లక్ష మంది కూలీలకు ఉపాధి కట్‌ | - | Sakshi
Sakshi News home page

లక్ష మంది కూలీలకు ఉపాధి కట్‌

Dec 10 2025 8:00 AM | Updated on Dec 10 2025 8:00 AM

లక్ష మంది కూలీలకు ఉపాధి కట్‌

లక్ష మంది కూలీలకు ఉపాధి కట్‌

అనంతపురం టౌన్‌: ఉన్న చోటనే ఉపాధి కల్పిస్తూ వలసలు నివారించాలనే ఉద్దేశంతో కేంద్రప్రభుత్వం మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రవేశపెట్టింది. ప్రస్తుతం ఉపాధి హామీ కూలీల జాబ్‌కార్డులకు ఆధార్‌తో అనుసంధానించి, ఈ–కేవైసీ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అలా చేయించుకున్న వారికే పనులు కల్పించడం, బిల్లులు జమ చేయడం జరుగుతుంది. అయితే ఈ–కేవైసీ చేయించడంలో చంద్రబాబు ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. దీనికితోడు ఈ–కేవైసీ చేయించుకోలేదని 20 శాతం మేర కార్డులను తొలగించి, వారి ఉపాధికి గండి కొట్టడం విమర్శలకు తావిస్తోంది. మూడు నెలల కిందటి వరకు జిల్లా వ్యాప్తంగా 3.16 లక్షల జాబ్‌కార్డులు 5.38 లక్షల మంది కూలీలు ఉండేవారు. ప్రస్తుతం 4.37 లక్షల మంది కూలీలు మాత్రమే యాక్టివ్‌గా ఉన్నట్లు ఉపాధి హామీ అధికారుల గణంకాలు పేర్కొంటున్నాయి. అంటే మూడు నెలల కాలంలోనే 1.01లక్షల మంది జాబ్‌కార్డులను అధికార యంత్రాంగం తొలగించేసిందన్నమాట.

జాబ్‌కార్డుల తొలగింపునకు కుట్ర

చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉపాధి హామీ పథకంలో పని చేస్తున్న ఫీల్డ్‌ అసిస్టెంట్లను మార్చేసి, తమకు అనుకూలంగా ఉన్న వారిని నియమించింది. దీంతో గ్రామాల్లోని ఓ వర్గానికి చెందిన కూలీల జాబ్‌కార్డులను తొలగింపే లక్ష్యంగా కుట్ర పన్నింది. ఈ– కేవైసీ చేయడానికి వెళ్లిన సమయంలో కూలీలు అందుబాటులో లేరని, ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారని కారణాలు నమోదు చేశారు. ఇలా ప్రతి మండలంలోనూ 4వేల మంది దాకా కూలీల జాబ్‌కార్డులు తొలగించారంటే ఏ స్థాయిలో కుట్ర పన్నారో స్పష్టంగా అర్థమవుతుంది.

ఈ–కేవైసీ చేసేవారేరీ?

ఉపాధి కూలీలు జాబ్‌కార్డులకు ఈ– కేవైసీ ఫీల్డ్‌ అసిస్టెంట్ల ద్వారా చేయించుకోవాలి. అయితే సర్వర్‌ పని చేయలేదంటూ ఫీల్డ్‌ అసిస్టెంట్లు ప్రక్రియ పూర్తి చేయడం లేదు. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉపాధి హామీ పథకం ద్వారా 6,500ఎకరాల్లో డ్రై ల్యాండ్‌ హార్టికల్చర్‌ పథకం కింద పండ్ల మొక్కలను చాలామంది రైతులు సాగు చేసుకున్నారు. అలాంటి రైతుల జాబ్‌కార్డులకు సైతం ఈ– కేవైసీ చేయలేదు. పండ్ల మొక్కల రైతులకు ప్రతి నెలా మొక్కల సంరక్షణ కోసం వాటర్‌ బిల్లుతోపాటు ఎరువుల బిల్లులను ఖాతాల్లో జమ చేస్తారు. అయితే వీరికి కూడా గ్రామాల్లో ఈ–కేవైసీ చేయలేదు. దీంతో డ్రైల్యాండ్‌ హార్టికల్చర్‌ రైతులు, ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన కింద ఇళ్ల నిర్మాణ పనులు చేపడుతున్న లబ్ధిదారులతోపాటు మరి కొందరు ఉపాధి కూలీలు ఈ– కేవైసీ కోసం ఎంపీడీఓ కార్యాలయాలకు పరుగులు తీస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు అధికారిక లెక్కల ప్రకారం 4.37 లక్షల మంది కూలీలకు గాను 3.60 లక్షల మంది కూలీలు ఈ– కేవైసీ చేశారు. మూడు నెలలుగా కాలయాప చేయడంతో మిగిలిన 70 వేల మంది కూలీలకు ఈ– కేవైసీ చేయలేదు. మరి వీరిని కూడా ఈ కేవైసీ చేయించుకోలేదని జాబ్‌కార్డులో ఉంచుతారా? లేకుంటే అందుబాటులో లేరంటూ రెండు నెలల క్రితం తొలగించిన లక్షల మంది కూలీల జాబితాలోకే చేరుస్తారా అన్నది వేచి చూడాలి.

గ్రామీణ ప్రాంతాల్లో ఈ–కేవైసీకి ససేమిరా

కూలీలు అందుబాటులో లేరంటూ సాకుతో కత్తెర

జిల్లాలో లక్ష మంది కూలీల జాబ్‌కార్డుల తొలగింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement