ఆవు చేలో మేస్తే... దూడ గట్టున మేస్తుందా? అని సామెత. తెలంగాణలో పంచాయతీ ఎన్నికల వార్తలు ఈ సామెతనే గుర్తు చేస్తున్నాయి. ప్రజాపాలన ఉత్సవాలు, వివిధ కార్యక్రమాల సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లు ‘‘హాఫ్‌కు’’ ‘‘ఫుల్‌కు’’ ఓటేయవద్దని చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది. డబ్బు, మద్యం వంటి ప్రలోభాలకు లొంగవద్దని సీఎం స్వయంగా చెప్పడం ఆహ్వానించదగ్గది. అన్ని పార్టీలవారు వీటిని పాటించడం అవసరం. కాని అలాంటి మాటలు చెప్పడానికి ముందు పాటించి చూపడమూ ముఖ్యమే. శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ తదితర పార్టీలు ఎంత విచ్చలవిడిగా డబ్బు ఖర్చు చేస్తున్నదీ మద్యం ఎలా పారుతోంది? అందరికీ తెలిసిన విషయమే.
ఈ సంగతులన్నీ ప్రజలకు తెలియవా? ఈ మధ్యనే జరిగిన జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలోనూ కాంగ్రెస్, ఒక్కో ఓటుకు రూ.2500 నుంచి రూ.నాలుగైదు వేల వరకు పంపిణీ చేసినట్లు ఆరోపణలున్నాయి. బీఆర్‌ఎస్ ఓటుకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. వారీ స్థాయిలో కాకపోయినా బిజెపి కూడా బాగానే ఖర్చు చేసింది కదా! రేవంత్, మంత్రులు ఆకాశమే హద్దుగా హామీలు ఇచ్చారు కదా!
ఇన్ని చేసినవారు సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికలలో మద్యం, డబ్బు పంచవద్దని చెబితే జనానికి పడతాయా? అయినా సీఎం హితబోధ చేయడాన్ని తప్పు పట్టనక్కర్లేదు. రేవంత్ మరో మాట కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన చేస్తోందని, మంచి ప్రభుత్వం కనుక ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు వచ్చాయని, మరో మూడేళ్లు ఈ ప్రభుత్వానికి సహకరించే సర్పంచ్‌లు ఎన్నికైతే మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయని ఆయన అభిప్రాయపడ్డారు. మంత్రులు,ఎమ్మెల్యేలతో కలిసి పనిచేసే వారిని ఎన్నుకోవాలని, కిరికిరిగాళ్లను వద్దని కోరారు.
పంచాయతీ ఎన్నికలు పేరుకే రాజకీయేతరంగా జరుగుతున్నాయి. ముఖ్యమంత్రి తన స్పీచ్‌లలో ఎవరినైనా రాజకీయాలకు అతీతంగా మంచివారిని ఎన్నుకోండని చెబితే బాగుండేది. అలా కాకుండా తమ మద్దతుదారులనే ఎన్నుకోవాలని పరోక్షంగా ప్రచారం చేసినట్లు అనిపిస్తుంది. వేరే పార్టీ మద్దతుదారులను సర్పంచ్‌లుగా ఎన్నుకుంటే నిధులు రావని, పనులు జరగవని బెదిరిస్తున్నట్లు అనిపించదూ! వర్తమాన రాజకీయాలలో దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఇదే ధోరణితో ఉంటున్నాయన్నది కూడా వాస్తవమే. రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీవారినే ఉప ఎన్నికలలో, జెడ్పీ, మండల, పంచాయతీ ఎన్నికలలో గెలించాలని, లేకుంటే అభివృద్ది ఆగిపోతుందని ప్రచారం చేయడం ప్రజాస్వామ్యంలో ఒక బలహీనతగా కనిపిస్తుంది. ఇదే ధోరణితో కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ రాష్ట్రాలలో ప్రచారం చేస్తుంటుంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల పర్వంలో డబ్బు, మద్యం,తదితర ప్రలోభాలు యథావిధిగా సాగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. వేలంపాటల ద్వారా సర్పంచులను ఎన్నుకుంటున్నారు.
కొన్ని గ్రామాలలో మాత్రం పార్టీలకు అతీతంగా ఏకగ్రీవంగా ఎన్నుకుంటున్నారు. కాని అత్యధిక పంచాయతీలలో ఈ పరిస్థితి లేదు. అదేమీ తప్పు కాదు. పంచాయతీలలో ఎన్నికులు జరగవచ్చు. కాని అవి పద్దతిగా జరిగితే ప్రజాస్వామ్యం బలపడుతుంది. మంత్రులు,ఎమ్మెల్యేల సొంత గ్రామాలలో ఎలాగైనా ఏకగ్రీవాలు జరగాలని తంటాలు పడుతున్నారట. కొన్ని పంచాయతీలలో అభ్యర్థులు ఇస్తున్న హామీలు రాష్ట్ర స్థాయి పార్టీలు, నేతలను ఆదర్శంగా తీసుకున్నట్లు అనిపిస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ నేతలు కొందరు హామీలపై బాండ్లు రాసిచ్చారు.దానిని ఆయా చోట్ల పంచాయతీ సర్పంచ్ అభ్యర్థులు పాటిస్తున్నారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని ఒక గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్ధి ఇంటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. గ్రామంలో మినరల్ వాటర్ సదుపాయం కల్పిస్తామని, ఎవరైనా చనిపోతే ఆ కుటుంబానికి పదివేలు, పెళ్లి జరిగితే ఆడబిడ్డకు ఐదువేల రూపాయలు ఇస్తామని చెబుతున్నారట.
కొన్ని గ్రామాలలో అసెంబ్లీ ఎన్నికలను మించి ఖర్చు చేస్తున్నారట. రియల్ ఎస్టేట్ వ్యాపారం బాగా సాగే సంగారెడ్డి, పటాన్ చెరు నియోజకవర్గాలలో ఎన్నికలు జాతరను తలపిస్తున్నాయి. చిన్న పంచాయతీలలో పది నుంచి ఇరవై లక్షల వరకు ఖర్చు చేయడానికి సిద్దమవుతున్నారు.కాస్త పెద్ద పంచాయతీలలో కోట్లు వ్యయం చేయడానికి వెనుకాడబోమని చెబుతున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యేందుకు పోటీదారులకు రూ.15 నుంచి రూ.35 లక్షల వరకు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సమాచారం.
రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం కొత్తపేట అనే గ్రామంలో సర్పంచ్‌గా తనను గెలిపిస్తే ప్రతి ఇంటికి ఐదు లక్షల బీమా సదుపాయం కల్పిస్తానని ఒక అభ్యర్ధి హామీ ఇస్తూ ప్రచారం చేస్తున్నారు. ఆ గ్రామంలో 700 ఇళ్లు ఉన్నాయి. ఇందుకోసం ఏడాదికి సుమారు ఎనిమిది లక్షల చొప్పున ఐదేళ్లకు నలభై లక్షలు వ్యయం చేస్తానని హామీ ఇచ్చారన్నమాట. ఆడబిడ్డ పుడితే బంగారు తల్లి పథకం పేరుతో రూ.ఐదు వేలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని, ఆడపిల్లలకు మెట్టెలు, పెళ్లికొడుక్కి రూ.5116 ఇస్తామంటున్నారట. ఇల్లు కట్టుకుంటే స్లాబ్ వేసుకున్నప్పుడు రూ.21 వేలు ఇస్తామని కూడా హామీ ఇస్తున్నారట. మరి కొన్ని గ్రామాలలో విద్యార్ధులకు ఉచిత బ్యాగ్‌లు, బూట్లు, ఉన్నత విద్యకు ఆర్థికసాయం, సీసీ కెమెరాలు మొదలైనవి సమకూర్చుతామని హామీ ఇస్తున్నారు.
గద్వాల జిల్లా సల్కావరం గ్రామంలో ఒక అభ్యర్ధి 22 హామీలతో బాండ్ పేపర్ పై రాసిచ్చారట.ఇవన్ని అచ్చంగా అసెంబ్లీ ఎన్నికలలో మాదిరిగా అసాధ్యమైన హామీల్లానే ఉన్నాయి. ఇక ఒకే కుటుంబానికి చెందిన వారు పోటీ పడుతున్న ఘటనలు జరిగాయి. బలవంతంగా విత్ డ్రా చేసుకోమంటున్నారని ఒక అభ్యర్ధి ఆత్మహత్యకు పాల్పడ్డారట. నిధులు అంతంత మాత్రంగా ఉండే పంచాయతీ ఎన్నికలలో ఈ పరిస్థితి ఎందుకు ఉందో ఊహించుకోవచ్చు. శాసనసభ, లోక్ సభ ఎన్నికలలో ఎలాగైతే రాజకీయ పార్టీలు అడ్డగోలుగా ఖర్చు చేస్తున్నాయో,అదే రీతిలో పంచాయతీ ఎన్నికలు సాగుతున్నాయని అనుకోవాలి. అధికారంలోకి వచ్చాక, హామీలు అమలు చేసినా,చేయకపోయినా ఏమీ కాదులే అని రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన నేతలు వ్యవహరిస్తుంటారు.దానినే గ్రామాలలో అభ్యర్ధులు క్లూగా తీసుకుంటున్నట్లు అనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ‘‘హాఫ్‌కు’’, ‘‘ఫుల్‌కు’’ ఓటు వేయవద్దని రేవంత్ రెడ్డి చెబితే ఎవరైనా వింటారా? సుద్దులు చెప్పడం కాకుండా నిబంధనలను పటిష్టంగా అమలు చేసినప్పుడు, రాష్ట్ర స్థాయి నేతలు ముందుగా తాము పాటించి చూపితే ప్రజలలో విశ్వసనీయత వస్తుంది .లేకపోతే అవన్ని ఊకదంపుడు ఉపన్యాసాలుగానే మిగిలిపోతాయి అని చెప్పక తప్పదు.
- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత.


