పేదల భోజ్యం.. దళారుల రాజ్యం
సాక్షి బళ్లారి: పేదల కడుపు నింపాలని ఉచితంగా అందిస్తున్న రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నాయి. ఉమ్మడి బళ్లారి జిల్లాలోనే కాకుండా ఉత్తర కర్ణాటకలోని బళ్లారి, రాయచూరు, కొప్పళ, కలబుర్గి, బీదర్, యాదగిరి, విజయపుర తదితర జిల్లాల్లో రేషన్ షాపులకు ప్రతినెల సరఫరా చేస్తున్న ఉచితం బియ్యం కార్డు దారుల నుంచి తక్కువ ధరకే కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న వైనం పరిపాటిగా మారింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో ప్రతి బీపీఎల్ రేషన్ కార్డుదారుకు ఉచితంగా బియ్యంను అందిస్తున్న నేపథ్యంలో ఆ బియ్యాన్ని డీలర్లు, దళారులు రంగప్రవేశం చేసి కార్డు దారుల నుంచి రూ.10లకే బియ్యాన్ని కొనుగోలు చేసి వాటిని పాలిష్ చేసి సోనామసూరి సన్న బియ్యం తరహాలో మార్చి కంపెనీ పేర్లు పెట్టి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్న దృశ్యాలు ఎక్కడో ఒక చోట దర్శనమిస్తుండటంతో పోలీసులు సంబంధిత అధికారులతో కలిసి వల పన్ని పట్టుకొంటున్నారు.
400 క్వింటాళ్ల బియ్యం పట్టివేత
మంగళవారం ఉదయం బళ్లారి తాలూకాలోని బైపాస్ మార్గంలో ఎంహెచ్–26–బీ–9758 అనే నంబరుగల లారీలో కొప్పళ– హొసపేటె మార్గంలో బళ్లారి బైపాస్ వైపునకు తీసుకొస్తున్న దాదాపు 400 క్వింటాళ్ల బియ్యాన్ని పోలీసులు, పౌరసరఫరాల శాఖాధికారులు పట్టుకుని లారీతో సహా స్వాధీనం చేసుకొన్నారు. కొప్పళ– హొసపేటె మార్గం గుండా ఆంధ్రాకు తరలిస్తున్న బియ్యాన్ని స్వాధీనం చేసుకొని లారీ డ్రైవర్‌ను, బియ్యం తరలిస్తున్న వారిని పోలీసులు అరెస్టు చేసి విచారణ చేస్తున్నారు. ఇలా ఈ ప్రాంతంలో ఏదో ఒక చోట రేషన్ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తక్కువ ధరకే బియ్యాన్ని తీసుకొని మెరుగులు దిద్ది ఎగుమతులు చేస్తున్న సంఘటనలు యాదగిరి జిల్లాలో పెద్ద ఎత్తున వెలుగులోకి రావడంతో అసెంబ్లీ కూడా పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే.
రేషన్ డీలర్ల కుమ్మక్కుతోనే..
పేదల కడుపు నింపే బియ్యాన్ని కార్డుదారులతో పాటు రేషన్ డీలర్లు వ్యాపారులకు అమ్మడానికి తోడ్పాటును అందిస్తుండటంతో ఈ అక్రమ రవాణా బియ్యం యథేచ్ఛగా కొనసాగుతుండటంతో ప్రభుత్వ లక్ష్యం పేదలకు చేరాలన్న సంకల్పం గాల్లో కలిసిపోతోంది. కార్డు దారులు కూడా నూటికి 50 శాతం పైగా వ్యాపారులకు అమ్ముతున్నారనే ఆరోపణలున్నాయి. లక్షలాది కేజీల మేర బియ్యాన్ని పేదలకు ఉచితంగా అందజేస్తే వాటిలో సగం కూడా పేదల వద్దకు చేరకపోగా అక్రమంగా తరలించేందుకు రేషన్ బియ్యం వ్యాపారులకు, చేతినిండా పని కల్గిస్తూ అక్రమ సంపాదనకు రేషన్ బియ్యం వ్యాపారం దోహదం చేస్తోందని చెప్పవచ్చు.
అక్రమంగా తరలిస్తున్న చౌక బియ్యంను పట్టుకొన్న పోలీసులు
చౌక బియ్యంను తరలిస్తుండగా పోలీసులకు పట్టుబడిన లారీ
భారీగా రేషన్ బియ్యం అక్రమ రవాణా, అమ్మకాలు
కార్డు దారుల నుంచి తక్కువ ధరకే బియ్యం కొనుగోలు
బియ్యాన్ని పాలిష్ చేసి అధిక ధరకు అమ్ముతున్న వైనం
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో
పట్టుబడుతున్న చౌక బియ్యం
పేదల భోజ్యం.. దళారుల రాజ్యం


