ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల గారడీ | YS Jagan Sensational Tweet on Chandrababu GSDP Cooked Up figures: Andhra pradesh | Sakshi
Sakshi News home page

ప్రజలను మోసం చేయడానికే బాబు అంకెల గారడీ

Dec 10 2025 5:32 AM | Updated on Dec 10 2025 7:12 AM

YS Jagan Sensational Tweet on Chandrababu GSDP Cooked Up figures: Andhra pradesh
  • వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ధ్వజం
  • 2025–26లో తొలి ఆర్నెల్లకు సంబంధించి చంద్రబాబు విడుదల చేసిన జీఎస్‌డీపీ ముందస్తు అంచనాలు తప్పులతడక
  • రాష్ట్ర జీఎస్‌డీపీ సీఏజీఆర్‌ 10.40 శాతంగా ఉన్నట్లయితే.. రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదు? కేవలం 2.58 శాతానికే ఎందుకు పరిమితమైంది?
  • కేంద్రం ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉన్నాయి
  • నువ్వు సీఎంగా ఉన్న 2014–19 మధ్య దేశ జీడీపీలో రాష్ట్ర వాటా 4.45% ఉంటే... అదే మా ప్రభుత్వ (2019–24) హయాంలో 4.78%
  • 2013–14, 2018–19 టీడీపీ పాలనలో తలసరి ఆదాయంలో రాష్ట్రం 18వ స్థానంలో ఉంటే... అదే మా ప్రభుత్వంలో రెండేళ్లు కోవిడ్‌ ఉన్నప్పటికీ 15వ స్థానానికి ఎగబాకాం
  • మీ పాలన బాగున్నట్లయితే తలసరి ఆదాయంలో రాష్ట్రం 18వ స్థానానికి ఎందుకు పరిమితమైంది?
  • ఇటీవలి కాగ్‌ గణాంకాల ప్రకారం రాష్ట్ర ఆదాయాల పెరుగుదల అతి దారుణంగా పడిపోయింది... 
  • చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో అప్పులు పెరిగాయి.. మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది
  • రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి
  • మీ విచ్చలవిడి అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండిపడింది
  • ఇప్పుడు చెప్పండి.. ఎవరి పాలన బాగుందో..?
  • కాగ్, ఎంవోఎస్‌పీఐ గణాంకాలతో సీఎం చంద్రబాబును కడిగిపారేస్తూ ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ పోస్టు

సాక్షి, అమరావతి: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025–26)లో తొలి ఆర్నెల్లకు సంబంధించి సీఎం చంద్రబాబు సోమవారం విడుదల చేసిన రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌డీపీ) ముందస్తు అంచనాలను తప్పులతడక అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అభివర్ణించారు. రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ... తన మార్గదర్శకత్వంలో ఆర్థికంగా వృద్ధి చెందుతోందని ప్రజలను మభ్యపెట్టడానికే ఈ అంకెలను తయారు­చేసినట్టుగా చంద్రబాబు చెప్పకనే చెప్పారంటూ దెప్పిపొడిచారు.

దేశ ఆర్థిక పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమానంగా ఉన్నాయని... ప్రపంచవ్యాప్తంగా ఏ దేశం­లోనైనా ఆదాయాలు, జీడీపీ పెరుగుదల సమా­నంగా ఉంటాయని గుర్తు చేశారు. ఈ నేప­థ్యంలో చంద్రబాబు చెబుతున్నట్లుగా రాష్ట్ర జీఎస్‌­డీపీ సీఏజీఆర్‌ (సగటు వార్షిక వృద్ధి రేటు) 10.40 శాతంగా ఉన్నట్లయితే... రాష్ట్ర సొంత పన్నుల ఆదాయం ఆ స్థాయిలో ఎందుకు పెరగలేదని, అది కేవలం 2.58 శాతానికే ఎందుకు పరిమితమైందని ప్రశ్నించారు.

‘కొందరిని కొంతకాలంపాటు మభ్యపెట్టగ­లవు... కొంతమందిని ఎల్లప్పుడూ మోసం చేయగ­లవు... కానీ, అందరినీ ఎల్లకాలం మభ్యపెట్ట­లేవు’ అంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు అబ్రహం లింకన్‌ చెప్పిన మాటలను గుర్తు చేస్తూ సీఎం చంద్ర­బాబుపై వైఎస్‌ జగన్‌ ధ్వజమెత్తారు. కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌), కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (ఎంవో­ఎస్‌పీఐ) నివేదికల్లోని గణాంకాలను ఉటంకిస్తూ చంద్రబాబు విధానాలను కడిగిపా­రేస్తూ మంగళవారం ‘ఎక్స్‌’లో వైఎస్‌ జగన్‌ పోస్టు చేశారు. ఆయన ఇంకా ఏమన్నారంటే...

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో రాష్ట్రం
‘‘చంద్రబాబు, టీడీపీ కూటమి ప్రభుత్వం 2025–­26 ఆర్థిక సంవత్సరం తొలి ఆర్నెల్లకు సంబంధించిన జీఎస్‌డీపీ అంచనాలను విడుదల చేసింది. ముందస్తు అంచనాల గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం తయారు చేయగలుగుతుంది. కావాలనుకుంటే వక్రీ­క­రించగలు­గుతుంది కూడా. కానీ, రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్‌... రాష్ట్ర ఖాతాలను ఆడిట్‌ చేసి వెల్లడించే గణాంకాలను ఎట్టి పరిస్థితు­ల్లోనూ ఎవరూ వక్రీకరించలేరు. రాష్ట్ర ఖాతాలను పరిశీలించి కాగ్‌ విడుదల చేసిన గణాంకాల ద్వారానే ఏపీ ఆర్థిక పరిస్థితి వాస్తవికత ఏంటో తెలుస్తుంది. కాగ్‌ గణాంకాలు చంద్రబాబు సలహా ప్రకారమో లేక ఆయన మార్గనిర్దేశంలోనో తయారై­నవి కావు. రాష్ట్ర ప్రభు­త్వా­నికి వచ్చిన నిజమైన ఆదాయాలు, చేసిన వాస్తవ ఖర్చుల ఆధారంగా ఈ సమగ్ర గణాంకాలు వెల్లడ­వుతాయి.

 ఈ ఆర్థిక ఏడాది మొదటి అర్ధభాగంలో కాగ్‌ విడుదల చేసిన గణాంకాల ప్రకారం వాస్తవం ఏమిటంటే... రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తీవ్ర సంక్షోభంలో ఉంది. ఆదా­యాల పెరుగు­దల అతి దారుణంగా పడిపోయింది. చరిత్రలో ఎప్పుడూ లేని స్థాయిలో రాష్ట్ర అప్పులు పెరిగాయి. మూలధన వ్యయం అత్యంత తక్కువ స్థాయికి చేరింది. మూలధన వ్యయం, సగటు పౌరుడు చేసే ఖర్చు­లు ప్రమాద­కరంగా తగ్గాయి.

 

రెవెన్యూ లోటు, ద్రవ్యోల్బణం ఆందోళనకర స్థాయిలో ఉన్నాయి. భారీ అవినీతి వల్ల రాష్ట్ర ఆదాయాలకు భారీగా గండి పడు­తోంది. పరిస్థితి ఇంత దారుణంగా ఉన్నా సరే, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ బ్రహ్మాండంగా ఉందంటూ ప్రజ­లను మోసం చేయడానికి టీడీపీ ప్రభుత్వం ప్రయ­త్ని­స్తోంది. ఈ సందర్భంగా అబ్రహం లింకన్‌ గారి మాట­లను గుర్తు చేయాల్సి వస్తోంది. లింకన్‌ గారు అన్న మాటలు ఇప్పుడు చంద్రబాబుకు సరిపోతాయి.

ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పగలరా?
నేను అడిగే ఈ  ప్రశ్నలకు చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పగలరా?
నిజంగా రాష్ట్ర ఆర్థికవ్యవస్థ అభివృద్ధి చెందు­­­­­తున్నట్లైతే, రాష్ట్ర ప్రభుత్వం ఎందు­కింత ఆర్థికపరమైన ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది?
 2014–19 మధ్య మీ పాలనలో జీఎస్‌డీపీ వృద్ధి అంత గొప్పగా ఉన్నట్లైతే దేశ స్థూల ఉత్పత్తి (జీడీపీ)లో రాష్ట్రం వాటా 4.45 శాతా­నికి మాత్రమే ఎందుకు పరిమితమైంది?

 వైఎస్సార్‌సీపీకి ప్రజలిచ్చిన ఐదేళ్ల కాలంలో కోవిడ్‌ మహమ్మారి కారణంగా రెండేళ్ల పాటు సంక్షోభం తలెత్తినా సరే... వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం హయాంలో దేశ జీడీపీలో రాష్ట్రం వాటా (2019–24) మధ్య 4.78 శాతంగా ఉన్న మాట వాస్తవం కాదా?
మీ పాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ అంత బాగా నడిచినట్లైతే, తలసరి ఆదాయంలో జాతీయ స్థాయిలో రాష్ట్రం ర్యాంకు ఒక్క మెట్టు అయినా ఎందుకు పెరగలేదు?
((చంద్రబాబు వాస్తవిక సమర్థత గురించి, అలాగే 2019–24 మధ్య వైఎస్సార్‌సీపీ పాలనలో జరిగిన వాస్తవ ఆర్థిక పురోగతిని వివరిస్తూ, ఆయన అబద్ధాలను బట్టబయలు చేస్తూ ఈ ట్వీట్‌కు స్లైడ్‌లను జత చేశాం. వీటిని అందరూ ఓసారి పరిశీలించాలని విజ్ఞప్తి చేస్తున్నాను.))

 

బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట
  2014–19 కాలానికి చెందిన జీఎస్‌డీపీ సీఏజీఆర్‌ను, 2019–24 కాలానికి చెందిన సీఏజీఆర్‌తో పోల్చి.. తాను 2019–24 మధ్య అధికారంలో కొనసాగి ఉంటే 2023–24లో రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు 13.5 శాతం అయ్యేదంటూ చంద్రబాబు అత్యంత బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు.

2019–24 మధ్య ప్రపంచంలోని ప్రతి ప్రభుత్వం కోవిడ్‌ కారణంగా అనూహ్యమైన ఆర్థిక సంక్షోభాన్ని, అలాగే దాన్నుంచి కోలుకోవడంలో కఠినమైన ఆర్థిక పరిస్థితులను ఎదుర్కొంది. ఇలాంటి పరిస్థితుల్లో, తాను అధికారంలో ఉంటే 13.5 శాతం వృద్ధి సాధించేవాడినని చంద్రబాబు చెప్పడం రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నం తప్ప మరొకటి కాదు.

 సీఏజీఆర్‌ అనేది మొదటి సంవత్సరం, చివరి సంవత్సరాన్ని మాత్రమే ఆధారంగా తీసుకుని లెక్కిస్తారు. కానీ, ప్రతి సంవ­త్సరానికీ గణాంకాలను విడివిడిగా విశ్లేషిస్తేనే సంపూర్ణమైన, నిజమైన పోలిక సాధ్యమవుతుంది. ఆ వివరాలను ఒక్కసారి చూస్తే... 2014–19 కాలంలో దేశ జీడీపీలో ఏపీ వాటా 4.54 శాతం మాత్రమే. అదే 2019–24 మధ్య మా ప్రభుత్వ హయాంలో 4.78 శాతం. ఇది మాత్రమే కాదు.. అత్యంత తీవ్రమైన సంక్షోభ సంవత్సరాలైన 2020–21, 2021–22లో దేశ జీడీపీలో ఏపీ వాటా వరుసగా 4.93 శాతం, 4.79 శాతం.

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేద, మధ్యతరగతి వర్గాలకు అనుకూలంగా తీసుకొచ్చిన విధానాలు, దీంతోపాటు అభివృద్ధి మీద పెట్టిన దృష్టి కారణంగా... కోవిడ్‌ సంక్షోభం వల్ల తలెత్తిన ఆర్థిక ఒత్తిడిని దేశంతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో మరింత సమర్థంగా ఎదుర్కోగలిగాం. 
ఇంత స్పష్టమైన గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ, అత్యంత దారుణ పనితీరును చంద్రబాబు ప్రదర్శించినప్పటికీ, తాను
ఇంకా మెరుగ్గా పనిచేసే వాడిని అని ఆయన ఎలా చెప్పగలరు?

భారీగా అవినీతి... రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం తగ్గడమే దీనికి నిదర్శనం
టీడీపీ కూటమి ప్రభుత్వం వెల్లడించిన అంచనాల ప్రకారం 2024–25 తొలి ఆర్నెల్లలో రాష్ట్ర జీఎస్‌డీపీ వృద్ధి రేటు 9.89 శాతం.. 2025–26 తొలి ఆర్నెల్లలో 10.91 శాతం. ఈ రెండేళ్ల మొత్తాన్ని కలిపిచూస్తే జీఎస్‌డీపీ సీఏజీఆర్‌ 10.40 శాతం మాత్రమే కనిపిస్తోంది.
⇒  సహజంగానే, ఈ స్థాయి జీఎస్‌డీపీ వృద్ధితో పాటు రాష్ట్ర సొంత ఆదాయాలు కూడా కనీసం 10 శాతం సీఏజీఆర్‌తో పెరగాలి. కానీ, వాస్తవ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. అంతేకాదు ఇంకా నిరాశాజనకంగా ఉంది.

 రాష్ట్రంలో ప్రజల కొనుగోలు శక్తిని ప్రతిబింబించే ఎస్‌జీఎస్‌టీ ఆదాయాల సీఏజీఆర్‌ 4.35 శాతం మాత్రమే పెరిగాయి. సేల్స్‌ ట్యాక్స్‌ ఆదాయాల సీఏజీఆర్‌ –2.80 శాతానికి తగ్గిపోయాయి. మొత్తంగా చూస్తే, రాష్ట్ర 
సొంత ఆదాయాల సీఏజీఆర్‌ కేవలం 2.58 శాతం మాత్రమే. 

కొత్త ప్రభుత్వం మద్యం విధానంలో పెద్ద పెద్ద మార్పులు చేసినప్పటికీ.. మద్యం రిటైల్‌ను ప్రైవేటీకరించడం, షాపులు పెంచడం, విక్రయ వేళలపై పరిమితులను ఎత్తివేయడం, బెల్ట్‌ షాపులను ప్రోత్సహించడం, అక్రమ పర్మిట్‌ రూమ్‌లను తిరిగి అనుమతించడం తదితర తీవ్ర మార్పుల తర్వాత కూడా ఎక్సైజ్‌ సుంకం సీఏజీఆర్‌ కేవలం 5.10 శాతం మాత్రమే పెరిగింది. లిక్కర్‌ వ్యవహారంలో భారీ అవినీతి జరుగుతుందనే విషయాన్ని ఈ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. రాష్ట్ర ఆదాయాల సీఏజీఆర్‌ ఎక్కడా 10 శాతానికి దగ్గరగా కూడా లేదు. అది కేవలం 2.58 శాతం మాత్రమే. అన్నిటికంటే ముఖ్యంగా, రాష్ట్ర ప్రభుత్వం చేసిన మూలధన వ్యయం (కేపిటల్‌ ఎక్స్‌పెండేచర్‌) భయంకరంగా పడిపోయి సీఏజీఆర్‌ –16 శాతంగా నమోదైంది.

 నిజమైన వృద్ధి కనిపించిన ఏకైక అంశం... కేంద్ర పన్నులలో రాష్ట్రానికి లభించిన వాటా. అది కూడా సీఏజీఆర్‌ 17.78 శాతం. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పనితీరుకు సంబంధించినది. రాష్ట్ర ఆర్థిక సామర్థ్యానికి సంబంధించింది కాదు.

విద్యుత్‌ రంగంపై వాస్తవాలకు భిన్నంగా బాబు మాటలు
విద్యుత్‌ వినియోగదారులపై ఎలాంటి భారం వేయలేదని చంద్రబాబు చెబుతున్నారు. వాస్తవాలకు ఇది పూర్తి విరుద్ధం. ఎఫ్‌పీపీసీఏ (ఫ్యూయల్‌ అండ్‌ పవర్‌ పర్చేజ్‌ కాస్ట్‌ అడ్జస్ట్‌మెంట్‌) పేరుతో, చంద్రబాబు ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజలపై రూ.18,272 కోట్లు భారం వేసింది. గత ప్రభుత్వం భవిష్యత్తు ఆదాయాలపై సెక్యూరిటీ సృష్టించింది. ప్రభుత్వ ఆస్తులు తాకట్టు పెట్టింది అని చంద్రబాబు ఆరోపిస్తున్నారు. సరే గత ప్రభుత్వం రూ.25 వేల కోట్ల రుణం కోసం రూ.1,941 కోట్ల విలువైన ఆస్తులను తాకట్టు పెట్టింది. కానీ, ఇప్పుడు టీడీపీ కూటమి ప్రభుత్వం రూ.9 వేల కోట్ల బాండ్‌ల విడుదల కోసం రూ.1,91,000 కోట్ల విలువైన ఖనిజ సంపదను సెక్యూరిటీగా పెట్టింది. భవిష్యత్తు ఆదాయాలనూ అప్పుల కోసం పణంగా పెట్టింది.

ఇంకా, రాష్ట్ర సంచిత నిధి (కన్సాలిడేటెడ్‌ ఫండ్‌) మీద బాండ్‌ హోల్డర్లకు హక్కు కల్పించింది. ఇది రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని, అత్యంత ప్రమాదకర చర్య. చంద్రబాబు గారు... వైఎస్సార్‌సీపీ పాలనలో విద్యుత్‌ రంగం దెబ్బతిన్న­దని ఆరోపిస్తున్నారు. కానీ, వాస్తవాలు మాత్రం ఆయన ప్రకటనకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. టీడీపీ పాలనలో (2014–19) విద్యుత్‌ రంగపు అప్పులు సీఏజీఆర్‌ 23.88 శాతం. వైఎస్సార్‌సీపీ పాలనలో (2019–24) ఆ అప్పుల పెరుగుదల సీఏ­జీ­ఆర్‌ 7.28 శాతం మాత్రమే. అంటే.. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని సమర్థవంతంగా నిర్వహించిందని స్పష్టమవుతోంది.

వైఎస్సార్‌సీపీ పాలనలో పారిశ్రామిక ప్రగతి
చంద్రబాబు గారు... వైఎస్సార్‌సీపీ పాలనలో పెట్టుబడి­దారులు ఆంధ్రప్రదేశ్‌ను విడిచిపెట్టారని చేసిన ఆరోపణ కూడా పూర్తిగా అవాస్తవం. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఆయన తయారు చేసిన అబద్ధమే ఇది. ఎంవో­­ఎస్‌పీఐ గణాంకాల ప్రకారం.. ఏపీలో పరిశ్రమల జీవీఏ (స్థూల విలువ జోడింపు) వృద్ధి (2019–24) సీఏజీఆర్‌ 11.14 శాతం. అదే కాలంలో దేశ పరిశ్రమల జీవీఏ వృద్ధి సీఏజీఆర్‌ 8.96 శాతం. అంటే, వైఎస్సార్‌సీపీ పాలనలో పారిశ్రామిక వృద్ధిలో దేశ సగటు కంటే రాష్ట్రం ఎక్కువ వృద్ధిని సాధించిందన్నది స్పష్టమవుతోంది.

 పారిశ్రామిక వృద్ధికి సంబంధించి ఇలాంటి స్పష్టమైన విజయాలు ఉన్నప్పటికీ, పెట్టుబడిదారులు రాష్ట్రాన్ని విడిచిపెట్టారని చంద్రబాబు గారు ఎలా అంటారు? అది నిజానికి అసత్య ఆరోపణ... ప్రజలను మభ్యపెట్టే ప్రచారం మాత్రమే. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement