగేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి చిక్కబళ్లాపుర జిల్లా ఆసుపత్రికి తరలించారు. పోలీసు అధికారులు ఘటనాస్థలిని పరిశీలించారు. ఎస్పీకుశాల్ చౌక్సే మీడియాతో మాట్లాడుతూ, ప్రమాదాలకు ప్రధాన కారణం డ్రైవర్లు ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించడమేనని అన్నారు. ఈ నెల 12 నుంచి ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్‌ను ధరించాలని తెలిపారు. లారీ, బస్సు డ్రైవర్లపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆగి ఉన్న ఆటోను లారీ ఢీ..
కిందపడిన వృద్ధునిపై నుంచి వెళ్లిన ఆర్టీసీ బస్సు
ఒకరు మృతి, 13 మందికి తీవ్ర గాయాలు
బాగేపల్లి వద్ద దుర్ఘటన


