మది నిండా.. బృహత్ జాతీయ జెండా
పతాకం ముందు
సీఎం, డీసీఎం
బనశంకరి: బెళగావిలో సువర్ణసౌధ పశ్చిమ ద్వారం వద్ద మంగళవారం అతి పెద్ద జాతీయ పతాకాన్ని సీఎం సిద్దరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ప్రారంభించారు. స్వరాజ్య ఉద్యమంలో జాతిపిత మహాత్మా గాంధీ బెళగావిలో కాంగ్రెస్ సమావేశాలకు అధ్యక్షత వహించిన జ్ఞాపకార్థం దీనిని ఆవిష్కరించారు. 75 అడుగుల పొడవు, 55 అడుగుల వెడల్పుతో ఉంది. జెండా నిర్మాణానికి శ్రమించిన కలబుర్గివాసి వినోద్‌కుమార్ రేవప్ప బొమ్మణ్ణను సీఎం సన్మానించారు. ఇది ఖాదీ వస్త్రం కాదని, దేశానికి గర్వకారణమన్నారు. జాతీయ జెండా మనందరికీ గర్వకారణం, స్వాభిమానానికి సంకేతమన్నారు. డీకే శివకుమార్ మాట్లాడుతూ స్పీకర్ యుటీ.ఖాదర్ చొరవతో వందేళ్ల చరిత్ర ను కాపాడేందుకు ఈ జాతీయ పతాకాన్ని రూపొందించారని తెలిపారు. దేశంలోని అందరి ఇళ్లుపై జాతీయ పతాకం ఎగరాలి, గుండెల్లో దేశభక్తి భావన ఉండాలని పిలుపునిచ్చారు. కిత్తూరు ఖాదీ కేంద్రం గరగలో మహిళా కార్మికులు ఈ జెండాను తీర్చిదిద్దారని తెలిపారు. ఇక్కడ శాసనసభ సమావేశాలు నిర్వహించే ప్రతిసారీ జాతీయ పతాకాన్ని ప్రదర్శించాలని నిర్ణయించారు. ప్రపంచంలో అతి పెద్ద జాతీయ పతాకాల్లో ఇది రెండవదని చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు జరిగినన్ని రోజులు జెండాను ఇలాగే ప్రదర్శిస్తారని తెలిసింది.
బెళగావి అసెంబ్లీ ముందు ఆవిష్కారం


