రాష్ట్రంలో ‘రెడ్‌బుక్’ పాలన
● వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్
కళ్యాణదుర్గం రూరల్: రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగ పాలన సాగుతోందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గోరంట్ల మాధవ్ మండిపడ్డారు. మంగళవారం కళ్యాణదుర్గం వచ్చిన ఆయన స్థానిక పోలీసులతో మాట్లాడారు. అనంతరం ‘సాక్షి’తో మాట్లాడుతూ... బ్రహ్మసముద్రం మండలాకి చెందిన బోయ ఆనంద్‌ది ఆత్మహత్య కాదని హత్యగా కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారని తెలిపారు. ఈ అంశంలో వాస్తవాలు వెలుగు చూడాలంటే పారదర్శక దర్యాప్తు అవసరమని మీడియా సమావేశంలో కళ్యాణదుర్గం నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త తలారి రంగయ్య చేసిన వ్యాఖ్యలపై పోలీసులు నోటీసులు జారీ చేయడాన్ని ఆక్షేపించారు. అధికార పార్టీ నేతల తప్పులను నిలదీయడం ప్రతిపక్ష నేతగా, మాజీ ఎంపీగా తలారి రంగయ్య బాధ్యత అనే విషయాన్ని పోలీసులు గుర్తించాలన్నారు. ఎమ్మెల్యే సురేంద్రబాబుకు తొత్తుగా మారి ఏకపక్షంగా వ్యవహరించడం సరికాదని పేర్కొన్నారు.
గోరంట్ల మాధవ్‌కు నోటీసులు
అనంతపురం: వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపుతప్పినా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదని గతంలో ఓ మీడియా సమావేశంలో గోరంట్ల మాధవ్ అన్నారు. దీనిపై అప్పట్లో పోలీసులకు వాసిరెడ్డి పద్మ ఫిర్యాదు చేశారు. మీడియాలో మాట్లాడిన వ్యాఖ్యలపై ఇప్పటికే గోరంట్ల మాధవ్ వివరణ ఇచ్చారు. తాజాగా మంగళవారం విజయవాడ నుంచి వచ్చిన పోలీసులు అనంతపురంలోని గోరంట్ల మాధవ్ ఇంటికి చేరుకుని మళ్లీ నోటీసులు అందించారు. ఈ నెల 18న విచారణకు హాజరుకావాలని అందులో పేర్కొన్నారు.
నీట మునిగి వ్యక్తి మృతి
బుక్కరాయసముద్రం: మండల పరిధిలోని అనంత సాగర్ కాలనీకి చెందిన జబీవుల్లా (40) మంగళవారం బీకేఎస్ చెరువులో చేపలు పడుతూ ప్రమాదవశాత్తు నీట మునిగి మృతి చెందాడు. గమనించిన స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చేపట్టి జబీవుల్లా మృతదేహాన్ని వెలికి తీశారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
రాష్ట్రంలో ‘రెడ్‌బుక్’ పాలన


