4 ఏళ్లలో 52 వేల సైబర్ నేరాలు
బనశంకరి: ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆన్‌లైన్ నేరగాళ్లు ప్రజలను దోచుకుంటున్నారు. లక్షల రూపాయలను జనం నష్టపోతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, పోలీస్‌శాఖ చేపట్టిన కఠినచర్యలతో రాష్ట్రంలో సైబర్‌నేరాలు తగ్గుముఖం పట్టాయని హోంశాఖమంత్రి జీ.పరమేశ్వర్ చెప్పారు. బెళగావి సువర్ణసౌధ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో బీజేపీ సభ్యుల ప్రశ్నకు సమాధానమిచ్చారు. గత నాలుగేళ్లలో కర్ణాటకలో 52 వేల సైబర్ నేరాలు నమోదయ్యాయి. సైబర్ నేరాల నియంత్రణకు చట్టం మార్చాము, కానీ ఇండియా గేమింగ్ ఫెడరేషన్ ఈ చట్టం మీద స్టే తీసుకువచ్చింది. ప్రస్తుతం సుప్రీం కోర్టులో కేసు విచారణలో ఉంది అని చెప్పారు. బీజేపీ ఎమ్మెల్యే సిమెంట్ మంజు మాట్లాడుతూ ఆన్‌లైన్ గేమ్‌లకు, జూదాలకు యువకులు బలి అవుతున్నారని, దీనికి అడ్డుకట్ట పడడం లేదన్నారు. నిందితులను అరెస్ట్ చేయడం లేదని, కర్ణాటకలో ఎక్కువ కేసులు నమోదవుతున్నాయని తెలిపారు. సైబర్ మోసాల బాధితులు కేంద్ర ప్రభుత్వ సహాయవాణి కి ఫిర్యాదు చేసేలోగా నగదు కోల్పోతున్నారని, దీనిని అడ్డుకోవాలని కోరారు.
గతేడాది 28 వేల కేసులు
2023లో 22,250 సైబర్ వంచన కేసులు నమోదు కాగా, 6,159 కేసుల ఆచూకీని పోలీసులు కనిపెట్టారని హోంమంత్రి తెలిపారు. సుమారు రూ.880 కోట్లు దోచేయగా ఇందులో రూ.177 కోట్లు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.
2024లో 28,478 కేసులు నమోదుకాగా, ఇందులో రూ. 2,562 కోట్లు వంచనకు గురికాగా, ఇందులో రూ.323 కోట్లు స్వాధీనం చేసుకున్నారు.
2025లో 13 వేల కేసులు రాగా, రూ.2,038 కోట్లు సైబర్‌కేటుగాళ్లు దోచేశారు. ఇందులో రూ.127 కోట్లు రికవరీ చేసుకున్నారని తెలిపారు.
సైబర్ నేరాల సంఖ్య తగ్గిందని, నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
ఈ ఏడాది 13 వేల కేసులు,
రూ. 2వేల కోట్లకు పైగా లూటీ
అసెంబ్లీలో హోంమంత్రి పరమేశ్వర్


