సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలలను పప్పు బెల్లాలకు ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తారా?
రాష్ట్రానికి మెడికల్ సీట్లు, పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తారా?
కాలేజీల ప్రైవేటీకరణపై పల్లె నుంచి పట్నం వరకూ పెల్లుబుకుతున్న వ్యతిరేకత
కోటి సంతకాల సేకరణకు భారీ స్పందన
తమ బిడ్డల భవిష్యత్తు, వైద్య రంగాన్ని కాపాడుకునేందుకు అన్నివర్గాల పోరాటం
చంద్రబాబు కుట్రపూరిత విధానాలను నిరసిస్తూ ప్రజా ఉద్యమానికి పిలుపునిచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్
అక్టోబర్ 10న మొదలైన కోటి సంతకాల సేకరణ.. ఊరూవాడా ఉద్యమ వేడి
నవంబర్ 12న నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ ర్యాలీల్లో కదం తొక్కిన విద్యార్థులు, యువత
నేడు నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు, కోటి సంతకాల ప్రదర్శన
అనంతరం జిల్లా కేంద్రాలకు తరలింపు
13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి ర్యాలీగా కోటి సంతకాలు
17న కోటి సంతకాలను గవర్నర్‌కు అందజేయనున్న వైఎస్సార్‌సీపీ నేతలు
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వమే దళారీగా మారిపోయి వైద్య సేవలు, వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయడం.. విలువైన సంపదను ప్రైవేట్ వ్యక్తులకు దోచిపెడుతుండటంపై విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉద్యోగులు, మేధావులు, యువత ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి. అన్ని సదుపాయాలు, అనుమతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను సంతలో సరుకులు, పప్పు బెల్లాల మాదిరిగా చంద్రబాబు సర్కారు తెగనమ్మడంపై ప్రజా ఉద్యమం ఎగసిపడుతోంది.
రాష్ట్రవ్యాప్తంగా మారుమూల గిరిజన గూడేల నుంచి నియోజకవర్గ కేంద్రాల దాకా అన్ని ప్రాంతాలు, అన్ని వర్గాలు బాబు ప్రభుత్వ కక్షపూరిత విధానాలను తీవ్రంగా నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పిలుపు మేరకు స్వచ్ఛందంగా కోటి సంతకాల సేకరణలో భారీగా పాల్గొంటున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండలాలు, పంచాయతీల్లో కోటి సంతకాల సేకరణ చేపట్టారు. నవంబరు 12వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా 175 నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్‌సీపీ నిర్వహించిన ర్యాలీల్లో విద్యార్థులు, యువత, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడాన్ని నిరసిస్తూ కదం తొక్కారు. ఇది తమ బిడ్డల ఉజ్వల భవిష్యత్తు, ప్రభుత్వ వైద్య రంగాన్ని పరిరక్షించుకునేందుకు తలపెట్టిన ప్రజా ఉద్యమంగా పేర్కొంటున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రజా ప్రతినిధులు, నేతల వెంట స్వచ్ఛందంగా తరలి వచ్చి పెద్ద ఎత్తున సంతకాల సేకరణలో పాల్గొంటున్నారు. అక్టోబరు 10న ప్రారంభమైన కోటి సంతకాల సేకరణ గత రెండు నెలలుగా రచ్చబండ కార్యక్రమం ద్వారా ఉధృతంగా సాగింది. నియోజకవర్గాల వారీగా సేకరించిన సంతకాలను డిసెంబర్ 10వ తేదీకి జిల్లా కేంద్రాలకు తరలించేలా ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13 నాటికి జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాలను ర్యాలీగా తరలించనున్నారు. అనంతరం 17న కోటి సంతకాలను గవర్నర్‌కు అందించేందుకు పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు.
రగిలిన సీమ..
ప్రభుత్వ కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై రాయలసీమలో ఆగ్రహావేశాలు పెల్లుబికాయి. సీమలో సుమారు 32 లక్షల మేర సంతకాలను సేకరించారు. విద్యార్థులు, ఉద్యోగులు, రైతులు, న్యాయవాదులు.. ఇలా అన్ని వర్గాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. అనంతపురం లాంటి ప్రాంతాల్లో తాము టీడీపీకి ఓటు వేసినప్పటికీ.. కోటి సంతకాల సేకరణలో పాల్గొంటామని, ఇది భవిష్యత్ తరాల కోసం చేస్తున్న మంచి కార్యక్రమమని పేర్కొనడం గమనార్హం.
ఇక వర్సిటీల్లో కూడా విద్యార్థులు భారీగా సంతకాల సేకరణలో పాలుపంచుకున్నారు. అనంతపురం జిల్లాలో వైఎస్సార్‌సీపీ మేధావుల ఫోరం ఆధ్వర్యంలో 8 వేల సంతకాలు చేయించారు. పదవీ విరమణ చేసిన ప్రొఫెసర్లు, డాక్టర్లు, డిగ్రీ కళాశాలల అధ్యాపకులు ఇందులో భాగస్వాములు అయ్యారు. తాడిపత్రి నియోజకవర్గంలో టీడీపీ నేతలు దీన్ని అడుగడుగునా అడ్డుకునే యత్నం చేశారు. జేసీ వర్గీయులు దాడులకు తెగబడటంతో వైఎస్సార్‌సీపీ నేతలకు చెందిన రెండు వాహనాలు ధ్వంసమయ్యాయి. అయినప్పటికీ వెరవకుండా సంతకాల కార్యక్రమంలో ప్రజలు భారీగా భాగస్వాములు కావడం బాబు సర్కారు పట్ల వెల్లువెత్తుతున్న వ్యతిరేకతను చాటి చెబుతోంది.
ఉత్తరాంధ్రలో ఉవ్వెత్తున..
ఉత్తరాంధ్రలో ఆంగ్లేయుల కాలంలో నిర్మించిన కేజీహెచ్ మినహా పేదలకు ఇతర వైద్య సంస్థలు అందుబాటులో లేని పరిస్థితుల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి అరిలోవలో విమ్స్, శ్రీకాకుళంలో రిమ్స్ ఏర్పాటు చేశారు. విశాఖలోని అరిలోవ ప్రాంతంలో హాస్పిటల్స్ నెలకొల్పే ప్రైవేటు సంస్థలకు భూమి అందుబాటులో ఉంచుతూ హెల్త్ సిటీని ఏర్పాటు చేశారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్ అధికారంలో ఉండగా విజయనగరం, పాడేరులో కొత్త మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు. అక్కడ క్లాసులు కూడా ప్రారంభమయ్యాయి.
అనకాపల్లి జిల్లాలో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు చివరిదశకు చేరుకున్నాయి. పార్వతీపురం జిల్లాలో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయి. ప్రతి జిల్లాలో మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావడం ద్వారా వెనుకబడిన ఉత్తరాంధ్రలో వైద్య విప్లవం మొదలైందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తూ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయటాన్ని నిరసిస్తూ ఉవ్వెత్తున జనాగ్రహం పెల్లుబుకుతోంది. వెనుకబడిన ఉత్తరాంధ్రకు మెడికల్ విద్యతో పాటు వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ఉద్దేశించిన మెడికల్ కాలేజీల నిర్మాణాన్ని ప్రభుత్వం పక్కదారి పట్టించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఉత్తరాంధ్రలోని అన్ని జిల్లాల్లో 18.30 లక్షల మేర సంతకాల సేకరణను పూర్తి చేశారు. అల్లూరి, పార్వతీపురం లాంటి ఏజెన్సీ జిల్లాల్లోనూ ఊహకు మించి స్పందన వచ్చింది.
కోస్తాలో కన్నెర్ర..
నెల్లూరు నుంచి గోదావరి వరకు కోస్తా జిల్లాలు కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో కదంతొక్కాయి. సుమారు అరకోటి సంతకాల మేరకు కోస్తా జిల్లాల్లోనే సేకరించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులను అప్పగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించడంతో మన విద్యార్థులకు ఉచితంగా రావాలి్సన వైద్య సీట్లతోపాటు పేదలకు చేరువలో నాణ్యమైన ఉచిత వైద్య సేవలు దూరం కానున్నాయని అన్ని వర్గాల ప్రజలు మండిపడుతున్నారు.
కుప్పంలోనూ నిరసనలు..
కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పనంగా అప్పగించడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలోనూ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. చివరకు సీఎం సొంత నియోజకవర్గం కుప్పంలోనూ ప్రజలు తరలివచ్చి మరీ సంతకాల సేకరణ కార్యక్రమంలో గత రెండు నెలలుగా పాల్గొనడం గమనార్హం. తిరుపతి జిల్లాలో సుమారు 5 లక్షల మేర సంతకాలు సేకరించగా... చిత్తూరు జిల్లాలో 4.73 లక్షల మంది కోటి సంతకాల కార్యక్రమంలో పాలుపంచుకున్నారు. చంద్రగిరి నియోజకవర్గంలో 108 గ్రామ సచివాలయాలు ఉండగా ఒక్కో సచివాలయం పరిధిలో వెయ్యి మంది చొప్పున సంతకాల సేకరణ కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
జీవో ఏదంటూ టీడీపీ నేతలు నవ్వుల పాలు..!
గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. గత ప్రభుత్వంలోనే ఐదు కొత్త మెడికల్ కాలేజీల్లో తరగతులు కూడా మొదలయ్యాయి. పులివెందుల, పాడేరు కాలేజీలు ఎన్నికల నాటికే ప్రారంభానికి సిద్ధం కాగా మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. అయితే కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌కు అప్పగించాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించగానే.. అసలు మెడికల్ కాలేజీలు నిర్మాణమే జరగలేదంటూ టీడీపీ నేతలు పచ్చి అబద్ధాలతో దుష్ప్రచారానికి దిగారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఒక అడుగు ముందుకు వేసి... అసలు మెడికల్ కాలేజీల నిర్మాణానికి జీవో ఎక్కడ ఉంది? అంటూ ప్రశ్నించారు.
జీవో ఉంటే తనకు చూపించాలంటూ సవాల్ విసిరారు. దీంతో అక్టోబరు 10వ తేదీన మాజీ సీఎం వైఎస్ జగన్ స్వయంగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం భీమబోయినపాలెంలో నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజీల భవనాలను సందర్శించి జీవో కాపీని చూపించారు. దీంతో అయ్యన్నపాత్రుడు మిన్నకుండిపోయారు. మరోవైపు పెనుకొండలో మెడికల్ కాలేజీ ఎక్కడ ఉంది? అంటూ మంత్రి సవిత హడావుడి చేసి ఓ వీడియో విడుదల చేశారు. ఈ క్రమంలో మాజీ మంత్రి ఉషశ్రీ పెనుకొండలో దాదాపు నిర్మాణం పూర్తి కావచ్చిన భవంతులను మీడియాకు చూపించి మంత్రి సవిత అబద్ధాలను ఎండగట్టారు. ఇలా నిస్సిగ్గుగా అబద్ధాలాడి టీడీపీ ప్రజా ప్రతినిధులు అబాసుపాలయ్యారు.


