చెరువులో దొరికే రబ్బరు మొక్కలతో శ్రీకాకుళం జిల్లాలో భలే వ్యాపారం
ఇసుక వాహనాలు నదుల్లో కూరుకుపోకుండా వాడుకుంటున్న వ్యాపారులు
జోరుగా కొనసాగుతున్న మొక్కల తీత
గార: అదో కలుపు మొక్క.. రబ్బరు మొక్కలని, కంపు మొక్కలని రైతులు పిలుచుకుంటూ ఉంటారు. చెరువులో విపరీతంగా పెరిగే ఈ మొక్కలతో ఎవరికీ ఎలాంటి ఉపయోగం లేదు. పైగా చేపలు పెంచేవారికి, రైతులకు దీని వల్ల ఇబ్బంది కూడా. కానీ ఇప్పుడు అదే మొక్కతో భలే వ్యాపారం సాగుతోంది. ఈ మొక్క శాస్త్రీయ నామం ‘ఐపోమియా కార్నియా’. ఉదయాన్నే పుషి్పంచే ఈ మొక్కను మారి్నంగ్ గ్లోరీ అని కూడా పిలుస్తారు. తేమ ఉన్న ప్రాంతాలు, నీరు ఉన్న చెరువులు, జలాశయాల్లో విరివిగా పెరుగుతుంది.
వంశధార, నాగావళి నదీ ప్రాంత సాగునీటి చెరువుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. చేపలు పెంచే వారితో పాటు ఉపాధి వేతనదారులు ఈ చెరువుల్లో పనులు చేయాలంటే ముందు వీటిని తొలగించాల్సి ఉంటుంది. వీటిని తొలగించేందుకు ఎలాంటి డబ్బులివ్వరు. కానీ ఈ మొక్కలను ఇటీవల కొందరు తెలివిగా ఉపయోగించుకుంటున్నారు.
రబ్బరు వంటి కాడలు ఉండటం వల్ల వీటిని పొలాల్లో ట్రాక్టర్లు దిగిపోయే సమయాలు, వరి కుప్పలు ఇంటికి తరలించే సమయాల్లో గతంలో వాడేవారు. ప్రస్తుతం ఆధునిక యంత్రాలు రావడంతో అవి బురదలో కూరుకుపోకుండా వీటి ని వాడుతున్నారు. ముఖ్యంగా నదుల నుంచి ఇసుకను తరలించేందుకు వీలుగా బాటలు వేస్తుంటారు. వీటిని ఇసుకపై వేసి మళ్లీ కొద్దిగా ఇసుక వేసి, మరోసారి ఈ రబ్బరు మొక్కలను బాటలు నిండా పరుస్తారు. 40 టన్నుల ఇసుక వాహనమైనా ఈ కంపు మొక్కలు వేసిన బాటలో దిగిపోకుండా సేఫ్‌గా నదిలోంచి ఒడ్డుకు ఉపయోగిస్తుంటారు.
మరీ ముఖ్యంగా ఇసుక వ్యాపారం చేస్తున్న వారికి ఇది చక్కగా ఉపకరిస్తోంది. ఎండిపోకుండా, రబ్బరులా సాగే గుణం ఉండటంతో ఇసుక వ్యాపారస్తులు వాడుతుంటారు. వీటిని జిల్లాలో ఎచ్చెర్ల మండలం వాసులు చెరువుల నీటిలో దిగి కోత కోసి వెంటనే లోడుల ద్వారా అమ్ముతున్నారు. ట్రాక్టర్ లోడు రూ.15 వేలు వరకు గిట్టుబాటు అవుతోందని చెబుతున్నారు.
కంపు మొక్కలతో చెరువులకు ఇబ్బందే
చెరువుల్లో కంపు మొక్కలు ఏడాదికేడాది పెరిగి మొత్తం నిండిపోతాయి. దీని వల్ల చెరువంతా కప్పేసినట్టు ఉంటుంది. ఆవు లేదా ఎద్దులు వెళితే పట్టుకోవడానికి ఇబ్బందే. అదేవిధంగా చేపలు పట్టేందుకు వెళ్లే వారికి అడ్డుగా ఉంటాయి. – శీర ఎర్రప్పడు, రైతు, వాడాడ
ఫోన్ ద్వారా ఆర్డర్
చెరువుల్లో నీటిలో ఉండే మొక్కలను కోసేందుకు మాత్రమే మనుషులను పెడతాను. ఎక్కువగా ఇసుక ర్యాంపు పాటదారులు జిల్లాలో ఎక్కడైనా నాకు ఫోన్ ద్వారా ఆర్డర్ పెడతారు. అక్కడికి వెళ్లి అమ్మేస్తుంటాను. – కూర్మారావు, మేస్త్రీ, ఎచ్చెర్ల మండలం


