సవాల్‌గా ‘సామర్థ్య’ సర్వే
అనంతపురం సిటీ: జిల్లాలోని 135 క్లస్టర్ల పరిధిలో చేపట్టిన ఎఫ్‌ఎల్‌ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ) బేస్‌లైన్ సర్వే నత్తనడకన సాగుతోంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తెలుగు, ఆంగ్లం, గణితం అంశాలకు సంబంధించి విద్యార్థి అభ్యసన సామర్థ్యాలను, ప్రస్తుత స్థాయిని అంచనా వేసే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. ఎస్‌సీఈఆర్‌టీ రూపొందించిన యాప్‌లో నమోదైన విద్యార్థుల పేర్లను ఎంపిక చేసుకోగానే సెల్‌ఫోన్ స్క్రీన్‌పై ప్రత్యక్షమయ్యే ప్రశ్నలను ఒక్కొక్కటిగా విద్యార్థికి చూపుతూ సమాధానాలను రాబట్టి యాప్‌లోనే పొందుపరచాలి. దీంతో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా సదరు విద్యార్థి ప్రగతి నివేదిక ఆ క్షణంలోనే నమోదైపోతుంది. పూర్తి స్థాయి డిజిటల్ విధానంలో చేపట్టిన ఈ సర్వే ఫలితాల ఆధారంగా త్వరలో ప్రారంభం కానున్న గ్యారంటీడ్ ఎఫ్‌ఎల్‌ఎన్ వంద రోజుల కార్యాచరణ ప్రణాళికను రూపొందించనున్నారు. జిల్లాలో మొత్తం 1,416 పాఠశాలల్లో 83,103 మంది విద్యార్థులను సర్వే చేయాల్సి ఉంది. ఇందులో 10,109 మంది విద్యార్థులను సర్వే చేయగా... ఇంకా 72,994 మంది విద్యార్థులను సర్వే చేయాల్సి ఉంది. ఇప్పటి వరకూ 810 పాఠశాలల్లో సర్వే ప్రక్రియ మొదలు కాలేదు. దీంతో నిర్దేశిత గడువులోపు సర్వే పూర్తి కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్యపరచండి
కూడేరు: పరిసరాల పరిశుభ్రతపై ప్రజలను చైతన్య పరచాలని సంబంధిత అధికారులను జెడ్పీ డిప్యూటీ సీఈఓ వెంకటసుబ్బయ్య ఆదేశించారు. కూడేరు మండలం అరవకూరులో మంగళవారం ఆయన పర్యటించారు. పలు వీధుల్లోని డ్రైనేజీలు చెత్తా చెదారంతో నిండి ఉండడం గమనించి, పంచాయతీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎప్పటికప్పుడు డ్రైనేజీలను శుభ్రం చేయించాలని కార్యదర్శికి సూచించారు. డ్రైనేజీల్లో చెత్తాచెదారం వేయకుండా ప్రజలను చైతన్య పరచాలన్నారు. ఇంటి వద్ద డస్ట్‌బిన్ పెట్టుకుని అందులో వేస్తే పారిశుధ్య కార్మికులు తీసుకెళతారని ప్రజలకు సూచించారు. కార్యక్రమంలో ఎంపీడీఓ కుళ్లాయిస్వామి, ఏపీఓ పోలేరయ్య, పంచాయతీ కార్యదర్శి హరినాథ్ పాల్గొన్నారు.


