ఈసీతో కలిసి బీజేపీ సర్కార్ బడా మోసానికి తెరతీసింది
ఏకంగా భారతీయ భావననే పెళ్లగిస్తున్నారు
‘ఓట్ల చోరీ’కి పాల్పడిందంటూ మోదీ సర్కార్‌పై రాహుల్‌గాంధీ పెను విమర్శలు
లోక్‌సభలో చర్చ సందర్భంగా సుదీర్ఘంగా ప్రసంగించిన విపక్షనేత
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘంతో కలిసి మోదీ సర్కార్ ఓట్ల చోరీకి పాల్పడుతూ భారత్‌లోనే అతిపెద్ద దేశద్రోహానికి ఒడిగట్టిందని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్‌గాంధీ తీవ్రస్థాయి విమర్శలతో విరుచుకుపడ్డారు. ఎన్నికల సంస్కరణలు అంశంపై మంగళవారం లోక్‌సభలో చర్చ సందర్భంగా విపక్షాల తరఫున కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభలో విపక్షనేత హోదాలో రాహుల్‌గాంధీ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఈసీపై, మోదీ నేతృత్వంలోని ఎన్‌డీఏ సర్కార్‌పై విమర్శల జడి కురిపించారు.
అతిపెద్ద నేరమేదంటే.. అది ఇదే
‘‘అతిపెద్ద దేశద్రోహ నేరమంటూ ఉందంటే అది ఓట్ల చోరీనే. మీరు చేసిన ‘ఓట్ల చోరీ’ స్థాయి అతిపెద్ద నేరం దేశంలో ఇంతవరకు జరగలేదు. నిజమైన పౌరుల వాస్తవిక ఓటును హరించి దేశ ప్రజాస్వామ్య వస్త్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చేస్తున్నారు. నవభారత్‌ను విధ్వంసం చేస్తున్నారు. భారత్ అనే భావనను కూలదోస్తున్నారు. లోక్‌సభలో అటు పక్క అధికార కుర్చీల్లో కూర్చున్న వాళ్లంతా కలిసి దేశ వ్యతిరేక దుశ్చర్యలు తెగిస్తున్నారు’’ అని అన్నారు.
ఈవీఎం సంగతేంటి?
‘‘ఈవీఎంతో మీరెన్నో గిమ్మిక్కులు చేస్తున్నారు. మాకూ ఈవీఎంను తనిఖీచేసే అవకాశం ఇవ్వండి. మా సాంకేతిక నిపుణులు సైతం ఈవీఎంల పనిపడతారు. అసలు ఈవీఎంలోపల ఏం పెట్టా్టరో తేలుస్తారు. ఇప్పటిదాకా మాకు ఈవీఎంలపై కనీస హక్కు లేదు’’ అని రాహుల్ అన్నారు. ఎలక్షన్ కమిషన్లనుద్దేశిస్తూ రాహుల్ పలు వ్యాఖ్యలుచేశారు. ‘‘వాళ్లకో విషయం చెబుతున్నా. ఇప్పుడున్న సవరణ చట్టాన్ని భవిష్యత్తులో మేం అధికారంలోకి వచ్చాక మళ్లీ మారుస్తాం. అధికారంలో ఉన్నప్పుడు కమిషనర్లు తీసుకున్న తప్పుడు నిర్ణయాలకు వాళ్లనే బాధ్యులను చేస్తాం. కారకుల భరతం పడతాం’’ అని రాహుల్ పరోక్షంగా హెచ్చరించారు.
మళ్లీ బ్రెజిల్ యువతి ప్రస్తావన
హరియాణాలో బ్రెజిల్ యువతి పేరు ఓటర్ల జాబితాలో 22 సార్లు వచ్చిందన్న అంశాన్ని రాహుల్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ‘‘బ్రెజిల్ యువతి మాత్రమేకాదు ఎంతో మందిపేర్లు ఇలా హరియాణా ఓటర్ల జాబితాలో పలుమార్లు పునరావృతమయ్యాయి. ఒక మహిళ పేరు ఏకంగా 200 సార్లు ఉంది. ఇవన్నీ చూశాక హరియాణా ఎన్నికలు చోరీ అయ్యాయనేది సుస్పష్టం. ఇది ఎలక్షన్ కమిషన్ కనుసన్నల్లోనే జరిగింది’’ అని రాహుల్ వ్యాఖ్యానించారు.‘‘బిహార్‌లో ప్రతిష్టాత్మకంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్‌ఐఆర్) సర్వే చేపట్టామని ఈసీ ఘనంగా చెప్పుకుంది. మరి అలాంటప్పుడు మళ్లీ 1.2 లక్షల డూప్లికేట్ ఫొటోలు ఎలా తుది జాబితాలో ప్రత్యక్షమయ్యాయి? ఈ ప్రశ్నకు ఈసీ దగ్గర సూటి సమాధానమే లేదు’’ అని రాహుల్ ఎద్దేవాచేశారు.
మనది గొప్పదైన ప్రజాస్వామ్యం
అందరూ మనది అతిపెద్ద ప్రజాస్వామ్యం అంటారు. వాస్తవానికి మనది గొప్పదైన ప్రజాస్వామ్యం. అమెరికా తమది పురాతన ప్రజాస్వామ్యం అంటుంది. నిజానికి మనదే గొప్పది. అత్యధిక మంది ఓటర్లు, భిన్న ప్రాంతాలు, మతాలు, భాషలు, రాష్ట్రాల సమ్మేళనంగా భారత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది. ప్రజలందర్నీ ఒక్కతాటి మీదకు తెస్తున్న ఇదే ప్రజాస్వామ్యభావనకే బీజేపీ తూట్లు పొడుస్తోంది. ధ్వంసం చేస్తున్నామని వాళ్లకూ తెలుసు. ఆనాడు గాంధీజీని ఆర్‌ఎస్‌ఎస్ వ్యక్తి నాథూరాం గాడ్సే మూడు బుల్లెట్లు ఛాతీలో దింపి మహాత్ముడి ప్రాణాలను బలితీసుకున్నాడు.
బీజేపీ వాళ్లు నాటి చేదు నిజాన్ని ఒప్పుకోవాల్సిందే. గాంధీజీ హత్యతో అక్కడితో ఆ ఘోర క్రతువు ఆగిపోలేదని నేడు ఇప్పుడు నాకు అనిపిస్తోంది. ఓటు చోరీతో సాధించిన అధికారంతో రాజ్యాంగబద్ధ సంస్థలన్నింటినీ ఆర్‌ఎస్‌ఎస్ గుప్పిటపట్టే దుస్సాహసానికి తెరతీసింది. నాడు గాంధీజీ హత్యోదంతం తొలి మెట్టు అయితే తర్వాతి మెట్టు ఇప్పటి రాజ్యాంగబద్ధ వ్యవస్థను కబళించడం’’ అని అన్నారు. ‘‘ ఓటు చోరీ అనేది అతిపెద్ద దేశద్రోహం. ప్రజాస్వామ్యాన్ని ధ్వంసంచేసేందుకు బీజేపీ, ఈసీ మూకుమ్మడిగా బయల్దేరాయి. ప్రజల గొంతుకను తొక్కిపెడుతున్నాయి’’ అని తర్వాత ‘ఎక్స్’లో రాహుల్ ఒక పోస్ట్ పెట్టారు.
3 ప్రశ్నలకు సమాధానం చెప్తారా?
చర్చ సందర్భంగా మోదీ సర్కార్‌పై రాహుల్ మూడు సూటి ప్రశ్నలను సంధించారు.
1.‘‘ఎలక్షన్ కమిషన్ల నియామక ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని ఎందుకు తప్పించారు?. సీజేఐను తొలగించడానికి వెనుక మతలబు ఏంటి? సీజేఐ అంటే మాకు పూర్తి విశ్వాసం ఉంది. అలాంటి సీజేఐకు ఎలక్షన్ కమిషన్ నియామక ప్రక్రియ నుంచి ప్రభుత్వం ఏ కారణంతో పక్కకు తప్పించింది?. ఆనాడు ఎలక్షన్ కమిషన్ల ఎంపిక సంబంధ భేటీకి నేనూ హాజరయ్యా. ఇటు పక్క నేను కూర్చున్నా. అటు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆసీనులయ్యారు. అక్కడ నా వాదనలకు వీసమెత్తయిన విలువ లేకుండా పోయింది. వీళ్లిద్దరు ఏం ఆలోచించారో అది మాత్రమే ఆచరణలోకి వచ్చింది. కేవలం ఫలానా వ్యక్తులు మాత్రమే ఎలక్షన్ కమిషనర్‌లుగా రావాలని ఎందుకు ప్రధాని, హోం మంత్రి అంతగా దృష్టిసారిస్తున్నారు?
2.‘‘దేశ చరిత్రలో గతంలో ఏ ప్రధాని చేయనట్లుగా మోదీ 2023 డిసెంబర్‌లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇతర ఎలక్షన్ కమిషనర్లకు నేర విచారణ నుంచి మినహాయింపు కల్పిస్తూ చట్టసవరణ తీసుకొచ్చారు. దీంతో ఎలక్షన్ కమిషనర్లు ఈసీలో విధుల్లో ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయాలు పక్షపాతంతో కూడినవి అని తేలినా సరే వాళ్లపై ఎలాంటి విచారణ మొదలుపెట్టలేని దురవస్థ ఏర్పడింది. వాళ్లపై కేసుల ఈగ వాలకుండా మోదీ రక్షణ కల్పించారు. కమిషనర్లకు ఇంతటి రక్షణను ప్రధాని, హోం మంత్రి ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది?
3.‘‘ఎన్నికలు పూర్తయిన కేవలం 45 రోజులకే సంబంధిత సీసీటీవీ ఫుటేజీని ధ్వంసంచేయాలంటూ మోదీ సర్కార్ చట్టాన్నే మార్చేసింది. అంత అవసరం ఏమొచ్చింది?. ఇది డేటాకు సంబంధించిన అంశమంటూ ప్రభుత్వం తప్పించుకోవాలని చూసింది. ఇది డేటాకు సంబంధించిన అంశం కాదు. దీనికి ఎన్నికల చోరీతో సంబంధముంది. ఎన్నికలకు నెల రోజుల ముందే మెషీన్ చదవగలిగే ఓటర్ల జాబితాను రాజకీయపక్షాలకు అందివ్వాల్సిందే. సీసీటీవీ ఫుటేజీ తొలగింపు చట్టాన్ని సవరించాల్సిందే. అసలు సీసీటీవీ ఫుటేజీ డిలీట్ చేయాల్సిన అవసరం ఎందుకొచ్చింది?


