అనంతపురం మరోసారి టీడీపీ కుట్ర రాజకీయాలకు తెరలేపింది. జిల్లాలోని కళ్యాణదుర్గం మున్సిపల్ చైర్మన్ పదవి కోసం వైఎస్సార్‌సీపీ నేతలను టీడీపీ ప్రలోభాలకు గురిచేస్తోంది. వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లకు టీడీపీ నేతలు ఫోన్లు చేసి డబ్బు ఆశ చూపుతున్నారు. ‘ మీకు ఎంతైనా ఇస్తాం.. మాకు ఓటయ్యండి’ అంటూ ప్రలోభాలకు పాల్పడుతున్నారు పలువురు టీడీపీ నేతలు.
డబ్బు ఎంతైనా ఇస్తామంటూ ఫోన్‌లో ఓ టీడీపీ నేత మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. ప్రలోభాలకు గురిచేస్తున్న కూటమికి చెందిన సోమశేఖర్ ఆడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. రేపు(డిసెంబర్ 11వ తేదీ) కళ్యాణదుర్గం మున్సిపల చైర్మన్ ఎన్నిక జరుగనున్నతరుణంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లను టీడీపీ ప్రలోభ పెడుతోంది.
గతంలో పలు సందర్భాల్లో టీడీపీ ఈ తరహా చర్యలకు పాల్పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ తరహా చర్యలపై రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు ఎదుర్కొన్న కూటమి నేతలు.. తమ వైఖరిని మాత్రం మార్చుకోవడం లేదని విశ్లేషకులు విమర్శిస్తున్నారు.
కాగా, మున్సిపల్ చైర్మన్ ఎన్నిక నేపథ్యంలో బుధవారం(డిసెంబర్ 10వ తేదీ) నుంచి కళ్యాణదుర్గంలో 144 సెక్షన్ అమలులో ఉంటుందని ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి వసంతబాబు అన్నారు. గురువారం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరగనుంది. మంగళవారం డీఎస్పీ రవిబాబు, మున్సిపల్ కమిషనర్ వంశీకృష్ణ భార్గవ్‌తో కలిసి ఆర్డీఓ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణదుర్గం మున్సిపాలిటీలో మొత్తం 24 వార్డు కౌన్సిలర్లతో పాటు ఎమ్మెల్యే, ఎంపీలకు ఎక్స్ అఫిషియో సభ్యులుగా ఓటు హక్కు ఉందన్నారు. చైర్మన్ ఎన్నికకు ఓటు హక్కు కలిగిన వారు తమ గుర్తింపు కార్డుతో హాజరుకావాలన్నారు. మున్సిపల్ కార్యాలయానికి 200 మీటర్ల దూరంలోనే సెక్యూరిటీ జోన్‌గా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎన్నిక నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు జరగ కుండా గట్టి బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. చైర్మన్ ఎన్నికకు రాజకీయ పార్టీలు సహకరించాలని కోరారు.


