రూ.7 లక్షల కోట్లు.. పదేళ్లు | Crores of funds are needed for Estimates on 3 high speed rail corridors | Sakshi
Sakshi News home page

రూ.7 లక్షల కోట్లు.. పదేళ్లు

Feb 4 2026 1:38 AM | Updated on Feb 4 2026 1:38 AM

Crores of funds are needed for Estimates on 3 high speed rail corridors

3 హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లపై అంచనాలు 

అన్నీ సవాళ్లేనన్న అభిప్రాయం

వేల హెక్టార్ల భూ సేకరణ.. అత్యంత క్లిష్టమైన నిర్మాణ పద్ధతి 

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం అత్యంత కీలకం 

భారీ మొత్తంలో నిధుల అవసరం..

కి.మీ.కు రూ.390 కోట్లకు పైనే ఖర్చు 

పనుల్లో జాప్యం జరిగితే అంచనాలు అమాంతం పెరిగే అవకాశం 

హైదరాబాద్‌ టు పుణే, చెన్నై,బెంగళూరు ప్రాజెక్టులపై కసరత్తు షురూ 

ఏప్రిల్‌ నాటికి తుది డీపీఆర్‌లు సిద్ధమయ్యే అవకాశం 

ఏప్రిల్, మే నెలల్లో భూసామర్థ్య పరీక్షలు, లైడార్‌ సర్వేలు

సాక్షి, హైదరాబాద్‌: హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు.. వేల హెక్టార్ల భూ సేకరణ.. అత్యంత క్లిష్టమైన నిర్మాణ పద్ధతి..రూ.లక్షల కోట్ల నిధులు అవసరం.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం.. ఇవన్నీ కుదరడంతో పాటు ఆటంకాలను అధిగమించి పనులన్నీ సవ్యంగా ముందుకు సాగితేనే ఈ ప్రాజెక్టులు సాకారం అయ్యేందుకు అవకాశం ఉంటుంది. పైగా ఇందుకు కొన్నేళ్ల సమయం కూడా పట్టొచ్చు. హైస్పీడ్‌ రైల్‌ కారిడార్ల నిర్మాణం అత్యంత వ్యయ ప్రయాసలతో కూడుకున్న పని. తొమ్మిదేళ్ల క్రితం ప్రారంభమైన భారత దేశ మొదటి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ (ముంబై–అహ్మదాబాద్‌) పనులు ఇప్పటికి కేవలం 56 శాతం మాత్రమే పూర్తయ్యాయంటేనే విషయం అర్థమవుతోంది. ఇందులో 100 కి.మీ. నిడివి గల సెక్షన్‌లో వచ్చే ఏడాది హైస్పీడ్‌ రైలు పరుగు పెట్టబోతోంది. 

ఇక ఈ ప్రాజెక్టు మొత్తం పూర్తి కావాలంటే మరో మూడేళ్లు ఎదురు చూడాల్సిన పరిస్థితి ఉంది. వెరసి.. 508 కి.మీ. నిడివి గల ఈ ప్రాజెక్టు పూర్తయ్యేందుకు పుష్కరకాలం పట్టబోతోందన్న మాట. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్‌కు ఒకేసారి మూడు హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లను మంజూరు చేయడం గమనార్హం. ఒకేసారి ఇలాంటి 3 ప్రాజెక్టులను చేపట్టడం భారీ సవాళ్లతో కూడుకున్న వ్యవహారంగా పేర్కొంటున్న రైల్వే శాఖ.. 8 నుంచి 10 ఏళ్ల సమయం, రూ.7 లక్షల కోట్ల వ్యయం అంచనాలతో వీటికి సంబంధించిన ప్రాథమిక పనులు ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. వచ్చే ఏప్రిల్‌ నాటికి తుది సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) సిద్ధం చేసి, ఆ వెంటనే భూ సామర్థ్య పరీక్షలు, లైడార్‌ సర్వేలు చేపట్టాలని భావిస్తోంది.  

అహ్మదాబాద్‌ ప్రాజెక్టు అనుభవం ఆధారంగా.. 
మన దేశానికి బుల్లెట్‌ రైలు అనుభవం లేదు. ప్రస్తుతం ముంబై–అహ్మదాబాద్‌ నగరాల మధ్య తొలి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ రూపొందుతోంది. జపాన్‌ సాంకేతిక, ఆర్థిక సాయంతో జరుగుతున్న ఈ పనుల్లో ఎదురైన సవాళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ రైల్వే శాఖ పనులు మందుకు సాగిస్తోంది. ఆ పనుల్లో ఎదురైన అనభవసారాన్ని ఇప్పుడు మలి హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ పనులకు ఆధారంగా చేసుకుంటోంది. వీటికి సంబంధించిన ప్రాథమిక అంచనాల్లో కూడా ఆ ప్రాజెక్టు లెక్కలనే పరిగణనలోకి తీసుకుంటోంది. ముంబై–అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్టు పనులకు 2017లో శ్రీకారం చుట్టినప్పుడు ఉన్న అంచనా వ్యయం రూ.1.10 లక్షల కోట్లు. కానీ 2026లో దాన్ని సవరించి రూ.1.98 లక్షల కోట్లకు పెంచారు. 

అంటే 80 శాతాన్ని మించి అంచనా పెరిగింది. కొత్త అంచనా ప్రకారం అక్కడ ప్రతి కిలోమీటర్‌కు రూ.390 కోట్లకు పైగా వ్యయం అవుతోంది. దీని ఆధారంగానే హైదరాబాద్‌కు మంజూరైన హైదరాబాద్‌–పుణె, హైదరాబాద్‌–చెన్నై, హైదరాబాద్‌–బెంగళూరు ప్రాజెక్టులకు దాదాపు రూ.7 లక్షల కోట్లకుపైగా వ్యయం అవుతుందని అంచనా వేస్తున్నారు. హైదరాబాద్‌–చెన్నై ప్రాజెక్టుకు రూ.2.80 లక్షల కోట్లు, హైదరాబాద్‌–బెంగళూరు ప్రాజెక్టుకు రూ.2.4 లక్షల కోట్లు, హైదరాబాద్‌–పుణె ప్రాజెక్టుకు రూ.2.10 లక్షల కోట్లు ఖర్చవుతాయన్నది ప్రాథమిక అంచనా. కాగా పనుల్లో జరిగే జాప్యం ఈ అంచనాలను అమాంతం పెంచేస్తుందనే భయం కూడా రైల్వే శాఖను వెంటాడుతోంది. 
 
వెంటనే ప్రారంభమైతే 8 నుంచి 10 ఏళ్లు 
ఈ పనులు ఇప్పటికిప్పుడు ప్రారంభమైతే, పూర్తవటానికి 8 నుంచి పదేళ్ల సమయం పడుతుందని అంచనా వేస్తున్నారు. ముంబై–అహ్మదాబాద్‌ ప్రాజెక్టుకు 1,400 హెక్టార్ల భూమిని సేకరించారు. ఇందులో 960 హెక్టార్లు ఒక్క గుజరాత్‌లోనే సేకరించారు. భూసేకరణకు సంబంధించిన పరిహారం భారాన్ని గుజరాత్, మహారాష్ట్ర ప్రభుత్వాలు భరించాయి. ఈ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన సమయంలో రెండు రాష్ట్రాల్లోనూ ఎన్డీయే ప్రభుత్వాలే ఉండటం కలిసి వచ్చింది. అయితే ఆ తర్వాత మహారాష్ట్రలో ఉద్ధవ్‌ థాకరే నేతృత్వంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరాక సహాయ నిరాకరణ ఎదురైంది. దీంతో భూసేకరణలో తీవ్ర జాప్యం జరిగింది. 

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం భూసేకరణకు సహకరిస్తేనే ఈ ప్రాజెక్టులు వడివడిగా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. కానీ రీజినల్‌ రింగు రోడ్డుకు అవసరమైన భూసేకరణ విషయంలో తొలుత ఆటంకాలు ఎదురైన సంగతి తెలిసిందే. భూసేకరణ భారీ వ్యయంతో కూడుకున్న అంశం కావటంతో రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సి ఉంది. ఈ విధంగా ఏవైనా చిక్కుముడులు ఏర్పడితే ప్రాజెక్టుల్లో తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో ముందుగా రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించాలని రైల్వే శాఖ నిర్ణయించింది. ఎదురయ్యే సవాళ్లు, ఆటంకాలను ఆదిలోనే అధిగమిస్తే ప్రాజెక్టు పనులు ఏడేళ్లలో పూర్తయ్యే అవకాశం ఉంటుందని, లేని పక్షంలో పదేళ్లు, అంతకుమించి కూడా పట్టవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.  

డీపీఆర్‌లకు ఏర్పాట్లు 
హైదరాబాద్‌–ముంబై హైస్పీడ్‌ రైల్‌ కారిడార్‌ కోసం గతంలోనే డీపీఆర్‌ సిద్ధం చేసి రైల్వే బోర్డుకు సమర్పించారు. అయితే ఇప్పుడు ఆ ప్రాజెక్టును రెండు భాగాలుగా విభజించారు. హైదరాబాద్‌కు పుణెను లింక్‌ చేశారు. ఫలితంగా మరో డీపీఆర్‌ను సిద్ధం చేయనున్నారు. ఇక చెన్నై, బెంగళూరు ప్రాజెక్టులకు కూడా డీపీఆర్‌లు రూపొందించాల్సి ఉంది. అందుకు మూడు నెలలు పట్టే వీలుంది. ఈ మూడు ప్రాజెక్టులను ఏయే మార్గాల్లో నిర్మించాలో అలైన్‌మెంటును రూపొందించే పని మార్చిలో ప్రారంభం కానుంది. చెన్నై ప్రాజెక్టును అమరావతి (ఆంధ్రప్రదేశ్‌) మీదుగా నిర్మించటం దాదాఫు ఖరారైంది. 

ఇక గుంటూరు మీదుగానా, వరంగల్‌ మీదుగానా అన్నది తేలాల్సి ఉంది. ఈ కారిడార్‌లు ఎలివేటెడ్‌ పద్ధతిలో ఉంటాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో భూమి పొరల పటుత్వాన్ని పరీక్షించాల్సి ఉంది. ఆ పరీక్షలను ఏప్రిల్‌–మే నెలల్లో ప్రారంభించనున్నారు. చెన్నై, బెంగళూరు నగరాల వైపు మైదాన ప్రాంతమే ఎక్కువగా ఉన్నందున ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణానికి పెద్దగా అవాంతరాలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. ఇక పశ్చిమ కనుమల దృష్ట్యా పుణె మార్గంలో సొరంగాల నిర్మాణం తప్పదని, ఇది ఖర్చును భారీగా పెంచుతుందని అంటున్నారు. దీనివల్ల పనుల వేగం కూడా మందగిస్తుందని చెబుతున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement