అనంతలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు
అనంతపురం కల్చరల్: ఈ నెల 12, 13, 14 తేదీలలో అనంతపురంలోని పీవీకేకే ఇంజినీరింగ్ కళాశాల వేదికగా రాష్ట్ర స్థాయి యోగా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యోగాసనా అసోసియేషన్ అధ్యక్షుడు రాజశేఖరరెడ్డి తెలిపారు. ఇందుకు సంబంధించిన కరపత్రాలు, బ్రోచర్లను మంగళవారం వివేకానంద యోగభవన్‌లో ఆయన ఆవిష్కరించి, మాట్లాడారు. మినిస్ట్రీ ఆఫ్ యూత్ వెల్ఫేర్ విభాగంలో యోగాకు గుర్తింపు దక్కడంతో రాష్ట్ర స్థాయి విజేతలను ఈ నెల 28 నుంచి జనవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలోని నాసిక్ వద్ద సంగమేశ్వరంలో జరిగే జాతీయ స్థాయి చాంపియన్‌షిప్ పోటీలకు పంపనున్నట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో విజేతలు నేరుగా ఆసియన్ గేమ్స్‌లో దేశం తరఫున ప్రాతినిథ్యం వహిస్తారన్నారు. కార్యక్రమంలో యోగాసన అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముత్యాలరెడ్డి, కేవీ రమణ, యోగా గురువులు దివాకర్, ఆంజనేయులు, మారుతీప్రసాద్, మహేష్, మల్లికార్జున పాల్గొన్నారు.
కేంద్ర సహకార మంత్రిత్వ శాఖ హిందీ సలహాదారుగా గైబువలి
అనంతపురం సిటీ: కేంద్ర సహకార మంత్రిత్వ శాఖకు హిందీ సలహాదారుగా హిందీ సేవాసదన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి, హిందీ ప్రచార సభ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ ఎస్.గైబువలి మంగళవారం తెలిపారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ విడుదల చేసినట్లు వివరించారు. తనకు లభించిన ఈ అవకాశంతో భవిష్యత్‌లో హిందీ భాషాభివృద్ధికి మరింత పట్టుదలతో పని చేస్తానని వెల్లడించారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
గుంతకల్లు రూరల్: మండలంలోని వెంకటాంపల్లి శివారున పొలాల్లో పేకాట ఆడుతున్న 20 మందిని అనంతపురం స్పెషల్‌పార్టీ, గుంతకల్లు రూరల్ పోలీసులు మంగళవారం మధ్యాహ్నం అరెస్ట్ చేశారు. ఈ మేరకు డీఎస్పీ శ్రీనివాస్, రూరల్ సీఐ ప్రవీణ్‌కుమార్ వెల్లడించారు. రూ.18,92,040 నగదు, 17 ద్విచక్ర వాహనాలు, ఓ కారు, 24 సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో గుంతకల్లు రూరల్ పీఎస్ ఎస్‌ఐ రాఘవేంద్రప్ప, కసాపురం పీఎస్ ఎస్‌ఐ టీపీ వెంకటస్వామి, పాల్గొన్నారు.
బొమ్మనహాళ్: మండలంలోని దర్గాహొన్నూరు గ్రామ శివారున పొలాల్లో మంగళవారం సాయంత్రం పేకాట ఆడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి, రూ.39,500 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు ఎస్‌ఐ నబీరసూల్ వెల్లడించారు. పోలీసుల రాకను గుర్తించి పారిపోయిన బోయ హనుమంతు, బోయ కడవలయ్య, మరేగౌడ, మల్లాపురం వెంకటేష్, గుండ్లపల్లి జానీ, మాల్యం అంజి, గోవిందవాడ బసప్పను త్వరలో అరెస్ట్ చేయనున్నట్లు పేర్కొన్నారు.
పోలీసుల అదుపులో మోసకారి దళారీ
బెళుగుప్ప: మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులతో అనామతు కింద పప్పుశనగ, ధనియాలు తదితర పంట దిగుబడులను తీసుకెళ్లి... రూ.కోట్లలో నగదు చెల్లించకుండా ముఖం చాటేసిన మోసకారి దళారీని బెళుగుప్ప పోలీసులు మంగళవారం కర్ణాటక ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నారు. ఈ సమాచారంతో మోసపోయిన స్థానిక మండల రైతులతో పాటు ఇతర మండలాల రైతులు, ధాన్యం వ్యాపారులు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకుని న్యాయం చేయాలని ఎస్‌ఐ శివను కోరారు.
సోలార్ ప్లాంట్‌లో
వలస కార్మికుడి మృతి
గుత్తి రూరల్: మండలంలోని బేతాపల్లిలో నూతనంగా ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న పశ్చిమ బెంగాల్‌కు చెందిన రబీవుల్లా (62) మంగళవారం మృతి చెందాడు. సోమవారం రాత్రి విధులు ముగించుకుని తన గదికి వెళ్లి పడుకున్నాడు. మంగళవారం ఉదయం ఎంతకూ నిద్రలేవకపోవడంతో గదిలో ఉన్న వారు అనుమానంతో పరిశీలించారు. అచేతనంగా ఉండడంతో వెంటనే అంబులెన్స్ ద్వారా గుత్తిలోని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
‘వాటర్ ప్లాంట్లకు కేటగిరి– 3 కనెక్షన్ ఇవ్వండి’
అనంతపురం టౌన్: వాటర్ ప్లాంట్లకు కేటగిరి– 3 కింద విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆ శాఖ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌కు పలువురు ఫిర్యాదు చేశారు. మంగళవారం డయల్ యువర్ ఎస్‌ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా 15 ఫిర్యాదు అందాయి. ఇందులో ముగ్గురు వాటర్ ప్లాంట్లకు కేటగిరి– 3 కింద కనెక్షన్లు ఇవ్వాలని విన్నవించారు. కంబదూరు మండలంలో ఓవర్ లోడ్ సమస్యతో తరచూ ట్రాన్స్‌ఫార్మర్ వద్ద ఫ్యూజులు పోవడంతో విద్యుత్ అంతరాయం కలుగుతోందని మరికొందరు ఫిర్యాదు చేశారు.
అనంతలో రాష్ట్ర స్థాయి యోగా పోటీలు


