పేదరికం ఏంటో నాకు తెలుసు.. అందుకే ఈ తపన: సీఎం రేవంత్‌ | Telangana CM revanth Reddy Global Summit Closing Ceremony Speech | Sakshi
Sakshi News home page

పేదరికం ఏంటో నాకు తెలుసు.. అందుకే ఈ తపన: సీఎం రేవంత్‌

Dec 9 2025 9:07 PM | Updated on Dec 9 2025 9:23 PM

Telangana CM revanth Reddy Global Summit Closing Ceremony Speech

సాక్షి, ఫ్యూచర్‌సిటీ: సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన తమ ప్రభుత్వ లక్ష్యం అని.. విద్య మీద ఖర్చు చేసేది వ్యయంగా కాకుండా పెట్టుబడిగా చూస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. ఫ్యూచర్‌ సిటీ మీర్‌ఖాన్‌ పేటలో మంగళవారం జరిగిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 ముగింపు కార్యక్రమంలో పాల్గొని ఆయన ప్రసంగించారు. 

తెలంగాణ మట్టికి గొప్ప చైతన్యం ఉంది. జల్, జంగిల్, జమీన్ అని కొమురం భీమ్ పోరాడిన గడ్డ ఇది. భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం సాయుధ రైతాంగ పోరాటంలో ఎంతో మంది నేలకొరిగిన చరిత్ర ఈ ప్రాంతానిది. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాల కోసం తెలంగాణ ఎదురుచూస్తోంది. తెలంగాణ ప్రజలు కోరుకున్న స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమాన అవకాశాలు అందించేందుకు తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్‌ను తీసుకొచ్చాం

2034 నాటికి 1 ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీ లక్ష్యంగా విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించాం. ఇది నాలుగు గోడల మధ్య కూర్చుని తయారు చేసింది కాదు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిప్రాయాలు తీసుకుని తయారు చేసింది. ఆనాడు ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు జవహర్ లాల్ నెహ్రూ ప్రాధాన్యత ఇచ్చారు..

.. ఇప్పుడు మేం ఎడ్యుకేషన్, ఇరిగేషన్, కమ్యూనికేషన్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఎడ్యుకేషన్, ఇరిగేషన్ కు ప్రాధాన్యత. పేదలలో  నిరుపేదలకు సహాయం చేయడం మా ప్రాధాన్యత. సమాజంలో ఉన్న వివక్షత నిర్మూలన మా లక్ష్యం. ఎడ్యుకేషన్ కోసం ఖర్చు చేసేది వ్యయం కాదు  పెట్టుబడి. ఇప్పుడున్న ఎడ్యుకేషన్‌లో క్వాలిటీ, స్కిల్ లేదు. దాన్ని మేం నెలకొల్పుతాం. 140 కోట్ల జనాభాలో ఎంతమంది మెడల్స్ వస్తున్నాయి?. యంగ్ ఇండియా స్పోర్ట్స్ స్కూల్ నుండి గోల్డ్ మెడల్స్ తెచ్చేలా కృషి చేస్తాం

పేదరిక నిర్మూలన, నాణ్యమైన విద్య, యువతకు ఉపాధి అందించాలనే సంకల్పంతో ముందుకు వెళ్తున్నాం. పేదలకు సంక్షేమ ఫలాలు అందించాలన్నదే మా ఆకాంక్ష. కొందరికి పేదరికం ఎక్స్కర్షన్ లాంటిది.. కానీ నాకు పేదరికం ఏంటో తెలుసు. నేను గ్రామీణ ప్రాంతం నుంచి ప్రభుత్వ పాఠశాలల్లోచదువుకుని వచ్చా. నాకు పేదలు, దళితులు, ఆదివాసీలతో మంచి అనుబంధం ఉంది. పేదల కష్టాలు తెలిసినవాడిగా ప్రతీ పేదవాడికి సంక్షేమం అందించాలన్నదే నా తపన..

.. విద్యార్థి దశలోనే కులవివక్షను నిర్మూలించేందుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనార్టీ లకు ఒకే చోట విద్యను అందించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నాం. ఇది మేం ఖర్చుగా భావించడంలేదు. ఇది తెలంగాణ భవిష్యత్‌కు పెట్టుబడిగా భావిస్తున్నాం. నాణ్యమైన విద్య, స్కిల్స్ లేకపోవడంతో నిరుద్యోగం పెరుగుతోంది

అందుకే యువతలో నైపుణ్యం పెంపొందించేందుకు స్కిల్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఒలంపిక్స్ లక్ష్యంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేసుకుంటున్నాం. అట్టడుగు వర్గాల, పేదల అభివృద్ధి కోసమే ఈ తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్’’ అని రేవంత్‌ ప్రసంగించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement