చీకటి జీఓపై మూకుమ్మడిగా కన్నెర్ర
అనంతపురం సిటీ: విద్యార్థుల సమస్యలు తెలుసుకునేందుకు పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తలకు ప్రవేశం లేకుండా చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం జారీ చేసిన జీఓపై విద్యార్థి సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. విద్యార్థుల హక్కులు కాలరాచేలా ప్రభుత్వం విడుదల చేసిన చీకటి జీఓను తక్షణం ఉపసంహరించుకోవాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యక్ష పోరాటానికి దిగుతామని ముక్తకంఠంతో ప్రకటించారు. అనంతపురంలోని అంబేడ్కర్ విగ్రహం ఎదుట విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో మంగళవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎఫ్‌ఐ, ఎన్‌ఎస్‌యూఐ, పీడీఎస్‌యూ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ విద్యార్థి సమాఖ్య, వీఎన్‌ఐవీ, పీఎస్‌ఎఫ్, ఏపీ బీసీ విద్యార్థి సంఘం, ఏఐఎస్‌పీ, ఏఐఎస్‌ఓ ఐక్య సంఘాల ప్రతినిధులు మాట్లాడారు. విద్యార్థుల సమ స్యలు వెలుగు చూడకుండా ఉండేందుకే ప్రభుత్వం చీకటి జీఓలు జారీ చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థి సంఘాలపై నిషేధం విధించడమంటే ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కడమేనని, ఈ కుట్రకు చంద్రబాబు ప్రభుత్వం తెరలేపిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు కుళ్లాయిస్వామి, నరేష్, గిరి, వీరేంద్ర ప్రసాద్, వేమన, సురేష్, రామన్న, అబ్దుల్ ఆలం, కేశవకుమార్, నరసింహ, అనిల్‌కుమార్, హనుమంత రాయుడు, ఓబులేసు, వినోద్, భీమేష్, ప్రతిభా భారతి, చరణ్, చందు, మంజు, ఉమామహేష్ పాల్గొన్నారు.
పాఠశాలల్లో విద్యార్థి సంఘాలు, ఇతర రాజకీయ పార్టీల నేతలు ప్రవేశించకుండా జీఓ జారీ చేయడంపై మండిపాటు
అనంతలో విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో అంబేడ్కర్ విగ్రహం ఎదుట ఆందోళన


